టీడీపీకి ‘పొత్తు’ పోటు

18 Jan, 2016 02:53 IST|Sakshi
టీడీపీకి ‘పొత్తు’ పోటు

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. 150 డివిజన్‌లలో 63 డివిజన్‌లను బీజేపీకి కేటాయించి, 87 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీకి ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తుల గొడవ ఎక్కువైంది. టీఆర్‌ఎస్‌తో కుమ్ముక్కై బీజేపీకి గెలిచే సీట్లను కేటాయించారని పలు డివిజన్ల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో టికెట్లు ఇప్పిస్తామని అడ్వాన్సుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న ఒకరిద్దరు నాయకులను టిక్కెట్ల కోసం నిలదీస్తున్నారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలోనే శేరిలింగంపల్లిలోని ఓ డివిజన్ టికెట్ ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకున్న ఓ ముఖ్యనేతను నిలదీసినట్లు సమాచారం.

సదరు సీటు బీజేపీకి కేటాయించడంతో తరువాత అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన నేతను బూతులు తిడుతూ తన సొమ్ము తనకు ఇమ్మని గొడవ పెట్టుకున్నట్లు సమాచారం. చివరికి ఆ డివిజన్‌కు బదులు వేరే చోట టికెట్ కేటాయించిన పరిస్థితి. అలాగే ఖైరతాబాద్, మలక్‌పేట నియోజకవర్గాల్లో కూడా కొన్ని సీట్లను బేరం చేసుకుని అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, మల్కాజిగిరి వంటి శివార్లలో బీజేపీకి సీట్లు కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు ఎన్‌టీఆర్ భవన్ వద్ద శని, ఆదివారాల్లో గొడవలకు దిగారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌లను టిక్కెట్లు దక్కని నాయకులు తీవ్ర పదజాలంతో విమర్శలకు దిగడం రెండు రోజులుగా సర్వసాధారణమైంది.
 
ఒక్కో నియోజకవర్గంలో రెండేనా?

అంబర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్‌నగర్, మలక్‌పేట, ఎల్‌బీ నగర్, మల్కాజిగిరి వంటి నియోజవకర్గాలు ఒకప్పుడు టీడీపీకి బలమైన స్థానాలు. అయితే వీటిలో బీజేపీ మెజారిటీ సీట్లను తీసుకొని టీడీపీ ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే తీసుకోవడంపై తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంబర్‌పేటలో కేవలం నల్లకుంట, ముషీరాబాద్‌లో ముషీరాబాద్, కవాడిగూడ, ఖైరతాబాద్‌లో ఖైరతాబాద్, సోమాజీగూడ, సికింద్రాబాద్‌లో మూడు, సనత్‌నగర్‌లో రెండు సీట్లలో మాత్రమే పోటీ చేయడంపై టీడీపీ కార్యకర్తలు కత్తులు దూస్తున్నారు.

మజ్లిస్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో 25 నుంచి 30 సీట్ల వరకు టీడీపీ పోటీ చేస్తుండటం, గెలిచే అవకాశాలున్న స్థానాలను బీజేపీకి కేటాయించడం నాయకత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్‌బీనగర్‌లలో బీజేపీకి అడిగినన్ని సీట్లు కేటాయించడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
బీజేపీ స్థానాల్లో రెబల్స్
150 డివిజన్‌లలో 60 సీట్లు బీజేపీకి అని మొదట భావించినప్పటికీ, తరువాత గెలుపు అవకాశాలున్న సీట్లతో పాటు మరో మూడింటిని అదనంగా ఇచ్చారని తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ సీట్లు హిమాయత్‌నగర్, అమీర్‌పేట, గాంధీనగర్ వంటి డివిజన్‌లను కూడా బీజేపీకి కేటాయించడంపై గరంతో ఉన్న నేతలు టీడీపీ అభ్యర్థులుగానే నామినేషన్లు వేశారు. స్నేహపూర్వకపోటీలో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని, బీ-ఫారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బీజేపీ పోటీ చేసిన దాదాపు అన్ని డివిజన్‌లలో టీడీపీ తరఫున ఒకటికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీ-ఫారాలు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా కొనసాగుతామని వారు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు