కేసీఆర్‌కు ఘన స్వాగతం

22 Feb, 2017 02:58 IST|Sakshi
కేసీఆర్‌కు ఘన స్వాగతం

మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న సీఎం
- సతీమణి, కుటుంబసభ్యులతో పయనం.. వెంట స్పీకర్, ఐదుగురు మంత్రులు
- విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఏపీ మంత్రి బొజ్జల దంపతులు
- ఘనంగా అతిథి మర్యాదలు చేసిన టీటీడీ అధికారులు
- నేడు శ్రీవారికి ఆభరణాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి
- కేసీఆర్‌ను కలసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి


సాక్షి, తిరుమల

‘తెలంగాణ’ మొక్కులు చెల్లించుకునేం దుకు తిరుమలకు వెళ్లిన సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం సతీమణి శోభ, కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్‌ల కుటుంబాలతో ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్‌కు.. ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దంపతులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అందరూ రోడ్డు మార్గంలో 7.15 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు, అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కేసీఆర్‌ రాకకు ముందే సాయంత్రం ఐదు గంటల సమయంలో రేణిగుంటకు వచ్చిన మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డిలు వారి కుటుంబాలతో తిరుమలకు చేరుకున్నారు.

ఘనంగా ఆతిథ్యం
సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వచ్చిన కేసీఆర్‌కు టీటీడీ ఘనంగా అతిథి మర్యాదలు చేసింది. టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు, జేఈవోతోపాటు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి వారితో కలసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్‌ కుటుంబానికి శ్రీకృష్ణ అతిథి గృహాన్ని.. స్పీకర్‌ మధుసూదనాచారి, ఐదుగురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేర్వేరుగా వీఐపీ అతిథి గృహాలను కేటాయించారు. ప్రత్యేకంగా అల్పాహారం, భోజనం అందించారు. ఇంటెలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్, సీఎం భద్రతాధికారి ఎంకే సింగ్, టీటీడీ సీవీఎస్‌వో శ్రీనివాస్‌ తదితరులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

నేడు శ్రీవారికి ఆభరణాల సమర్పణ
‘తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే స్వర్ణాభరణాలు సమర్పిస్తా’నని ఉద్యమ సమయంలో తిరుమలకు వచ్చిన సందర్భంగా కేసీఆర్‌ మొక్కుకున్నారు. తాజాగా ఆ మొక్కు తీర్చేందుకు మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకుని బస చేశారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులు, మంత్రులతో కలసి కేసీఆర్‌ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా రూ.5 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. ఇందులో రూ.3.7 కోట్ల విలువైన 14.2 కిలోల స్వర్ణసాలగ్రామ హారం, రూ.1.21 కోట్ల విలువైన 4.650 కిలోల స్వర్ణ కంఠాభరణాన్ని శ్రీవారికి సమర్పిస్తారు. తిరుగు ప్రయాణంలో తిరుచానూరు అమ్మవారికి ముక్కు పుడకను సమర్పిస్తారు.

విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో జనం
రేణిగుంట: తెలంగాణ మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన కేసీఆర్‌కు ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ స్వాగతం పలికారు. ఇక తెలంగాణ సీఎం హోదాలో తొలిసారిగా తిరుపతికి రావడంతో.. కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు మంగళవారం మధ్యాహ్నం నుంచే విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. సుమారు నాలుగువేల మంది వరకు అక్కడికి చేరుకోగా.. పోలీసులు వారిని లోనికి అనుమతించలేదు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు కొందరు మహిళలు లంబాడీ వేషధారణలో వచ్చారు. కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ల ఫొటోలతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఇక తిరుపతి మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ కందాటి శంకర్‌రెడ్డి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులతో కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు వచ్చారు.

తిరుపతి ఎమ్మెల్యేకు చేదు అనుభవం
కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెల్యే సుగుణమ్మను విమానాశ్రయం భద్రతాధికారులు ప్రవేశద్వారం వద్ద అడ్డుకున్నారు. అది చూసిన రేణిగుంట డీఎస్పీ నంజుండప్ప ఆమెకు ప్రత్యేక ఎంట్రీ పాస్‌ తీసుకొచ్చి ఇవ్వడంతో లోనికి పంపారు.

తెలుగువారిగా కలిసుంటాం: కవిత
రాష్ట్రం రెండు ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలిసే ఉంటామని ఎంపీ కవిత పేర్కొన్నారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కులు చెల్లించేందుకు తిరుమలకు రావటం ఆనందంగా ఉందన్నారు. తాను వ్యక్తిగతంగా ఏటా తిరుమల వస్తుంటానని.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగాలనే తిరుమలేశుడిని కోరుకుంటానని చెప్పారు.

‘భగీరథ’దేశం గర్వించదగ్గ మిషన్‌: మిథున్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌ చేపట్టిన మిషన్‌ భగీరథ దేశం గర్వించదగిన గొప్ప కార్యమని, దానిని ప్రధాని మోదీ కూడా మెచ్చుకున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి గొప్పనేత శ్రీవారి దర్శనానికి వచ్చిన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలసి అభినందించడం ఆనందంగా ఉందని చెప్పారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అద్భుతమని కొనియాడారు. మిథున్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కేసీఆర్‌ను కలిశారు.

కేసీఆర్‌లా ఏపీలో ప్రతిపక్షాలకు గౌరవమివ్వాలి: చెవిరెడ్డి
సీఎం కేసీఆర్‌ తెలంగాణలో ప్రతిపక్షాలకు గౌరవం, ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఏపీలో ప్రతిపక్షాలకు సీఎం చంద్రబాబు అందులో 10 శాతమైనా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలను కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తుంటే.. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు.

ప్లకార్డులను అడ్డుకున్న పోలీసులు
సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ‘స్వాగతం, సుస్వాగతం’అని రాసి ఉన్న ప్లకార్డులు, గజ పుష్పమాలతో కేసీఆర్‌ బస చేసిన శ్రీకృష్ణ అతిథి గృహం వద్దకు వచ్చారు. కానీ పోలీసులు తిరుమల సంప్రదాయాల ప్రకారం రాజకీయపరంగా పూలమాలలు వేయరాదంటూ వాటిని స్వాధీనం చేసుకున్నారు.

రన్‌వేపై దిగబోయి పైకి లేచిన విమానం!
మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎంవో అధికారులు, మంత్రి హరీశ్‌రావు బంధువులతో రేణిగుంట చేరుకున్న విమానం రన్‌ వేపై దిగినట్లే దిగి, ఒక్కసారిగా మళ్లీ పైకి లేచింది. దీంతో విమానంలో ఉన్న అధికారులు, మిగతా ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆ ఎయిరిండియా ఏ1 541 విమానం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రేణిగుంటకు చేరుకుంది. రన్‌వేపై దాదాపు దిగబోయిన విమానం.. పది మీటర్ల ఎత్తు నుంచే మళ్లీ పైకి లేచింది. ఆకాశంలో రెండు చక్కర్లు కొట్టి, కాసేపటి తర్వాత రన్‌వేపై దిగింది. దీనికి అధికారులెవరూ స్పష్టమైన కారణాలు చెప్పలేదు. అయితే గ్రౌండ్‌ కంట్రోల్‌ సిగ్నల్‌ అందలేదని, క్లియర్‌ టు ల్యాండ్‌ సమాచారం అందడంలో ఆలస్యంతో అలా జరిగిందన్న కారణాలు వినిపించాయి.

>
మరిన్ని వార్తలు