భూమాకు ఎదురుగాలి | Sakshi
Sakshi News home page

భూమాకు ఎదురుగాలి

Published Sat, Mar 5 2016 3:10 AM

భూమాకు ఎదురుగాలి - Sakshi

వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నగర పంచాయతీ వైస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి
అదే బాటలో మరికొందరు మండల, గ్రామస్థాయి నాయకులు

 
 
ఆళ్లగడ్డటౌన్: ఫ్యాన్ గుర్తుపై గెలిచి ఇటీవలే అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి అనుకోని పరిస్థితి ఎదురవుతోంది.  పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు, కార్యకర్తలు తన వెంటే ఉంటారని భావిస్తూ వచ్చిన ఆయనకు సొంత ఇలాకాలో ఎదురుగాలి వీస్తోంది. నగర పంచాయతీ వైఎస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేయడం, మరికొందరు గ్రామ, మండలస్థాయి నాయకులు ఆయన బాటలో వెళ్తుండడం ఇందుకు నిదర్శనం. శుక్రవారం ఆళ్లగడ్డలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ రామలింగారెడ్డి ఈ మేరకు బహిరంగంగానే ప్రకటించారు. ‘ఎవరో పార్టీని వీడినంత మాత్రాన నేను కూడా మారాలా? నాకు ఆ అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

డాక్టర్ రామలింగారెడ్డి, ఆయన భార్య డాక్టర్ సరోజిని దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఉంటూ, విద్యా సంస్థలు స్థాపించి, అంకాళ్‌రెడ్డి మెమోరియల్ సేవా ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తు నియోజవర్గ ప్రజలకు సుపరిచితులుగా ఉన్నారు. గత నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 20 వార్డులకు 18 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయిండంతో వైఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాల్టీకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గళం వినిపిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలో భూమా, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పార్టీ మారడంతో డాక్టర్ రామలింగారెడ్డి ఆయన వెంట వెళ్లారా? వారితో విభే దిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచాను. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిరభ్యంతరంగా స్వీకరిస్తానని ఆయన ప్రకటించారు.
 
 అదేబాటలో పలువురు  
భూమానాగిరెడ్డి..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడ టం జీర్ణించుకోలేని అనేకమంది లోలోన మదనపడుతున్నారు. ఎవరో ఒకరు ముందుకు వస్తే వారి నాయకత్వంలో పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. భూమా కుటుంబం పీఆర్పీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన సమయంలో ఆ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న అనేక కుటుం బాలు వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో కలిసి నడిచారు. ముఖ్యంగా ఉయ్యలవాడ, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లో ప్రధాన వర్గాలుగా ఉన్న ముస్లిం మైనార్టీ, క్రైస్తవులు, మరో సామాజిక వర్గం పూర్తిగా మద్దతు తెలిపింది. ఫలితంగానే పీఆర్పీ అభ్యర్థిగా కేవలం 2 వేల మెజార్టీతో గెలిచిన దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడి ఆ త ర్వాతి ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై పోటీ చేసి 36వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. ఇందులో చాలా వరకు వైఎస్సార్ అభిమానులే ఉన్నారన్న విషయం సుస్పష్టం. అలాంటి వీరంతా ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నాయకుని కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement