నా గొలుసు కొట్టేసింది.. కేసు పెట్టండి

14 Jul, 2015 17:47 IST|Sakshi
నా గొలుసు కొట్టేసింది.. కేసు పెట్టండి

కాన్పూర్: కోతి చేష్టలతో అందరికీ ఇబ్బందే. అంతమాత్రాన వానరాలను పోటా లాంటి చట్టాల కింద అదుపులోకి తీసుకోవాలంటే ఎలా? సరిగ్గా ఇలాగే డిమాండ్ చేసి వార్తల్లో నిలిచింది ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ మహిళ. తన మెడలోని బంగారు గొలుసును దొగిలించిన కోతిపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టింది. ఆమె ఒత్తిడికి తలొగ్గి ఎఫ్ఐఆర్ నమోదుకు సిద్ధమైన పోలీసులు.. అసలు ఏ చట్టం ప్రకారం కోతి గారిని నిందితుడిగా తేల్చాలో తెలియక సతమతమవుతున్నారు.

యూపీలోని కాన్పూర్కు చెందిన ఉర్మిళా సక్సేనా అనే మహిళ  సోమవారం సాయంత్రం గుడికి వెళ్లింది. పూజలు చేసి తిరిగి వస్తున్న సమయంలో ఓ కోతి అమాంతం ఆమెపై దూకి.. మెడలోని బంగారు గొలుసును తెంచే ప్రయత్నం చేసింది. ఉర్మిళా కూడా కాస్త ధైర్యంగా ఆ కోతి చర్యను అడ్డుకుంది. దీంతో బంగారు గొలుసు రెండు ముక్కలైంది. ఒక భాగం ఉర్మిళ చేతిలోనే ఉండిపోగా, మరో సగాన్ని కోతి పట్టుకెళ్లింది.

ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించినా కోతి కనిపించలేదు. 'చేసేదేమీ లేదు.. పదమ్మా.. నిన్ను ఇంటిదగ్గర దిగబెడతాం' అంటూ ఉర్మిళను ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాత్రం కోతిపై కేసు పెట్టాల్సిందేనని పట్టుబట్టింది. 'వానరంపై ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టొచ్చో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం. ఉన్నతాధికారులకు కూడా వివరాలు తెలియజేశాం. వారి నుంచి వచ్చే స్పందనను బట్టి కోతిపై తదుపరి చర్యలు తీసుకుంటాం' అని నజీరాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జీ అఖిలేశ్ గౌర్ మీడియాకు చెప్పారు.

ఇంతకీ కేసు ఎందుకు?
కొన్ని సినిమాల్లో చూపించినట్లు జంతువులకు శిక్షణ ఇచ్చి దొంగతనాలకు పాల్పడే ముఠాలు నిజంగానే ఉంటాయని, వాళ్లే ఈ పని చేసి ఉంటారని ఉర్మిళ వాదిస్తోంది. కోతిపై కేసు పెట్టడం ద్వారా ఇలాంటి ముఠాల ఆటకట్టించవచ్చనేది ఆమె అభిప్రాయం.

మరిన్ని వార్తలు