రైతుల రుణాల మాఫీ నేరం కాదా?

6 Apr, 2017 14:29 IST|Sakshi
రైతుల రుణాల మాఫీ నేరం కాదా?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రంలోని రైతులు తీసుకున్న రూ. 36,359 కోట్ల  పంట రుణాలను ఒక్క కలం పోటుతో మాఫీ చేయడాన్ని కాంగ్రెస్‌ యువ నాయకుడు రాహుల్‌ గాంధీ సహా వివిధ వర్గాల ప్రజలు ప్రశంసించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీనే ఆయన ఇప్పుడు నిలబెట్టుకున్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో దాదాపు 86 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. కరవు కాటకాలతో అల్లాడి పోతున్న రైతులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. కానీ దేశం దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయన్న విషయాన్ని ఎంత మంది ఆలోచిస్తున్నారు.

రైతుల రుణాల మాఫీకి, ఇతర జనాకర్షణక పథకాలకు ఖజానాలు ఖాళీ అవుతుంటే నీటి పారుదల సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉన్న యూపీలో వాటికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయి? దేశంలో నీటి పారుదల సౌకర్యాలకు బడ్జెట్‌లో ఒక్క శాతం నిధులను కేటాయిస్తే దేశంలో జాతీయ స్థూల ఉత్పత్తి రెండు శాతం పెరుగుతుందని ఎంతో మంది నిపుణులు ఇప్పటికే అంచనాలు వేశారు. నివేదికలు సమర్పించారు. అభివృద్ధి పట్ల దూరదృష్టి, చిత్తశుద్ధి లేకుండా కేవలం ఎన్నికల్లో విజయం సాధించి పబ్బం గడుపుకోవాలని చూసే నేటి రాజకీయ పార్టీలు రైతుల రుణ మాఫీ అనే హామీని ఎన్నికలు వచ్చినప్పుడల్లా ముందుకు తీసుకొస్తున్నాయి.

ప్రధానంగా రుణాల మాఫీ హామీ కారణంగానే యూపీలో బీజేపీ విజయం సాధించిందని చెప్పవచ్చు. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రుణాల మాఫీ చేసిన కారణంగానే 2009లో జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభుత్వం మళ్లీ విజయం సాధించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కేంద్రం మాఫీ చేసిన మొత్తంలో సగానికికన్నా ఎక్కువ మొత్తాన్ని యోగీ ఆధిత్యనాథ్‌ మాఫీ చేశారని ప్రశంసిస్తున్నవారూ ఉన్నారు. నిజమే ఇప్పుడు ఇదే బాటలో పంజాబ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు నడిచే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రుణాల మాఫీకి సహకరించాల్సిందిగా కోరారు. మహారాష్ట్రలో కూడా రుణాలను మాఫీ చేయాల్సిందిగా అక్కడి ఫడ్నవీస్‌ ప్రభుత్వంపై శివసేన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. రుణాల మాఫీని చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం చేయడం సబబుకాదని, రైతులందరికి వర్తింపచేయాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు రాష్ట్రాన్ని తాజాగా ఆదేశించిన విషయం తెల్సిందే.

పంటల పేరు మీద తీసుకున్న రుణాలు ఎక్కువగా దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలే కాదు వాటిని రైతులు ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న ఉదంతాలు మనకు తెల్సినవే. ఎన్నికలు వచ్చేటప్పటికే పన్ను ఎగవేస్తున్న రైతుల జాబితాలు చాంతాడంతా పెరుగుతున్న విషయం తెల్సిందే. నిజాయితీగా పంట రుణాలను చెల్లిస్తున్న రైతులు నష్టపోతున్న విషయమూ తెల్సిందే. ఎన్నికల సమయంలో రుణాలను మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికిల బడిన విషయమూ తెల్సిందే.

ఆకలి దప్పులతో అలమటించే చిన్న, సన్నకారు రైతులకు రుణాలను మాఫీ చేయడంలో అర్థం ఉందిగానీ ధనిక రైతులకు కూడా రుణాలు మాఫీ చేయమనడంలో ఏమర్థం ఉందో కోర్టుకే తెలియాలి. వర్షాధార పంటలపై ఆధారపడి రైతులు బతికే పరిస్థితులున్న చోట నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం ఇటు రాష్ట్రాలది, అటు కేంద్రానిది. దీన్ని విస్మరించిన రాజకీయ పార్టీలు రుణాల మాఫీల హామీలతో ఎన్నికల లబ్ధినే చూసుకుంటున్నాయి. కోట్లది రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇవ్వడమంటే రైతులకు లంచం ఆశ చూపినట్లుకాదా? నేరం కాదా? ఎన్నికల కమిషన్‌ ఈ అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదో అర్థం కాదు.

మరిన్ని వార్తలు