భారత్‌ ఎందుకు రానివ్వడం లేదు!

6 Sep, 2017 14:48 IST|Sakshi
రోహింగ్యాలను భారత్‌ ఎందుకు రానివ్వడం లేదు!

న్యూఢిల్లీ: మయాన్మార్‌లో రోహింగ్యా ముస్లిం తెగ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు వారి వలస కొనసాగుతుండగా.. మరోవైపు దేశంలోని రోహింగ్యా ప్రజలను తిరిగి స్వదేశానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రోహింగ్యాలను డిపోర్ట్‌ చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలైంది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుపాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో రోహింగ్యాలు ఎవరు? వారి నేపథ్యం ఏమిటి? తదితర వివరాలివి..
 
రోహింగ్యాలు ఎవరు?

  • మయన్మార్‌లోని పురాతన జాతులలో రోహింగ్యా ముస్లిం మైనారిటీ తెగ ఒకటి. కానీ, 1982లో మయన్మార్‌ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో 135 స్థానిక జాతులలో ఒకటిగా రోహింగ్యాలను గుర్తించలేదు. దీంతో, వారికి పౌరసత్వాన్ని నిరాకరించినట్టయింది.
  • రోహింగ్యాలను 'బెంగాలీ'లుగా మయన్మార్‌ ప్రభుత్వం ముద్రవేస్తోంది. ఇటీవలికాలంలోనే బంగ్లాదేశ్‌ నుంచి రఖినె రాష్ట్రంలోకి రోహింగ్యాలు వలస వచ్చారని చెప్తోంది.
  • మయన్మార్‌లో రోహింగ్యా పదాన్ని నిషిద్ధంగా భావిస్తారు.

ఎంతమంది ఉన్నారు?

  • మయన్మార్‌లో దాదాపు 10లక్షలమంది రోహింగ్యాలు ఉన్నారు
  • గత ఆగస్టు 25 నుంచి 1.23 లక్షలమంది బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిపోయారు.
  • జమ్మూ, హైదరాబాద్‌, ఢిల్లీ రాజధాని ప్రాంతం, హరియాణ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో దాదాపు 40వేలమంది రోహింగ్యాలు నివసిస్తున్నారు.


భారత్‌లో శరణార్థుల చట్టం లేదు

  • శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు 1951లో ఐరాస తీసుకొచ్చిన తీర్మానంపైగానీ, 1967నాటి ప్రోటోకాల్‌పైగానీ భారత్‌ సంతకం చేయలేదు.  
  • కేసు టు కేసు ప్రాతిపదికన తాత్కాలిక పద్ధతిలోనే కేంద్ర ప్రభుత్వం శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది
  • శరణార్థుల అభ్యర్థనను ప్రభుత్వం ఆమోదిస్తే.. వారికి దీర్ఘకాలిక వీసా (ఎల్టీవీ)ని అందజేస్తుంది. ఏడాదికోసారి ఈ వీసాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
  • ఎల్టీవీ పొందేవారు దేశంలోని ప్రైవేటు సెక్టార్‌లో పనిచేయవచ్చు. బ్యాంకింగ్, విద్య వంటి సదుపాయాలు పొందొచ్చు.


కానీ, శరణార్థులను అక్కున చేర్చుకున్న భారత్‌!

  • భారత్‌లో శరణార్థుల చట్టం లేకపోయినా.. అనేకమంది బాధితులకు భారత్‌ ఆశ్రయం కల్పించింది.  టిబేటన్లు, బంగ్లాదేశ్‌కు చెందిన చక్మాస్‌లు, అఫ్గాన్లు, శ్రీలంకకు చెందిన తమిళులకు భారత్‌ ఆశ్రయమిచ్చి ఆదుకుంది.
  • లక్షమంది టిబేటన్లు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ల్యాండ్‌ లీజు తీసుకోవడంతోపాటు ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.
  • తమిళనాడులో శ్రీలంక శరణార్థులు లక్షకుపైగానే ఉన్నారు. ప్రభుత్వ సాయాన్ని పొందుతున్నారు.
  • ఆఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు దేశంలో నివసించేందుకు వీలుగా భూ కొనుగోలుకు, డ్రైవింగ్ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఆధార్‌ కార్డులు పొందేందుకు 2016లో మోదీ ప్రభుత్వం అనుమతించింది.


రోహింగ్యాలపై ప్రభుత్వం ఏమంటోంది?

దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులందరినీ స్వదేశాలకు పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. ఎందుకంటే..

  • ఉగ్రవాద గ్రూపుల రిక్రూట్‌మెంట్‌కు వలసదారులు ఉపయోగపడుతున్నారనే అనుమానాలు ఉన్నాయి.
  • వలసదారులు భారతీయ పౌరుల హక్కులను దెబ్బతీయడమే కాకుండా.. భద్రతకు తీవ్ర సవాలుగా పరిణమిస్తున్నారు.
  • వలసదారులు పోటెత్తుతుండటం వల్ల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సవాళ్లు తలెత్తుతున్నాయి.
  • ఈ వలస వల్ల జనాభాపరంగా భారత భౌగోళిక ముఖచిత్రం మారిపోతోంది.

రోహింగ్యాలను పంపడం సాధ్యమేనా?
రోహింగ్యాలను తిరిగి వెనుకకు తీసుకోవాలని భారత్‌ బంగ్లాదేశ్‌, మయన్మార్‌లతో చర్చలు జరుపుతున్నా.. అసలు రోహింగ్యాలది తమ దేశమే కాదని, వారికి పౌరసత్వమే లేదని మయన్మార్‌ వాదిస్తుండటంతో ఇది కష్టసాధ్యంగా మారింది.
 

మరిన్ని వార్తలు