మా అధికారాలు మాకివ్వండి: జెడ్పీటీసీలు

29 Sep, 2015 04:16 IST|Sakshi

 నల్లగొండ : జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల హక్కులు, అధికారాలు తిరిగి కల్పించాలని తెలంగాణ జెడ్పీటీసీల ఫోరం డిమాండ్ చేసింది. నిధులు, విధులకు సంబంధించి గతంలో ఉన్న విధంగా అన్ని రకాల అధికారాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం నల్లగొండలో జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీల ఫోరం సమావేశం నిర్వహించింది. ఫోరం అధ్యక్షుడు మందడి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కోయ హేమా జీ, ప్రధానకార్యదర్శి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్‌కు కేటాయించి జెడ్పీలు ఆర్థిక పరిపుష్టిసాధించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్‌ఆర్‌ఎం నిధులకు పేరు మార్చి ఎమ్మెల్యేలకు, మంత్రులకు కేటాయించిన ఏఆర్‌ఆర్ నిధులను తిరిగి జెడ్పీటీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక గది, ప్రొటోకాల్‌లో  ప్రాధాన్యత, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు గెజిటెడ్ హోదా, మండల స్థాయిలో ఉండే ఆహార సలహా సంఘం కమిటీ, వైద్య కమిటీల్లో జెడ్పీటీసీలకు ఉపాధ్యక్ష హోదా కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

73,74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు 23 అధికారాలు కల్పించాల్సి ఉండగా ప్రస్తుతం 11 అధికారాలు మాత్రమే బదలాయించారని, మిగిలిన అధికారులను కూడా స్థానిక సంస్థలకు బదలాయించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 7న చలోహైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హేమాజీ తెలిపారు. ఇందిరా పార్కు వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జెడ్పీటీసీలు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు