పట్టుకున్నారుగా.. శుభాకాంక్షలు!

4 Aug, 2017 07:52 IST|Sakshi
పట్టుకున్నారుగా.. శుభాకాంక్షలు!

ఆర్మీ అధికారితో ఉగ్రవాది దుజానా చివరి సంభాషణ

శ్రీనగర్‌: లష్కరే టాప్‌ కమాండర్‌ అబూ దుజా నా మంగళవారం కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. అయితే ఎన్‌కౌంటర్‌కు ముందు ఓ ఆర్మీ అధికారి దుజానాతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికులతో దుజానా నక్కిన ఇంటికి ఫోన్‌ చేయించిన ఆ ఆధికారి అతనితో జరిపిన సంభాషణ వివరాలివి.

దుజానా: ఎలా ఉన్నారు?
అధికారి: నేనెలా ఉన్నానో వదిలేయ్‌. నువ్వెం దుకు లొంగిపోవడం లేదు?
దుజానా: ఎందుకు లొంగిపోవాలి?  ప్రాణా లు అర్పించడానికే ఇంటిని వదిలి వచ్చాను. ఈరోజైనా, రేపైనా నేను చనిపోవాల్సిందే.

అధికారి: తల్లిదండ్రుల గురించి ఆలోచించు.
దుజానా: నేను ఇంటి నుంచి బయటకు వచ్చిన రోజే వాళ్లు చనిపోయారు.

అధికారి: ప్రస్తుతం కశ్మీర్‌లో పరిస్థితి ఎం త దారుణంగా ఉందో నీకు తెలుసు కదా. ఇదంతా ఆటలో భాగంగా జరుగుతోంది.
దుజానా: నాకు వ్యవస్థ గురించి, కశ్మీర్‌లో పరిస్థితుల గురించి పూర్తిగా తెలుసు. ఎవరైనా ఆటలు ఆడాలనుకుంటే నేనేం చేయగలను? ఇంకేంటి విశేషాలు? మీరెలా ఉన్నారు?

అధికారి: దీనికంతటికి ఇది సరైన సమయం కాదు. మేము బాగానే ఉన్నాం.
దుజానా: (నవ్వుతూ..) కొన్నిసార్లు మీరు మా కంటే ముందున్నారు. మరికొన్ని సార్లు మేము ముందున్నాం. ఏదైతేనేం చివరికి మమ్మల్ని పట్టుకున్నారు. మీకు శుభాకాంక్షలు.

అధికారి: మేమెవరిని చంపాలనుకోవట్లేదు.
దుజానా: మీకు సమాచారం ఇచ్చిన వ్యక్తులు నేను చనిపోవాలని కోరుకుంటున్నారు.

అధికారి: ఇది జిహాద్‌(పవిత్ర యుద్ధం) కాదు. అది మీకు కూడా తెలుసు.
దుజానా: పోనివ్వండి. ఇప్పుడేం చేయలేం.

అధికారి: అయితే లొంగిపోండి. మీరు మాత్రమే ఇతరులకు దిశానిర్దేశం చేయగలరు. కశ్మీర్‌లో రక్తపాతాన్ని ఆపగలరు.
దుజానా: కశ్మీర్‌లో రక్తపాతానికి నేను కారణం కాదు. అది ప్రజలందరికి తెలుసు.

అధికారి: లష్కరేలో నువ్వే ముఖ్యమైన కమాండర్‌వి. ప్రజలకు వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత నీపైన ఉంది.
దుజానా: సరే నేను చూస్తాను... అంటూ కాల్‌ కట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు