రేపు పీజీ డెంటల్ ఎంట్రన్స్ టెస్ట్

5 Mar, 2016 03:12 IST|Sakshi
రేపు పీజీ డెంటల్ ఎంట్రన్స్ టెస్ట్

ఏర్పాట్లు పూర్తి: హెల్త్ వర్సిటీ వీసీ
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ డెంటల్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) కోర్సులో అడ్మిషన్లకు ఈ నెల 6న నిర్వహించే ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ టి.రవిరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా నిర్వహించే ఈ పరీక్ష ఉదయం 11 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. మొత్తం 556 సీట్లలో ప్రభుత్వ కళాశాలల్లోని 23 సీట్లతో పాటు మిగిలిన ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 264(ఏయూ-96), ఓయూ-120, ఎస్‌వీయూ-48) సీట్లను వర్సిటీ భర్తీ చేయనుంది.

ప్రైవేటు మేనేజ్‌మెంట్ కోటాలో 269 (ఏయూ-93, ఓయూ-132, ఎస్‌వీయూ-44) సీట్లు ఉన్నాయి. ఏపీలో విజయవాడలోని పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల, ఎస్‌ఆర్‌కే ఇంజనీరింగ్ కళాశాల, విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాలల్లో... తెలంగాణలో హైదరాబాద్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల, వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్టు, ఒరిజినల్ ఐడీ కార్డుతో ఉదయం 10.15 గంటల లోపు హాజరుకావాలి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని వీసీ తెలిపారు. ఈనెల 7న ప్రాథమిక ‘కీ’, 15లోగా ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు