సురక్ష, జీవన్‌జ్యోతి... నేటి నుంచే

1 Jun, 2015 04:07 IST|Sakshi

 ప్రతి ఒక్కరికీ బీమా కోసం ప్రధాని పథకాలు
 ప్రమాద బీమా కోసం సురక్ష; టర్మ్ ఇన్సూరెన్స్‌కు జీవన్‌జ్యోతి
 
 భారతదేశంలో ప్రతిఒక్కరికీ బీమా ఉండాలి!! ఇదీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. అందుకే మొన్నటికి మొన్న ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండాలన్న లక్ష్యంతో ‘జన్-ధన్’ పేరిట ఖాతాలు తెరిపించిన కేంద్రం... ఇపుడు ఆ బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ అత్యంత చౌకగా బీమా అం దించే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టింది. కేవలం ఏడాదికి రూ.12 చెల్లిస్తే వర్తించేలా ప్రమాద బీమాను, ఏడాదికి రూ.330 చెల్లిస్తే వర్తించేలా టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
 
 ఇవన్నీ సోమవారం నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే కోట్లాది మంది వారి బ్యాంకుల్లో ఈ బీమా పథకాల కోసం రిజిస్టరు చేయించుకున్నారు. చేయించుకోని వారు ఇప్పుడైనా చేయించుకోవ చ్చు. అయితే ఎప్పుడు చేయించుకున్నా ఈ పథకం జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకే వర్తిస్తుంది. అంటే మీరు జూన్ నెలలో ఎప్పుడు కట్టినా 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. వీటిలో చేరేదెలా? ఎప్పుడు చేరాలి? చేరితే ఏమిటి లాభం? అర్హులెవరు? ఇవన్నీ తెలిపేదే ఈ కథనం...
 
 ప్రధానమంత్రి సురక్ష బీమా...
 కేవలం ప్రమాదంలో మరణించినా... లేక అంగవైకల్యం సంభవించినా నష్టపరిహారం చెల్లించే బీమా పథకమిది. రెండు లక్షల బీమా కవరేజీ కోసం ఏడాదికి రూ.12 ప్రీమియంగా చెల్లిస్తే సరిపోతుంది. 18 నుంచి 70 సంవత్సరాల వయసున్న ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. కేవలం ఏదైనా ప్రమాదం సంభవించి మరణించినపుడో, లేక ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తేనో మాత్రమే ఈ పథకం కింద క్లెయిమ్ చేసుకోవటానికి వీలుంటుంది. అందుకే ప్రీమియం నెలకు రూపాయి చొప్పున ఏటా రూ.12గా నిర్ణయించారు.
 
 ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి పథకం...
 ఇది పూర్తిగా టర్మ్ ఇన్సూరెన్స్ పథకం. ఈ పథకం కింద ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది. సహజంగా మరణించినా, లేక ప్రమాదంలో మరణించినా ఈ 2 లక్షల నష్టపరిహారం లభిస్తుంది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కావడంతో కేవలం క్లెయిమ్ చేసుకోవటం తప్ప పాలసీ కాలం ముగిశాక మెచ్యూరిటీ మొత్తం చెల్లించటమనేది ఉండదు. ఈ పాలసీని ఏడాదికోసారి రూ.330 చెల్లించి పునరుద్ధరించుకోవాలి. ఏ సంవత్సరమైనా చెల్లించని పక్షంలో పాలసీ కవరేజీ వర్తించదు. 18 నుంచి 50 ఏళ్ళ వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. అయితే గరిష్టంగా 55 ఏళ్ళ వరకు మాత్రమే పాలసీని కొనసాగించే వీలుంటుంది. 55 ఏళ్ల తరవాత కొనసాగిద్దామన్నా కుదరదు.
 
 పాలసీ కాలపరిమితి ఏటా జూన్ 1 నుంచి వర్తిస్తుంది. తరువాతి సంవత్సరం మే 31తో ముగుస్తుంది. అందుకని ఇప్పటికీ నమోదు చేయించుకోనివారు వీలైనంత త్వరగా చేయించుకోవటం మంచిది. ఎందుకంటే ఎప్పుడు చేయించినా అది జూన్ 1 నుంచే వర్తిస్తుంది కనక. ఈ బీమా పథకంలో చేరాలనుకున్నవారు వారికి సేవింగ్స్ బ్యాంకు ఖాతా ఏ బ్యాంకులో ఉందో... ఆ బ్యాంకును సంప్రదిస్తే సరి. ఇక ఏటా ప్రీమియం చెల్లించడానికి కూడా బ్యాంకుకు ఒక డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. బ్యాంకే మీ ఖాతా నుంచి డబ్బు డ్రా చేసుకుంటుంది.
 

మరిన్ని వార్తలు