నేను కళ్లు తెరిస్తే మీరు ఉద్యోగాల్లో ఉండరు

14 Jul, 2015 02:40 IST|Sakshi
నేను కళ్లు తెరిస్తే మీరు ఉద్యోగాల్లో ఉండరు

మహిళా కార్మికులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
అసభ్య పదజాలంతో దూషించిన ప్రజాప్రతినిధులు

 
ఏలూరు సిటీ: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్థ కార్మికులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో సుమారు 800 మంది కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. నగరంలో చెత్త పేరుకుపోయింది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి), డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కో-ఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్లు వన్‌టౌన్ ప్రాంతంలోని కూరగాయల మార్కెట్ వద్ద పేరుకుపోయిన చెత్తను సోమవారం ప్రైవేట్ వ్యక్తులతో తొలగించేందుకు సిద్ధమయ్యారు. చెత్తను తొలగిస్తుండగా కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అడ్డుకున్నారు. రెచ్చిపోయిన ప్రజాప్రతినిధులు కార్మికులపై దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే బడేటి మహిళా కార్మికులను అసభ్యపదజాలంతో దూషించారు. ‘‘నేను కళ్లు తెరిస్తే మీరెవరూ ఉద్యోగాల్లో ఉండరు. మేము, మా కార్పొరేటర్లు వేరేవాళ్లతో పని చేయిస్తాం. ఎవడు అడ్డొస్తాడో చూస్తాం’’ అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ప్రజాప్రతినిధులను చుట్టుముట్టారు. మేము ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు మా జీవితాలను నాశనం చేయాలని చూస్తారా? అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు గంటపాటు ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి చేయిదాటిపోవటంతో ఎమ్మెల్యే బడేటి పోలీసులను పిలిపించారు.

ముగ్గురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కార్మికుల విషయాల్లో ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారని, తమ పొట్టకొట్టాలని చూస్తున్నారంటూ మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపు అక్కడే ధర్నా చేసిన కార్మికులు, అక్కడి నుంచి కార్పొరేషన్ సమ్మె శిబిరం వద్దకు చేరుకున్నారు. తర్వాత పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నా చేపట్టారు. సుమారు గంటన్నర సేపు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి, ఇతర ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడారు. కార్మికులంతా ఒట్లేస్తే గెలిచిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. సమ్మెలో భాగంగా తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణ, పారిశుధ్య పనులను నిలిపివేస్తామని ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులతో పనులు చేయిస్తున్నారని, వాటిని అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
 
 

మరిన్ని వార్తలు