ముల్లును ముల్లుతోనే..!

22 Jan, 2016 11:43 IST|Sakshi
ముల్లును ముల్లుతోనే..!

* టిట్ ఫర్ టాట్ సూత్రంతో కిడ్నీ రాకెట్ సూత్రధారి అరెస్ట్
* ఆన్‌లైన్ కిడ్నీ వ్యాపారుల గుట్టు ఆన్‌లైన్‌లోనే సేకరణ
* కొరియర్ పేరిట వెళ్లి అదుపులోకి తీసుకున్న నల్లగొండ పోలీసులు
* మరో కీలక ఏజెంట్‌ది మధ్యప్రదేశ్


సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముల్లును ముల్లుతోనే తీయాలనే ఆలోచన.. టిట్ ఫర్ టాట్ సూత్రాన్ని కలగలిపి అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను ఛేదించారు నల్లగొండ పోలీసులు. దేశవ్యాప్తంగా 12కు పైగా రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన 20 రోజుల్లోపే రాకెట్ కీలక సూత్రధారిని పట్టుకున్న వీరు నేర పరిశోధనలో తాము ఎవరికీ తీసిపోమని నిరూపించారు.

ఏడేళ్లుగా ‘ఆన్‌లైన్ ఇంటర్నెట్’ను ఆయుధంగా చేసుకుని కిడ్నీ మాఫియాను తయారు చేసిన జాతీయస్థాయి కీలక ఏజెంట్ గుజరాత్‌కు చెందిన సురేశ్ ప్రజాపతిని పట్టుకునేందుకు అదే ఆన్‌లైన్‌ను వినియోగించారు. అతనికి సహకరిస్తున్న దిలీప్ ఉమేద్‌మాల్ చౌహాన్‌ను అహ్మదాబాద్‌లో  పోలీసులు పట్టుకున్నారు.
 
‘పాయింట్ బ్లాంక్’ అరెస్ట్
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ రాకెట్ సూత్రధారి సురేశ్ ప్రజాపతిని అహ్మదాబాద్‌లోని అతడి ఇంటికే నేరుగా వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి కిడ్నీ రాకెట్‌లో నల్లగొండకు చెందిన కస్పరాజు సురేశ్ తదితరులు అరెస్టయిన విషయం అప్పుడే ప్రజాపతికి తెలిసిపోయింది. దీంతో అతను అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. తాను ఆన్‌లైన్‌లో పెట్టిన నంబర్‌ను ఉపయోగించడం మానేశాడు. అహ్మదాబాద్‌లోని తన ఆఫీసును మూసేశాడు. కొన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఉందామనే ఆలోచనతో తన సహచరులను కూడా అలర్ట్ చేశాడు.

నల్లగొండ పోలీసులు ఆన్‌లైన్ సాయంతోనే ప్రజాపతి దగ్గరకు వెళ్లగలిగారు. ప్రజాపతి ఉపయోగించే ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి ఓ నంబర్ సాయంతో ప్రవేశించి అతని ఫ్రెండ్స్ లిస్టును ట్రాప్ చేశారు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ లిస్టులో నుంచి ప్రజాపతి స్నేహితులను ఎంచుకుని వారిని సంప్రదించి అతడి గురించి ఆరా తీశారు. పూర్తి సమాచారం రాబట్టాక అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడ వల వేశారు. ప్రజాపతి ఉన్న ఇల్లును కనుగొన్నారు. అతడు ఇంట్లోనే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత అతను ఉపయోగించే ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఓ కొరియర్ వచ్చిందంటూ వెళ్లి డోర్ కొట్టారు.

డోర్ తీసిన వెంటనే కొరియర్ వచ్చిందన్న విషయం చెప్పి మంచినీళ్లు కావాలని అడిగి ఇంటి లోపలికి వెళ్లిపోయారు. ఇంట్లో సురేశ్ ప్రజాపతి కనిపించడంతో అతడేనని నిర్ధారించుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక, కిడ్నీ రాకెట్‌లో మరో కీలక ఏజెంట్ దిలీప్‌ను కూడా ఆన్‌లైనే పట్టించింది. అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని ఎరగా వేసి దిలీప్‌ను పట్టుకున్నారు. ఓ స్థానికుడి ద్వారా ఆన్‌లైన్‌లో ఉన్న అతడి నంబర్‌కు ఫోన్ చేయించి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఫలానా దగ్గరకు రావాలని సమాచారం అందించారు. దిలీప్ వెంటనే ఆ వ్యక్తి చెప్పిన దగ్గరకు రావడం, అనూహ్యంగా పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకోవడం వెంటనే జరిగిపోయాయి.  
 
ప్రజాపతిపైనే ప్రతాపం
ఇంటర్నెట్ సాయంతో కిడ్నీ రాకెట్ గుట్టును ఛేదించిన నల్లగొండ పోలీసులకు మరో సవాల్ ఎదురు నిలుస్తోంది. పోలీసు విచారణలో ప్రజాపతి ఇచ్చిన సమాచారం మేరకు మరో కీలక నిందితుడు ఈ కేసులో అరెస్టు కావాల్సి ఉంది. అతడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన వ్యక్తి అని సమాచారం. ఇత ను ప్రజాపతిని మించిన ఘనుడని తెలుస్తోంది.ఈ రాకెట్‌లో మరో ముఖ్య వ్యక్తిది మహారాష్ట్రలోని ముంబై. ఇతడు సురేశ్ ప్రజాపతికి రైట్‌హ్యాండ్. దక్షిణ భారత దేశం నుంచి ఎవరు వచ్చినా.. శ్రీలంక తీసుకెళ్లి కిడ్నీలు మార్పించేది ఇతడేనని సమాచారం. వీరిద్దరినీ అరెస్టు చేస్తే మరో 100 మంది వరకు కిడ్నీ విక్రేతలు, గ్రహీతలు బయటకు వస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు