బ్రెగ్జిట్ ఉద్యమ నేత సంచలన నిర్ణయం

4 Jul, 2016 16:08 IST|Sakshi
బ్రెగ్జిట్ ఉద్యమ నేత సంచలన నిర్ణయం

లండన్: బ్రెగ్జిట్ ఉద్యమ రథసారధి నిగెల్ ఫరాగ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. యునైటెడ్ కింగ్ డమ్ ఇండిపెండెండ్ పార్టీ అధ్యక్షపదవికి రాజీనామా చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం సెంట్రల్ లండన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నిగెల్ తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.

'బ్రిటన్ స్వతంత్ర్యదేశంగా ఉండాలన్నది నా కల. యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడమే లక్ష్యంగా 20 ఏళ్లు పోరాడాం. బ్రెగ్జిట్ రెఫరెండం నెగ్గడంలో యూకే ఇండిపెండెంట్ పార్టీ పాత్ర అద్వితీయం. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించా. మిగతా పని భవిష్యత్ నేతలదే. బ్రెగ్జిట్ విజయం కంటే నేను సాధించేది ఏదీ ఉండబోదు. 'నా దేశం నాకు తిరిగి కావాలి'(ఐ వాంట్ మై కంట్రీ బ్యాక్) అని నినదించా. ఇప్పుడు మాత్రం నా జీవితం నాకు కావాలని కోరుకుంటున్నా(ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్). నిజానికి రాజకీయాలు నా వృత్తికాదు. సరైన సమయంలోనే యూకేఐపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నా. అయితే బ్రెసెల్స్(ఈయూ రాజధాని) నుంచి బ్రిటన్ పూర్తిగా వేరయ్యే వరకు యురోపియన్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతా' అని నిగెల్ అన్నారు. (చదవండి: బ్రెగ్జిట్ వైపే బ్రిటన్ ప్రజల మొగ్గు!) (చదవండి:  బ్రిటన్లో అల్లకల్లోలం ఖాయం!)

తొలి నుంచీ కన్జర్వేటివ్‌ పార్టీ రాజకీయాల్లో పాల్గొన్న నిగెల్ ఫరేజ్.. మొదటి నుంచి ఈయూలో బ్రిటన్‌ చేరికను వ్యతిరేకిస్తున్నారు. 1992లో కన్జర్వేటివ్‌ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తర్వాత యూకే ఇండిపెండెన్స్‌ పార్టీలో చేరారు. 2010లో ఆ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగాలంటూ ఇన్నాళ్లుగా ఆయన చేస్తున్న ప్రచారాన్ని చాలా మంది తేలికగా తీసుకున్నారు. కానీ నిగెల్  మాత్రం పరిహాసాలను పట్టించుకోకుండా ముందుకుసాగారు. బ్రెగ్జిట్‌పై రెఫరెండం నిర్వహించేలా ప్రధాని కామెరాన్‌పై ఒత్తిడి తెచ్చారు. చివరికి జూన్ 23న జరిగిన రిఫరెండంలో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 52శాతం బ్రిటిషర్లు బ్రెగ్జిట్ కు ఓటు వేశారు. కాగా, నిగెల్ రాజీనామా చేసినప్పటికీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమని, గతంలోనూ ఒకటిరెండు సార్లు ఇలా జరిగిందని బ్రిటిష్ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  (చదవండి: పేద దేశాల వలసలే కొంప ముంచాయి) (చదవండి:  బ్రెగ్జిట్కు బ్రేక్!?)

మరిన్ని వార్తలు