మరో లగ్జరీ బైక్ వచ్చింది

24 Jan, 2014 01:28 IST|Sakshi
మరో లగ్జరీ బైక్ వచ్చింది

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్లుగానీ, బైక్‌లు గానీ హైదరాబాద్‌లో దొరకని బ్రాండ్ లేదంటే అతిశయోక్తి కాదు. కొన్ని బ్రాండ్లయితే దేశంలో తొలి షోరూమ్‌ను ఇక్కడే ఆరంభించాయి కూడా. ఆ జాబితాలో ఇపుడుమరో అంతర్జాతీయ బ్రాండ్ ‘ట్రయంఫ్’ చేరింది. బ్రిటన్‌కు చెందిన ‘ట్రయంఫ్’ హైదరాబాద్‌లో మొట్టమొదటి షోరూంను గురువారం ప్రారంభించింది. షోరూం ప్రారంభానికి ముందే 50 బైక్‌లు బుక్ అయినట్లు ట్రయంఫ్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ విమల్ సుంబ్లీ చెప్పారు. మొత్తం పది మోడల్స్‌ను అందుబాటులో ఉంచామని, వీటి ప్రారంభ ధర రూ.5.9 లక్షలని, గరిష్ట ధర రూ.20 లక్షల వరకు ఉందని ఆయన వివరించారు.
 
 గురువారం షోరూంను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం విమల్ విలేకరులతో మాట్లాడారు. దేశీయ లగ్జరీ బైక్‌ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఈ విభాగంలో ఏటా 3,000 బైక్‌లు అమ్ముడవుతున్నాయని చెప్పారు. ‘‘ఈ ఏడాది 500 బైక్‌లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే రెండేళ్ళలో ఈ సంఖ్య 1,500 దాటుతుం దన్న ధీమా మాకుంది. ముఖ్యంగా దక్షిణాది, పశ్చిమ మార్కెట్లపైనే దృష్టి పెట్టాం’’ అని తెలియజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండు షోరూంలను ఆరంభించామని, మార్చి నాటికి ఈ సంఖ్య 8కి చేరుకుం టుం దని చెప్పారు. ‘‘షోరూం లను ప్రారంభించడం మాత్రమే కాదు. అమ్మిన తర్వాత అవసరమైన సేవలు, అలాగే లగ్జరీ బైక్‌లను ఏ విధంగా వాడాలన్న దానిపై అవగాహన పెంచేలా బైక్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం హర్యానాలోని మనేసర్‌లో అసెంబ్లింగ్ యూనిట్ ఉంది. తొలి ఉత్పత్తి కేంద్రాన్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. ఇది 2015-16 నాటికి అందుబాటులోకి వస్తుంది’’ అని వివరించారు.

>
మరిన్ని వార్తలు