యూపీ దంగల్‌.. మోదీకి సవాల్‌

7 Feb, 2017 04:15 IST|Sakshi
యూపీ దంగల్‌.. మోదీకి సవాల్‌

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌ ఫలితాలు బీజేపీకి, ప్రధాని నరేంద్రమోదీ భవితవ్యానికి అత్యంత కీలకం. 2014 ఎన్నికల్లో బీజేపీ యూపీలో గెలుచుకున్న 71 సీట్ల కారణంగానే 30 ఏళ్ల తర్వాత సొంత మెజారిటీ సాధించిన పార్టీగా బీజేపీ నిలిచింది. ఈ నేపథ్యంలో 33 నెలల నరేంద్ర మోదీ ప్రభు త్వ పాలన తర్వాత యూపీలో బీజేపీకి మెజారిటీ రాకుంటే రాజకీయంగా ఇబ్బందికర పరి స్థితే.

రాజ్యసభలో బలం, రాష్ట్రపతి ఎన్నిక వం టి అంశాల్లో మోదీ మాట చెల్లుబాటు కావాలంటే యూపీలో పాగా వేయటం బీజేపీకే తక్షణావసరం. లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితితో పోలి స్తే యూపీలో రాజకీయంగా చాలా మార్పులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌పై తిరిగి పట్టు సాధించేందుకు కమలదళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. హిందూత్వ రాజకీయాలతోపాటు ‘వికాస్‌’ మంత్రాన్ని పఠిస్తూనే.. ఉచిత ఆఫర్లను ప్రకటిస్తోంది.

ఉత్తరాఖండ్‌ విడిపోయాకే..
వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా జరిగిన 2002 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో (2000లో యూపీ నుంచి ఉత్తరాఖండ్‌ను వేరుచేశాక జరిగిన తొలి ఎన్నికలు) బీజేపీ బలం మొదటిసారి రెండంకె లకు (88) పడిపోయింది. 1991, 93, 96 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 221, 177, 174 సీట్లు కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు (2007–51 సీట్లు, 2012–47 సీట్లు) ఎన్నికల్లో కాషాయపక్షం సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీ వర్గానికి చెందిన అప్నాదళ్‌ (కూర్మీల పార్టీ)తో కలిసి పోటీచేసిన బీజేపీ 42.3శాతం ఓట్లతో 71 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 328 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రానిపక్షంలో రాజకీయంగా బీజేపీతోపాటు ప్రధాని మోదీ నష్టపోయే ప్రమాదముంది.

ఎన్నికల సర్వేల్లో బీజేపీకే మొగ్గు
పంజాబ్, గోవా, మణిపూర్‌లో బీజేపీకి విజయావకాశాలు లేవని అంచనాలు చెబుతున్నాయి. ఖాయంగా గెలుపునకు వీలున్నది చిన్న రాష్ట్రం ఉత్తరాఖండ్‌లోనే. కిందటి ఆగస్టు నుంచి అనేక మీడియా, మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థలు సంయుక్తంగా చేసిన ఎన్నికల సర్వేలు చాలా వరకు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకే విజయావకాశాలున్నాయని ప్రకటించాయి. ఈ వారం వెలువడిన టైమ్స్‌ నౌ–బీఎంపీ సర్వే సైతం బీజేపీ 202 సీట్లతో మెజారిటీ సాధిస్తుందని తెలిపింది.

రుణ మాఫీ పనిచేస్తుందా?
15 ఏళ్ల క్రితం బీజేపీ అధికారాన్ని కోల్పోయాక సంకీర్ణ భాగస్వామిగా ఉండే అవకాశం కూడా రాలేదు. రామజన్మభూమి నినాదంతో 1989 నుంచీ ఎదుగుతూ కాంగ్రెస్‌కు దీటైన జాతీయ ప్రత్యామ్నాయంగా అవతరించింది. అయితే, ఈ క్రమంలో చాలా ఆలస్యంగా బలపడిన హరియాణా, కర్ణాటక, గోవా, అస్సాం వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం సంపాదించినా.. ‘హిందూత్వ’ రాజకీయాలకు గుండెకాయగా పరిగణించే యూపీలో అధికారం సంపాదించలేకపోయింది. అందుకే ఇప్పుడు యూపీ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకంగా మారాయి. అందుకే లక్నో సభలో అమిత్‌ షా ఎన్నో జనాకర్షక వాగ్దానాలు చేశారు. రైతులకు ప్రకటించిన రుణాల మాఫీ, వెంటనే వడ్డీ లేకుండా అప్పులు వంటివి బాగా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

బీజేపీకి సానుకూలాంశాలు
ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలోనే అధికార సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ)లో కుమ్ములాటలు, జనవరిలో ఎస్పీ–కాంగ్రెస్‌ మధ్య కుదిరిన సీట్ల సర్దుబాటు సజావుగా లేకపోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. 18 ఏళ్లుగా సత్సంబంధాలు లేని రెండు పార్టీల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తును ఎస్పీ వ్యవస్థాపకుడు, తండ్రి ములాయంసింగ్‌ యాదవ్‌ మనస్ఫూర్తిగా ఆమోదించకపోవటం కూడా అనుకూలాంశమే. దీనికితోడు 18 శాతం గా ఉన్న ముస్లిం ఓట్లు బీఎస్పీ, ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమి, మజ్లిస్‌ వంటి చిన్నా చితకా ముస్లిం పక్షాల మధ్య చీలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్‌లో ప్రధాని తీసుకున్న పెద్ద నోట్ల రద్దును జనం ఆమోదించారని సర్వేలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు