డీఎంకేలో కొనసాగుతున్న వార్

29 Jan, 2014 03:55 IST|Sakshi

సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు అళగిరిల మధ్య వార్ ఇంకా కొనసాగుతోంది. డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన అళగిరిని ఈ నెల 24న పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, దానిపై అళగిరి మండిపడటం తెలిసిందే. అయితే ఆ రోజు అళగిరి వ్యవహరించిన తీరు వల్లే ఆయనను సస్పెండ్ చేసినట్లు కరుణానిధి మంగళవారం వె ల్లడించారు. ‘ఆ రోజు అళగిరి నా దగ్గరికి వచ్చి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు.
 
  నా చిన్న కుమారుడు, తన సోదరుడు అయిన స్టాలిన్ త్వరలోనే చస్తాడని, పార్టీ తీరునూ విమర్శించాడు. దీంతోనే సస్పెండ్ చేశాం’ అని తెలిపారు. అయితే కరుణ వ్యాఖ్యలపై అళగిరి స్పందిస్తూ... తన తండ్రి అబద్ధాలాడుతున్నారని అన్నారు. పార్టీలోని గ్రూపు రాజకీయాన్ని, అన్యాయాన్ని ఎత్తి చూపినందుకే తనపై వేటువేశారన్నారు. ‘నాన్న చేసిన వ్యాఖ్యల్ని నా పుట్టిన రోజు కానుకగా స్వీకరిస్తున్నా’ అని అన్నారు. కరుణకన్నా ముందుగానే తాను చచ్చి పోవాలని భావిస్తున్నానని, ఆయన కన్నీళ్లు తన భౌతిక కాయంపై పడాలని కాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు