ఆరుతడిలో సజ్జ మేలు

28 Aug, 2014 00:21 IST|Sakshi
ఆరుతడిలో సజ్జ మేలు

ఆరుతడి పంట కింద సజ్జ సాగు లాభదాయకంగా ఉందని మండల పరిధిలోని పలువురు రైతులు చెబుతున్నారు. వానలు సరిగ్గా లేకపోవడంతో తక్కువ నీటితో ఈ పంటను పండిస్తున్నామని పేర్కొంటున్నారు. ఎకరాకు 10నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉండటంతో
 లాభదాయకంగా ఉందంటున్నారు.  
        - తూప్రాన్

- తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు అవకాశం
- ఇతర పంటలతో పోలిస్తే పని చాలా తక్కువ
 - లాభదాయకంగా ఉందంటున్న రైతులు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలపైనే మక్కువ చూపుతున్నారు. వానలు లేకపోవడంతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగుల్లో చుక్క నీరు కనిపిం చడం లేదు. దీంతో బోరుబావుల నుంచి వస్తు న్న కొద్దిపాటి నీళ్లతో ఆరుతడి పంటలను సాగుచేస్తున్నారు. ఈ సమయంలో మండల పరిధిలోని పలువురు రైతులు సజ్జ పంటపై దృష్టి సారించారు. మంచి లాభాలు వస్తుండడంతో మిగతా వారు కూడా దీన్ని పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్థానిక అన్నదాతలు వరి, మొక్కజొన్న పంటలను ప్రధానంగా సాగుచేస్తారు.

అయితే కొన్నేళ్లుగా వర్షా లు సరిగ్గా కురువకపోవడంతో భూగర్భ జలా లు భారీగా పడిపోయాయి. దీంతో కూరగాయలు, ఆరుతడి పంటలను విరివిగా వేస్తున్నా రు. సజ్జలకు మార్కెట్లో మంచి డిమాండ్ లభిస్తుండటంతో ఘనపూర్, దమ్మక్కపల్లి, వెంకటాపూర్ అగ్రహారం, కోనాయిపల్లి(పీటీ), రం గాయిపల్లి, ధర్మారాజుపల్లి, అల్లాపూర్, ఇ మాంపూర్, రామాయిపల్లి  గ్రామాల రైతులు ఈ పంటను సాగుచేస్తున్నారు. ఎకరానికి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు. మండలంలోని పలు సీడ్ కంపెనీల వారు రైతులతో ఈ పంటను సాగు చేయిస్తున్నారు. లాభాలు బాగుండటంతో   ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.  
 
సాగు సమయం
- ఖరీఫ్ సీజన్‌లో ఆగస్టు మాసంలో, రబీ సీజన్‌లో జనవరిలో సాగు చేయవచ్చు.
- నీరు ఇంకే అన్ని నేలల్లో దీన్ని వేసుకోవచ్చు.
- సజ్జల్లో డబ్ల్యూ సీసీ-75, ఐసీఎంహెచ్-451, మల్లికార్జున, ఐసీటీపీ-8203 తదితర రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
- ఎకరాకు 1.6 కిలోల విత్తనాలు సరిపోతాయి.
- వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన కంపెనీలకు చెందిన విత్తనాలు వాడటం మేలు
 
పంట దిగుబడి
- పంట బాగా పండితే ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
- 90 రోజుల్లోనే చేతికి వస్తుంది కాబట్టి రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
- క్వింటాలు సజ్జలకు మార్కెట్ ధర రూ.4 వేల వరకు పలుకుతోంది.
 
విత్తన శుద్ధి
- విత్తనాలను మొదట ఉప్పు నీటిలో పది నిమిషాలు నానబెట్టాలి.
- తేలికగా ఉండి పైకి తేలిన వాటిని తీసి పడేయాలి.
- మిగిలిన వాటిని కొంత సేపు గాలిలో ఆరబెట్టి విత్తుకోవాలి.
- నారుమడుల్లో విత్తనాలు వేసి మొలకెత్తిన తర్వాత పొలంలో నాటుకోవాలి
 
మూడేళ్లుగా వేస్తున్నా
ఇతర పంటలతో పోలిస్తే సజ్జ సాగు తేలికగా ఉంది. మూడేళ్లుగా ఈ పంట వేస్తున్నా. మార్కెట్లో దీనికి మం చి డిమాండ్ కూడా ఉంది. మేము పండించిన పం టను సీడ్ కంపెనీల వారు సైతం తీసుకెళ్తున్నారు. వారి సూచనలు పాటించి సాగుచేస్తున్నాం.- బాలయ్య, ఘనపూర్
 
 సస్యరక్షణ చర్యలు
- తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి.
- వెంటనే వాటిని గుర్తించి  ఏరి కాల్చివేయాలి.
- అలాగే తెగులు సోకిన కంకి నుంచి ఎర్ర రంగులో ఉన్న తేనే వంటి చిక్కటి ద్రవం కారుతుంది.
- దీని నివారణకు థైరం, మాంకోజెబ్, కార్బండిజమ్ మందును నీటిలో కలిపి వారంలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
 
దుక్కి సిద్ధం చేసుకోవడం

- పంట నాటేందుకు ముందు దుక్కిని బాగా దున్నుకోవాలి.
- పశువుల పేడ, సేంద్రియ ఎరువులు వేసుకోవాలి.
- భూమిలో సరైన తేమ ఉన్న సమయంలో మట్టి పెడ్డలు లేవకుండా పొడి దుక్కిని సిద్ధం చేసుకోవాలి.
- అనంతరం కాలువలు(బోజ) కొట్టుకోవాలి.
- కాలువకు ఇరువైపులా మొక్కల మధ్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా చూసుకోవాలి.
- సరైన నీటి తడులు ఇస్తూ విత్తనం మొలకెత్తే వరకూ జాగ్రత్తగా చూసుకోవాలి.
- కలుపు నివారణకు విత్తనం నాటిన నాలుగు రోజుల్లోపు అట్రాజిన్ 50శాతం పొడి మందును ఎకరాకు 500 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలి.
- నెల రోజుల తర్వాత కలుపు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు