పిల్లలకైతే యులిప్సే బెస్ట్...

17 Nov, 2013 03:05 IST|Sakshi
పిల్లలకైతే యులిప్సే బెస్ట్...

గతంతో పోలిస్తే పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు అధికంగా దృష్టిసారిస్తున్నారు. వారికి పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి ఉన్నత చదువులు చదివించడందాకా అన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా సాగిస్తున్నారు. ఉన్నత చదువులకు పిల్లలను విదేశాలకు పంపే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఏటా వేగంగా పెరుగుతున్న విద్యావ్యయం తట్టుకోవడం వీరికి కష్టంగా మారుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇటీవల నిర్వహించిన ‘లైఫ్ ఫ్రీడమ్ ఇండెక్స్’ సర్వేలో 75 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం పొదుపునకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. కాని చాలామంది ఈ పొదుపును చాలా ఆలస్యంగా మొదలు పెడుతున్నారు. ఉన్నత చదువుకు అక్కరకు వచ్చే విధంగా ఉండాలంటే కనీసం 3 నుంచి 8 ఏళ్ళ లోపే ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి.
 దీర్ఘకాలానికి యులిప్స్   
 అటు బీమా రక్షణ కల్పిస్తూ, ఇటు ఆర్థిక లక్ష్యాలను చేరుకునే విధంగా అనేక పిల్లల పథకాలను బీమా కంపెనీలు అందిస్తున్నాయి. వీటిలో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (యులిప్స్) అనువైనవని చెప్పొచ్చు. తల్లిదండ్రుల రిస్క్ సామర్థ్యం ఆధారంగా వివిధ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉండటమే కాకుండా, అధిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలామంది బ్యాంకు ఎఫ్‌డీలు, పోస్టాఫీసు సేవింగ్స్ వంటి పథకాలపై అధికంగా మొగ్గు చూపుతున్నారు. కాని వీటికంటే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని యులిప్స్ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి.
 ఈ మూడు గుర్తుంచుకోవాలి
 ఏదైనా ఒక చైల్డ్ యులిప్ పథకాన్ని ఎంచుకునేటప్పుడు తప్పకుండా ఈ అంశాలను పరిశీలించడం మర్చిపోవద్దు. అందులో మొదటిది ఇన్వెస్ట్‌మెంట్ కాలపరిమితి. యులిప్స్ అనేవి కేవలం దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌కే అనువుగా ఉంటాయి. ఇప్పుడు చాలా పథకాలు 20 నుంచి 30 ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేసే విధంగా పథకాలను అందిస్తున్నాయి. ఇలా దీర్ఘకాలం ఎంచుకోవడం వల్ల మార్కెట్లో ఉండే సహజసిద్ధమైన ఒడిదుడుకులను తట్టుకొని దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందొచ్చు.
ఇక రెండో విషయం: ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. ప్రారంభంలో ఈక్విటీలకు అధికంగా కేటాయిస్తూ లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు రిస్క్ తక్కువగా ఉండే డెట్ ఫండ్ వంటి సాధనాల్లోకి క్రమేపీ మారాలి. ఉదాహరణకు ప్రారంభంలో 80 నుంచి 100 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తే పాలసీ ముగిసే వరకు అదే విధంగా కొనసాగించకూడదు. మార్కెట్లో ఉండే ఒడిదుడుకుల వల్ల లాభాలు హరించుకుపోయే ప్రమాదం ఉంది. లాభాలొచ్చినప్పుడు వాటిని డెట్ వంటి రిస్క్ తక్కువ ఉండే వాటిల్లోకి మార్చుకోవాలి. చిన్న పిల్లల పేరుమీద ఏ పాలసీ తీసుకున్నా సరే వైవర్ ఆఫ్ ప్రీమియం అనే రైడర్‌ను తీసుకోవడం మర్చిపోవద్దు. అనుకోని అవాంఛనీయ సంఘటన ఏదైనా జరిగి తల్లిదండ్రులు ప్రీమియం చెల్లించలేకపోయినా పిల్లల లక్ష్యం అక్కడితో ఆగిపోకూడదు. ఇలాంటి సమయంలో వైవర్ ఆఫ్ ప్రీమియం అక్కరకు వస్తుంది.
  ఇంతే కాకుండా యులిప్స్‌లో ఉండే ఇంకో ప్రయోజనం ఏమిటంటే.... బోనస్‌లు, లేదా ఇతర ఆదాయాలు ఏమైనా చేతికి వస్తే టాప్ అప్స్ పేరుతో అదే పథకంలో పిల్లల పేరుమీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు