నగదు విత్డ్రాలపై ఇంకా ఆంక్షలెందుకు?

31 Dec, 2016 11:38 IST|Sakshi
నగదు విత్డ్రాలపై ఇంకా ఆంక్షలెందుకు?
రద్దయిన నోట్ల డిపాజిట్లకు ఇచ్చిన గడువు డిసెంబర్ 30తో ముగిసింది. అయినా నగదు కొరత సమస్య  ఇంకా ప్రజలను వెన్నాడుతూనే ఉంది. ఏటీఎల నుంచి రోజుకు విత్డ్రా చేసుకునే నగదు పరిమితిని ఆర్బీఐ కొంత సవరించి రూ.2500 నుంచి రూ.4500కు పెంచింది. ఈ విషయంపై మాజీ ఆర్థికమంత్రి పి చిదంబరం, నరేంద్రమోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. డీమానిటైజేషన్ డెడ్ లైన్ ముగిసినప్పటికీ ఇంకెందుకు నగదు విత్డ్రాలపై ఆంక్షలు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. డిసెంబర్ 30వరకు ఆగండి సమస్యలన్నీ తీరిపోతాయని ప్రధాని మోదీ హామిలిచ్చారని, మరి ఇంకెందుకు విత్డ్రాలపై పరిమితులు కొనసాగిస్తున్నారని ట్వీట్ చేశారు. జనవరి 2 తర్వాత అన్ని ఏటీఎంలు సరిగా పనిచేస్తున్నాయా? సరిపడ నగదు అందుబాటులోకి వస్తుందా?  అని ప్రశ్నించారు.
 
ఒకవేళ రాకపోతే, ఎందుకు అందుబాటులోకి తేవడంలేదో సమాధానం చెప్పాల్సిందేన్నారు. జనవరి 2 తర్వాత అసలు అవినీతి అసలు జరగదా? అంటూ పలు సూటి ప్రశ్నలను చిదంబరం మోదీ ప్రభుత్వానికి సంధించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నవంబర్ 8న నిర్ణయం ప్రకటించిన అనంతరం తమకు 50 రోజుల గడువు ఇ‍వ్వాలని ప్రజలను కోరారు. ప్రధాని మోదీ అడిగిన గడువు కూడా ముగిసింది. కానీ పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత మాత్రం వీడలేదు. ఈ నేపథ్యంలో నేటి రాత్రి 7.30 గంటలకు మోదీ మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 
మరిన్ని వార్తలు