‘టీ’ తయారు

28 Nov, 2013 00:50 IST|Sakshi
‘టీ’ తయారు

జీవోఎం కసరత్తు పూర్తి.. ముసాయిదా బిల్లు ఖరారు
ఇక సోనియా ఆమోదమే తరువాయి.. ఆ బాధ్యత షిండేకు
అధినేత్రి ఆమోదించాక న్యాయశాఖకు నివేదిక, టీ-బిల్లు
అనంతరం కేబినెట్‌లో ఆమోదం.. ఆ తర్వాత రాష్ట్రపతికి
నేటి కేబినెట్ భేటీకి విభజన బిల్లు, నివేదిక అనుమానమే
ఆగమేఘాల మీద ప్రక్రియను పూర్తిచేస్తేనే నేడు అవకాశం
లేదంటే రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక భేటీలో ఆమోదం
అనంతరం రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి పంపనున్న కేంద్రం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు ప్రణాళిక
అంతా అనుకున్నట్లు జరిగితే సోనియా జన్మదినం నాడే టీ-బిల్లు!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371హెచ్ లేదా ఆర్టికల్ 258ఏ కింద కేంద్రం చేతుల్లోకి హైదరాబాద్ నియంత్రణ అధికారాలు
ఈ అంశంపై నిర్ణయాధికారం షిండేకే అప్పగించిన జీవోఎం
జైరాం రమేశ్, చిదంబరంలతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
హైదరాబాద్‌ను యూటీ చేయాలంటూ మరోసారి విజ్ఞప్తి
 
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే రాష్ట్ర విభజన బిల్లు రాబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) బుధవారం తన పని పూర్తిచేసింది. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుతో పాటు, విభజన సమస్యల పరిష్కార మార్గాలపై సిఫారసులతో నివేదికనూ ఖరారు చేసింది. ఇక వీటికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదముద్ర వేయటమే మిగిలింది. సోనియా ఆమోదముద్ర తీసుకుని తుది నివేదికను సమర్పించే బాధ్యతను జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకి జీవోఎం సభ్యులు అప్పగించారని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ ముసాయిదా బిల్లు, జీవోఎం నివేదిక గురువారం జరగబోయే కేంద్ర కేబినెట్ భేటీలో ప్రవేశపెట్టే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ వర్గాలు చెప్తున్నాయి. సోనియా ఆమోదం తెలిపిన తర్వాత.. ఆమె సూచించే మార్పుచేర్పులేవైనా ఉంటే ఆమేరకు సవరించి.. ముసాయిదా బిల్లు, నివేదికను న్యాయశాఖకు పంపించాల్సి ఉంటుందని, న్యాయశాఖ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాత.. నివేదికపై జీవోఎం సభ్యులందరి సంతకాలూ తీసుకున్న తర్వాతే దానితో పాటు బిల్లు కూడా కేబినెట్ ముందుకు వస్తుందని ఆ వర్గాలు వివరించాయి. గురువారం సాయంత్రంలోగా ఈ లాంఛనాలన్నీ పూర్తిచేయటానికి సమయం చాలదని పేర్కొన్నాయి. అలాగే.. కేబినెట్ ఎజెండా నోట్‌లో కూడా తెలంగాణ అంశం లేదని తెలుస్తోంది. అయితే.. అనూహ్య రీతిలో నిర్ణయాలు జరిగి ఆగమేఘాల మీద ఫైలు హోం, న్యాయశాఖల మధ్య నడిస్తే గురువారం కేబినెట్ భేటీలో చివరి క్షణంలో జీవోఎం నివేదిక, ముసాయిదా బిల్లును పెట్టే అవకాశం లేకపోలేదని కూడా ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గురువారం కేబినెట్ ముందుకు రాలేదంటే.. మరో రెండు, మూడు రోజుల్లో కేంద్ర మంత్రివర్గాన్ని ప్రత్యేకంగా సమావేశపరిచి విభజన ముసాయిదా బిల్లు, నివేదికను ఆ భేటీలో ఆమోదించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపుతారని హోంశాఖ వర్గాలు వివరించాయి. రాష్ట్రపతి ద్వారా డిసెంబర్ మొదటి వారంలోనే రాష్ట్ర శాసనసభ సమావేశాలను నిర్వహింపజేసి.. విభజన బిల్లుపై శాసనసభ్యుల అభిప్రాయాలను కోరుతారని సమాచారం. ఈ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేసి అసెంబ్లీ అభిప్రాయాలతో కూడిన విభజన బిల్లును మళ్లీ రాష్ట్రపతికి పంపుతారని.. అనంతరం మిగతా లాంఛనాలను కూడా వేగంగా పూర్తిచేసి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే విభజన బిల్లును ప్రవేశపెట్టేలా ప్రణాళిక రూపొందించారని తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9న (సోమవారం) పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం దాదాపుగా ఖరారైనట్లేనని చెప్తున్నారు. అయితే.. సోనియాగాంధీ ఈ విషయంలో కృత నిశ్చయంతో ఉన్నప్పటికీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్న తరుణంలో విభజన బిల్లు కేబినెట్, రాష్ట్రపతి, అసెంబ్లీలను దాటుకుని ఇంత వేగంగా పార్లమెంటుకు రావటం అసాధ్యమని కాంగ్రెస్ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.
 
 విభజన కసరత్తు పూర్తయింది...
 ఆంధ్రప్రదేశ్ విభజన విధివిధానాలపై పక్షం రోజులుగా కసరత్తు చేస్తున్న జీవోఎం సభుయలు బుధవారం రోజంతా తమ నివేదికకు తుది మెరుగులు దిద్దటంలోనే నిమగ్నమయ్యారు. రక్షణమంత్రి ఎ.కె.ఆంటోనీ నివాసంలో ఉదయం ఒకసారి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం పొద్దు పోయేవరకు నార్త్ బ్లాక్‌లో మరోసారి సుదీర్ఘ కసరత్తు చేశారు. కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ మినహా జీవోఎం సభ్యులంతా ఈ భేటీలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి సహా ఆర్థిక, న్యాయ, జలనవనరుల, విద్యుత్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విధివిధానాలకు సంబంధించిన 11 అంశాలకు సంబంధించి అధికార, విపక్షాలు లేవనెత్తిన అంశాల అమలు సాధ్యాసాధ్యాలపై అధికారులు శాఖల వారీగా జీవోఎం సభ్యుల ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయా శాఖాధిపతుల సూచనల మేరకు జీవోఎం సభ్యులు తాము రూపొందించిన నివేదికకు తుది మెరుగులు దిద్దారు. సీఎస్ మహంతికి గురువారం కూడా అందుబాటులో ఉండాలని జీవోఎం సభ్యులు చెప్పినప్పటికీ ఆయనతో అరకొర అంశాలనే చర్చిస్తారని.. మిగతా కసరత్తు మొత్తం ముగించేశారని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బుధవారం రాత్రి జీవోఎం సభ్యుల సమాలోచనలు ముగిసి నివేదికలో పొందుపరచాల్సిన సిఫారసులపై ఒక నిర్ణయానికి వచ్చిన మీదట సదరు సిఫారసులకు జీవోఎం సభ్యుడైన జైరాంరమేశ్ స్వయంగా నివేదికకు తుది మెరుగులు దిద్దారని.. ఇందుకోసమే మిగతా సభ్యులందరూ వెళ్లాక కూడా జైరాం హోంశాఖ కార్యాలయంలో గడిపారని ఆ వర్గాలు తెలిపాయి. బుధవారం జరిగిన జీవోఎం సమావేశమే చివరిదని.. ఈ కీలక సమావేశంలోనే అన్ని విషయాలనూ సభ్యులు తేల్చివేశారని సమాచారం. ఈ నివేదికకు పార్టీ అధినేత్రి సోనియాంగాంధీ ఆమోదముద్ర తీసుకున్న తర్వాత.. అది న్యాయశాఖకు వెళ్తుందని, అక్కడినుంచి వచ్చాకే హోంశాఖ దానిపై జీవోఎం సభ్యులందరి సంతకాలను తీసుకుని కేబినెట్‌కు పంపే ఏర్పాట్లు చేస్తుందని ఆ వర్గాలు వివరించాయి.
 
 కేంద్రం చేతికి హైదరాబాద్ పాలన!
 జీవోఎం ఖరారు చేసిన నివేదికలోని అంశాలపై సభ్యులందరూ గుంభనంగా ఉన్నప్పటికీ.. హైదరాబాద్ విషయంలో పాలనా వ్యవహారాలను కేంద్రం చేతికి తీసుకోవటం వైపే జీవోఎం సభ్యులు మొగ్గుచూపారని వినిపిస్తోంది. సీమాంధ్ర కేంద్రమంత్రులు కోరుతున్నట్లుగా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారిస్తే లేనిపోని తలనొప్పులన్నీ వస్తాయని.. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇంత ప్రక్రియనూ సాగిస్తున్నామో ఆ ప్రయోజనమే దక్కకుండా పోతుందనే అభిప్రాయం జీవోఎం చర్చలో వ్యక్తమైనట్లు హోంశాఖ వర్గాల కథనం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371హెచ్ లేదా ఆర్టికల్ 258ఏ ప్రకారం హైదరాబాద్ నియంత్రణను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలన్నది జీవోఎంలో జరిగిన నిర్ణయంగా ప్రచారం జరుగుతోంది. ఈ రెండింటిలో ఏ మార్గాన్ని ఎంచుకోవాలనేది హోంమంత్రి షిండే నిర్ణయానికే విడిచిపెట్టారని.. ఆయన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి మహంతితో, హోంశాఖ సలహాదారులు, ఉన్నతాధికారులతో గురువారం చర్చించి ఈ విషయంలో సందిగ్ధతకు తెరదించుతారని చెప్తున్నారు. ఇదొక్కటి తప్పించి మిగతా అన్ని అంశాలపైనా విస్పష్టమైన సిఫారసులను జీవోఎం నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. సీమాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలనే దానిపైనా కచ్చితమైన సిఫారసును పెట్టారని.. అయితే ప్యాకేజీల మొత్తాన్ని సోనియా ఆదేశానుసారం షిండే ఈ నివేదికలో చేరుస్తారని తెలిసింది. సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇప్పటికే సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అపాయింట్‌మెంట్లు కోరినందున.. వారు కలిసిన వెంటనే అధినేత్రి నుంచి వచ్చే ఆదేశాలను పాటిస్తూ వారికి ఏదో ఒక తీరున కొంత న్యాయం చేశామనిపించటానికి ప్యాకేజీల మొత్తాల్ని నివేదికలో స్పష్టంచేస్తారని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు