తెలంగాణకు కేబినెట్ ఆమోదం

7 Feb, 2014 18:35 IST|Sakshi
తెలంగాణకు కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రెండూ వేగంగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర కేబినెట్ తెలంగాణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో రాష్ట్ర విభజన అంశం దాదాపుగా క్లైమాక్స్ కు చేరినట్టయ్యింది. ప్రధాని నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో జీవోఎం సమర్పించిన తెలంగాణ ముసాయిదాపై చర్చించారు.

ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కేబినెట్ సమావేశానికి రాష్ట్రానికి చెందిన కావూరి సాంబశివరావు, పల్లంరాజు, జైపాల్ రెడ్డి హాజరయ్యారు. రాయల తెలంగాణ ప్రతిపాదను జీవోఎం తోసిపుచ్చింది. అలాగే హైదరాబాద్ యూటీ ప్రతిపాదనను పక్కనబెట్టింది. అసెంబ్లీ నియోజవర్గాలు పెంచే ప్రతిపాదన లేనట్టే. కాగా పొలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపేలా ప్రతిపాదించింది. ఇదిలావుండగా, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ దృష్టిసారిస్తోంది. కేబినెట్ భేటి ముగిసన వెంటనే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని నివాసానికి వచ్చారు. అక్కడే కోర్ కమిటీ సభ్యులు భేటి అయ్యారు. అంతకుముందు బీజేపీ నేత వెంకయ్య నాయుడుతో కాంగ్రెస్ నాయకులు అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ రహస్యంగా మంతనాలు జరిపారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలను పరిష్కరిస్తే మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత తెలిపినట్టు సమాచారం. బీజేపీ మద్దతు ఇస్తే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి మార్గం సుగుమమైనట్టే.
 

మరిన్ని వార్తలు