విలువలు మంటగలిపారు..

6 Apr, 2017 00:52 IST|Sakshi
విలువలు మంటగలిపారు..

- గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్‌పై వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ధ్వజం
- ఫిరాయింపులను నిషేధించాలని ఢిల్లీలో అన్ని పార్టీలను కోరుతాం  


సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్‌.. ముగ్గురూ రాజ్యాంగ విలువలను కాపాడటంలో విఫలమయ్యారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 70 ఏళ్లుగా నెలకొల్పుకున్న ప్రజాస్వామ్య విధానాలను, రాజ్యాంగ బద్ధమైన సంప్రదాయాలకు సీఎం చంద్రబాబు పాతరేస్తూంటే గవర్నర్‌  నరసింహన్‌ దగ్గరుండి రాజముద్రలు వేస్తున్నారని ఆయన విమర్శించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఏపీలో రాజ్యాంగం అమలులో ఉందా? లేకుంటే ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటి? అని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అసహ్యిం చుకునేలా చంద్రబాబు సాగిస్తున్న పరిపాలన పోకడలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుపై స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు స్పందించకుండా, ఏకంగా వారిని శాసనసభలో అధికారపక్షం వైపు కూర్చోబెట్టి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.  సీఎం తన  కార్యాలయంలోనే 21 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు వేయడమే కాక వారిలో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేశారన్నారు.

రాష్ట్రపతికి విన్నవిస్తాం..
ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని తమ పార్టీ ఫిర్యాదులు చేసినా స్పీకర్, గవర్నర్‌ పట్టించుకోలేదని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినపుడు రాష్ట్రపతి జోక్యం చేసుకునే అవకాశం ఉందని, 256వ ఆర్టికల్‌ ప్రకారం ఆయనకు అపరిమితమైన అధికారాలున్నాయని ధర్మాన గుర్తు చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్రపతిని కలవనుందని వెల్లడించారు. ఫిరాయింపులను పూర్తిగా నిషేధించాలని, ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలను రద్దు చేసేలా కొత్త చట్టాలను తేవాలని ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలసి కోరతామని చెప్పారు.

ప్రధాని మోదీ స్పందించాలి..
దేశంలో ఉన్నత సంప్రదాయాలు నెలకొల్పడానికి కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ధర్మాన ప్రశ్నించారు. ఏపీలో సాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని గవర్నర్‌కు తగిన ఆదేశాలివ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ రాకుండా ఢిల్లీలో టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. తమ ప్రయత్నం తాము చేస్తామని సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు