అదే స్పర్శ... అదే ఫీలింగ్!

29 May, 2015 13:59 IST|Sakshi
అదే స్పర్శ... అదే ఫీలింగ్!

న్యూయార్క్: అవే కనుదోయిలు, అవే చెక్కిళ్లు, అవే పెదవులు, ఆదే ముక్కు, అదే గెడ్డం....అదే ముఖవర్చస్సు, అదే స్పర్శ, ఆదే ఫీలింగ్...అ స్పర్శతోనే తాను చిన్నప్పటి నుంచి పెరిగానంటూ అమె తన్మయత్వంతో తబ్బిబ్బయింది. కొంచెం ముట్టుకోవచ్చా...? అంటూ అతని ముఖాన్ని తనవితీర తడిమి...తడిమి ఆనందించింది అమెరికాకు చెందిన రెబెకా. ఆమె అతన్ని చూడడం జీవితంలో ఇదే మొదటి సారి. మొన్నటి వరకు ఆయన ఎవరో, ఎక్కడుంటున్నారో కూడా ఆమెకు తెలియదు. అయినా అతని ముఖం ఆమెకు చిన్నప్పటి నుంచి సుపరిచితమే. అందుకే ఆమెలో అంత ఆనందం.

ఆ ముఖం 2012లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆమె తమ్ముడు జోషువా అవర్సనో (21)ది. ఇప్పుడు సర్జరీ ద్వారా ఆ ముఖాన్ని అతికించుకున్న వ్యక్తి 39 ఏళ్ల రిచర్డ్ నోరిస్. 2002 సంవత్సరంలో నోరిస్ ఆత్మహత్య చేసుకోవడం కోసం ముఖాన్ని షాట్‌గన్‌తో పేల్చేసుకున్నాడు. ముక్కు, నోరు, దవడ పచ్చడి పచ్చడై హాలివుడ్ సినిమా ఈ.టీ.లోని గ్రహాంతరవాసిలా మరిపోయాడు. దాదాపు 30 సర్జరీల ద్వారా పోయే ప్రాణాన్ని నిలుపుకున్నా పరమ వికారంగా మారిపోయిన ముఖాన్ని మాత్రం మార్చుకోలేక పోయాడు. డోనర్ దొరికితే అత ని ముఖాన్ని మరొకరి ముఖంతో మార్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానంటూ... మానవ అవయవాల మార్పిడిలో అపార అనుభవం కలిగిన డాక్టర్ ఎడ్వార్డో రోడ్రిగెజ్ ముందుకొచ్చారు.

అయితే ఈ సర్జరీ ద్వారా బతికే అవకాశాలు కేవలం 50 శాతం మాత్రమేనని కూడా ఆ డాక్టర్ హెచ్చరించారు. వికారిగా జీవించడంకంటే రిస్కు తీసుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు నోరిస్. అప్పటి నుంచి తనకు సరిపడే ముఖాన్నిచ్చే డోనర్ కోసం వెతకడం ప్రారంభించారు. సరిగ్గా ఆ సమయంతోనే రెబెకా సోదరుడు అవర్సనో రోడ్డు దాటుతూ కారు ప్రమాదంలో కన్ను మూశాడు. అతని ముఖాన్ని దానం చేయడానికి అతని తల్లి గ్వెన్ అవర్సనో అంగీకరించింది.

దాంతో మేరిలాండ్ మెడికల్ సెంటర్‌లో నోరిస్‌కు డాక్టర్ ఎడ్వార్డో తన వైద్య బృందంతో 36 గంటలపాటు శస్త్రచికిత్స చేసి నోరిస్ ముఖాన్ని అవర్సనో ముఖం (హాలివుడ్ చిత్రం ‘ఫేస్ ఆఫ్’లో లాగా)తో మార్చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన, ఖరీదైన సర్జరీగా రికార్డుల్లోకి ఎక్కిన ఈ సర్జరీలో 150 మంది డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సర్జరీలో ఒక ముఖ చర్మాన్నే కాకుండా డోనర్ నుంచి ముక్కు, దవడ, నాలుకను కూడా తీసుకొని మార్పిడి చేశారు.

ప్రపంచంతో మొట్టమొదటి సారిగా 2005లో, ఫ్రాన్స్‌లో ఓ మహిళకు పాక్షికంగా ముఖ మార్పిడి విజయవంతంగా  చేశారు. ఇలాంటి పాక్షిక సర్జరీలు ప్రపంచంలో ఇప్పటి వరకు 27 చేశారు. వారిలో నలుగురు మరణించారు. పూర్తి స్థాయిలో ఫేస్ మార్పిడి చేయడం నోరిస్‌దే మొదటిది. నోరిస్ ప్రతిరోజు క్రమం తప్పకుండా మందులు వాడితే ఇంకా 20 నుంచి 30 ఏళ్ల వరకు బతకొచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. మొన్న ఆదివారం నాడు నోరిస్‌ను ఆయన ఇంట్లో అవర్సనో సోదరి రెబెకా తొలిసారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా కెనడాకు చెందిన సీటీవీ న్యూస్ నెట్‌వర్క్ 60 నిమిషాల నిడివిగల వీడియోను చిత్రీకరించింది.
 

>
మరిన్ని వార్తలు