మీ ప్రతిపాదనలను ఆమోదించలేం..

27 Mar, 2017 01:27 IST|Sakshi
మీ ప్రతిపాదనలను ఆమోదించలేం..

జడ్జీల నియామకాల విధివిధానాల మార్పునకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత
మా సిఫారసును జాతీయ భద్రతా కారణంతో తిరస్కరించలేరు
ఆధారాలిస్తే మేమే ఆ పని చేస్తాం.. మీకు వీటో అధికారం ఇవ్వలేం
అలా ఇస్తే రాజకీయ జోక్యం పెరిగిపోతుంది
ఎంఓపీపై కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం స్పష్టీకరణ


సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల విషయంలో ఏళ్లతరబడి కొనసాగుతూ వస్తున్న కొన్ని విధివిధానాల్ని మార్చేందుకు సుప్రీంకోర్టు కొలీజియం విముఖత వ్యక్తం చేసింది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చేసిన పలు సూచనలను, ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని కొలీజియం తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా న్యాయ మూర్తుల పోస్టుకు సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరి పేరునైనా జాతీయ భద్రత కారణంతో తిరస్కరించే వెసులుబాటు తమకు కల్పించా లన్న కేంద్ర సూచనను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది.

అలాగే న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లపై పరిశీలన జరిపేందుకు శాశ్వత సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయాలన్న సూచననూ తిరస్కరిం చింది. న్యాయమూర్తుల మీద వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు కొలీజియంలో సభ్యులు కాని ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదననూ తోసిపుచ్చింది. అయితే న్యాయమూర్తులుగా నియమితులయ్యేవారి వయోపరిమితి విషయంలో మాత్రం కేంద్రం సిఫారసులను ఆమోదించింది. ఈ విషయాలన్నింటినీ సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి లేఖద్వారా తెలియచేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

కేంద్రం ప్రతిపాదనలపై సుదీర్ఘ చర్చ
న్యాయమూర్తుల నియామకాల విషయంలో కొలీజియం వ్యవస్థకు స్వస్తి పలికే దిశగా జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌(ఎన్‌జేఏసీ)ను కేంద్రం తీసుకురావడం, దీనిపై పిటిషన్‌ దాఖలవగా.. ఎన్‌జేఏసీ చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడం విదితమే. కొలీజియమే న్యాయమూర్తుల నియామకాలను చేపడుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన విధివిధానాల తాలూకు మెమోరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌ (ఎంఓపీ)ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ మేరకు కేంద్రం ఎంఓపీని తయారుచేసి సుప్రీంకోర్టు కొలీజియం ముందుంచింది.

ఈ ఎంఓపీపై కేంద్రానికి, సుప్రీంకోర్టు కొలీజియానికి పలు అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇరువర్గాలూ వెనక్కి తగ్గకపోవడంతో న్యాయమూర్తుల నియామకాల్లో అసాధారణ జాప్యం చోటు చేసుకుంది. ఎంఓపీపై జరుగుతున్న జాప్యాన్ని దృష్టిలో పెట్టుకున్న సీజే జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై కేంద్రం చేసిన పలు సూచనలు, ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించింది.

కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించి తీరాల్సిందే..
న్యాయమూర్తుల పోస్టుకు తాము సిఫారసు చేసిన వ్యక్తుల్లో ఎవరైనా వ్యక్తి నియామకం జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉందని కేంద్రం భావిస్తే, అందుకు ఆధారాలను తమ ముందుంచితే కొలీజియం వాటిని ఎన్నటికీ పక్కనపెట్టదని తెలిపింది. కానీ జాతీయ భద్రతా కారణంతో కేంద్రం తమ సిఫారసులను వీటో చెప్పడానికి వీల్లేదని కొలీజియం తేల్చిచెప్పింది. ఇందుకు అనుమతినిస్తే న్యాయ నియామక ప్రక్రియ మొత్తం రాజకీయజోక్యంతో నిండిపోతుందని తన అభిప్రాయాన్ని కేంద్రానికి స్పష్టంచేసింది. అలాగే న్యాయమూర్తుల పేర్లపై విచారణ జరిపేందుకు ఎన్నో ఏళ్లనుంచి అనుసరిస్తూ వస్తున్న విధానం సక్రమంగానే ఉందని, అందువల్ల శాశ్వత సెక్రటేరియట్‌ ఏర్పాటు ఎంతమాత్రం అవసరం లేదంది. కొలీజియం తన సిఫారసులను మరోసారి కేంద్రానికి పంపినప్పుడు వాటిని కేంద్రం తప్పనిసరిగా ఆమోదించి తీరాల్సిందేనని కూడా స్పష్టంచేసింది.

వయోపరిమితికి పచ్చజెండా..
న్యాయమూర్తుల నియామకాలకు పరిగణనలోకి తీసుకునే న్యాయవాదుల కనీస, గరిష్ట వయస్సుల విషయంలో కేంద్రం ప్రతిపాదనలకు కొలీజియం పచ్చజెండా ఊపింది. కనీసం 45 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉన్న న్యాయవాదినే న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను అంగీకరించింది. జల్లా జడ్జీల కోటా నుంచి న్యాయమూర్తిగా నియమించే వ్యక్తి గరిష్ట వయస్సు 58 ఏళ్లు ఉండాలన్న ప్రతిపాదననూ కొలీజియం ఆమోదిం చింది. ఇప్పుడు దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

మరిన్ని వార్తలు