విమానంలో మహిళా ఎంపీ వీరంగం

7 Apr, 2017 17:06 IST|Sakshi
విమానంలో మహిళా ఎంపీ వీరంగం

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ ఎయిర్‌ ఇండియా ఉద్యోగిపై దాడి చేసిన ఉదంతం చల్లారకముందే మరో 'వీవీఐపీ రాచరిక' ఘనట చోటుచేసుకుంది. కాగా, ఈ సారి విమాన సిబ్బందిపై వీరంగం వేసింది సాక్షాత్తూ మహిళా ఎంపీ కావడం విశేషం. ఆమె తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ డోలా సేన్‌!

శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి కోల్‌కతా వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కిన డోలా సేన్‌.. కూడా వచ్చిన తన తల్లిని విమానం అత్యవసర ద్వారం వద్ద కూర్చోబెట్టారు. అయితే విమాన సిబ్బంది అందుకు అడ్డుతగిలారు. సదరు ఎంపీగారి తల్లి వృద్ధురాలైనందున ఎమర్జెన్సీ ద్వారా వద్ద కూర్చోవడం సరికాదని, బదులుగా వేరొక సీటు కేటాయిస్తామని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అందుకు ససేమిరా అంగీకరించని ఎంపీ డోలా.. సిబ్బందితో వాగ్వాదానికిదిగారు. దీంతో విమానాన్ని 30 నిమిషాలపాటు నిలిపివేయాల్సివచ్చింది.

ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిర్‌ ఇండియా విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన కొద్ది గంటల్లోనే మరో ఎంపీ సిబ్బందిపై దురుసు ప్రవర్తన వెలుగుచూసింది. దీనిపై ఎయిర్‌ ఇండియాగానీ, ఎంపీ డోలా సేన్‌గానీ స్పందించాల్సిఉంది.

మరిన్ని వార్తలు