పాపం డ్రైవర్.. ఉద్యోగంలో చేరిన తొలిరోజే!

24 Jan, 2017 18:11 IST|Sakshi
షోయబ్ కోహ్లీ ఒక బహుళజాతి కంపెనీలో పనిచేస్తుంటాడు. అతడికి ఖరీదైన కార్లన్నా.. వాటిలో వేగంగా వెళ్లడమన్నా చాలా ఇష్టం. అలాగే తన బీఎండబ్ల్యు కారును గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ ఓ టాక్సీని ఢీకొన్నాడు. నజ్రుల్ ఇస్లాం అనే వ్యక్తి తొలిరోజు ఉబర్ టాక్సీ డ్రైవర్‌గా చేరాడు. అతడి టాక్సీనే షోయబ్ కోహ్లీ ఢీకొట్టగా, ఇస్లాం అక్కడికక్కడే మరణించాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు, నాయనమ్మ ఉన్నారు. వాళ్లందరినీ పోషించాల్సిన బాధ్యత ఇస్లాం మీదే ఉంది. ఈ కేసులో కోహ్లీని పోలీసులు అరెస్టు చేసినా.. రెండు రోజులలోనే బెయిల్ మీద విడుదల చేశారు. తాను తాగి నడపలేదని కోహ్లీ చెబుతున్నా, అతడు ఆ సమయంలో విపరీతమైన వేగంతో ఉన్నాడని, కారు మీద నియంత్రణ కోల్పోయాడని పోలీసులు చెబుతున్నారు. బీఎండబ్ల్యు కారు కూడా తుక్కుతుక్కు అయిపోయింది. టాక్సీ డ్రైవర్ ఉన్నట్టుండి బ్రేక్ వేయడం వల్లే తాను తన కారు ఆపలేక అతడిని ఢీకొట్టినట్లు షోయబ్ కోహ్లీ వాదిస్తున్నాడు. కల్కాజీ నుంచి వసంత కుంజ్ బయల్దేరిన రెండు కార్లూ పూర్తిగా తుక్కుతుక్కుగా మారాయి. 
 
బీఎండబ్ల్యు కారు ఢీకొనడంతో క్యాబ్ గాల్లోకి లేచి, కొద్ది మీటర్ల దూరం వెళ్లింది. ఢిల్లీ ఐఐటీ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద అది ఆగింది. అప్పుడు ఏదో బాంబు పేలినట్లు శబ్దం వినిపించింది. ప్రమాదం సంభవించిన కొద్దిసేపటికే షోయబ్ కోహ్లీ అక్కడినుంచి పరారయ్యాడు. తాను అక్కడే ఆగి ఉబర్ డ్రైవర్‌కు సాయం చేద్దామనుకున్నా, అక్కడున్నవాళ్లు కొడతారని భయపడి ఆటోలో వెళ్లిపోయానన్నారు. క్యాబ్ డ్రైవర్ చనిపోతే.. నిందితుడికి ఒక్కరోజులో బెయిల్ ఇచ్చారని, ఇది ఎంతవరకు న్యాయమని మరో ఉబర్ డ్రైవర్ సందీప్ కుమార్ ప్రశ్నించారు. మృతుడు నజ్రుల్ ఇస్లాం భార్య ఇళ్లలో పనిచేసుకుంటుంది. 
మరిన్ని వార్తలు