లండన్‌లో గజం రూ. కోటి

30 Nov, 2013 01:52 IST|Sakshi
లండన్‌లో గజం రూ. కోటి

 లండన్/ముంబై: హైదరాబాద్, ముంబై, పుణేల్లో రియల్టీ ప్రాజెక్టులు చేపడుతున్న లోధా గ్రూప్... లండన్ రియల్టీ మార్కెట్లోనూ అడుగుపెట్టింది. ఇందుకోసం సెంట్రల్ లండన్‌లోని మెక్‌డొనాల్డ్ హౌస్‌ను ఏకంగా రూ.3,120 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. ఇప్పటిదాకా మెక్‌డొనాల్డ్ హౌస్‌లో కెనడా రాయబార కార్యాలయం ఉంది. దీన్ని కెనడా ప్రభుత్వం విక్రయానికి పెట్టడంతో తాము కొనుగోలు చేసినట్లు లోధా గ్రూప్ శుక్రవారం తెలియజేసింది. కాగా లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లో ఉన్న కెనడా హౌస్‌ను పునరుద్ధరించే నిమిత్తం మెక్‌డొనాల్డ్ హౌస్‌ను విక్రయానికి పెట్టినట్లు లండన్‌లోని కెనడా రాయబారి గోర్డన్ క్యాంప్‌బెల్ చెప్పారు. దీనికోసం పోటీపడిన ఇతర అంతర్జాతీయ దిగ్గజాల్ని తోసిరాజని... చదరపు గజానికి దాదాపు కోటి రూపాయలు వెచ్చించి మరీ లోధా గ్రూప్ దీన్ని సొంతం చేసుకోవటం విశేషం.
 
 సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ నిర్మాణం...
 లండన్‌లోని మై ఫెయిర్, బాండ్ స్ట్రీట్, మౌంట్ స్ట్రీట్‌లకు అతి సమీపంలో ఉన్న మెక్‌డొనాల్డ్ హౌస్‌ను కొనుగోలు చేయడం తమకు బాగా కలిసొస్తుందని భావిస్తున్నట్లు లోధా గ్రూప్ ఎండీ అభిషేక్ లోధా చెప్పారు. దీనికి కావలసిన నిధులను అంతర్గత వనరుల నుంచే సమీకరించుకుంటామని తెలియజేశారు. తొలి విడతగా 300 కోట్ల రూపాయలు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది మార్చికల్లా చెల్లిస్తామని చెప్పారాయన. బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు కిలోమీటర్ లోపు దూరంలో.. 67 సెంట్లలో ఉన్న  ఈ ప్రోపర్టీలో 1.6 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలను చేపట్టవచ్చని కంపెనీ భావిస్తోంది. అంతర్జాతీయ కస్టమర్ల కోసం ఇక్కడ సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ నిర్మిస్తామని లోధా గ్రూప్ పేర్కొంది. ఐదేళ్లలో ఇక్కడ ఫ్లాట్స్ అమ్మకం ద్వారా 75 కోట్ల పౌండ్ల (రూ.7,500 కోట్లు) ఆదాయం లభిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
 
 లండన్ కోసం ప్రత్యేక సంస్థ
 ముంబై, లండన్ మార్కెట్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు కంపెనీ డిప్యూటీ ఎండీ అభినందన్ లోధా చెప్పారు. లండన్‌లో అపారమైన అవకాశాలున్నాయని, అందుకే ఇక్కడ విస్తరించాలనుకుంటున్నామని చెప్పారు. మెక్‌డొనాల్డ్ హౌస్ ప్రోపర్టీ డెవలప్‌మెంట్ కోసం, ఇంగ్లాండ్‌లో రియల్టీ బిజినెస్ కోసం... జేపీ మోర్గాన్ మాజీ ఎండీ టైలర్ గుడ్విన్ సీఈఓగా ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. లోధా గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,700 కోట్ల అమ్మకాలు సాధించింది. గడిచిన ఏడాది కాలంలో ఈ  సంస్థ ముంబైలో 17 ఎకరాలను డీఎల్‌ఎఫ్ నుంచి రూ.2,727 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబైలోని వాషింగ్టన్ హౌస్ ప్రోపర్టీని కూడా అమెరికా ప్రభుత్వం నుంచి రూ.375 కోట్లకు కొనుగోలు చేసింది.
 
 
 

మరిన్ని వార్తలు