పకృతి సేద్య సూత్రాలన్నీ పాటిస్తేనే సత్ఫలితాలు!

12 Jan, 2016 00:26 IST|Sakshi
పకృతి సేద్య సూత్రాలన్నీ పాటిస్తేనే సత్ఫలితాలు!

మార్కెటింగ్ సమస్యలు అధిగమించడం ఎలా?
 మార్కెట్ వ్యవస్థను నమ్ముకోవచ్చు. రైతులే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవాలి. వినియోగదారులకూ నమ్మకమైన సహజాహారం సమంజసమైన ధరకు లభిస్తుంది. రైతులకూ మేలు జరుగుతుంది.  తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించుకునే హక్కు రైతులకుంది. అయినా, మార్కెట్‌లో ఉత్పత్తుల రిటైల్ ధరపై 50%కు మించకుండా ప్రకృతి వ్యవసాయదారులు ధర నిర్ణయించుకోవడం ఉత్తమం.
 
 రైతులతో ముఖాముఖిలో సుభాష్ పాలేకర్ స్పష్టీకరణ
 పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరోబడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ -జెడ్.బి.ఎన్.ఎఫ్.) పద్ధతులను అనుసరిస్తూ చక్కని పంట దిగుబడులు సాధిస్తున్న అన్నదాతలు తెలుగునాట నలుచెరగులా ఉన్నారు. గత కొన్నేళ్లుగా విస్తృతంగా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్న జెడ్.బి.ఎన్.ఎఫ్. పితామహుడు సుభాష్ పాలేకర్ వేలాది మంది రైతులకు ఆచరణాత్మక వెలుగుబాట చూపుతున్నారనడంలో సందేహం లేదు. ఒక రోజు, మూడు రోజులు, 5 రోజుల పాటు జరిగే శిక్షణా శిబిరాల్లో నేరుగా పాలేకర్ శిక్షణ పొందిన రైతులెందరో ఉన్నారు.

వీరితోపాటు పుస్తక జ్ఞానంతో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులు మరికొందరున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తున్న క్రమంలో రైతులకు ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతాయి. ఇవి తీరక రైతులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పాలేకర్ రైతుల ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు స్వయంగా ఉపక్రమించారు. హైదరాబాద్‌లో ఇటీవల గ్రామభారతి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ముఖాముఖిలో రైతుల సందేహాలను పాలేకర్ నివృత్తి చేశారు. వాటిలో ముఖ్యమైన కొన్నిటిని ‘సాగుబడి’ పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం..
 
ప్రశ్న: జీరోబడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రెండేళ్ల క్రితం నుంచి దానిమ్మ తోట సాగు చేస్తున్నాం. కాయలకు పగుళ్లు వస్తున్నాయి. పరిష్కారం ఏమిటి?
 - సంజీవరెడ్డి, అనంతపురం
 పాలేకర్: జీరోబడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోని మూలసూత్రాలన్నిటినీ పాటిస్తే నూటికి నూరు శాతం ఫలితాలు పొందవచ్చు. సగం సగం చేస్తే ప్రయోజనం లేదు. దానిమ్మ చెట్ల మధ్య మునగ మొక్కలు నాటాలి. ద్విదళ, ఏకదళ పంటల గడ్డితో ఆచ్ఛాదన చేయాలి. సాలు వదిలి సాలులో కందకాలు తవ్వాలి. పప్పుధాన్య పంటలను అంతర పంటలుగా సాగు చేయాలి. వీటిలో ఏది లోపించినా ఫలితం ఉండదు. వీటిని 50% లేదా 70% అమలు చేస్తే ఫలితం రాదు. ఉండీ లేనట్టుండే నీడనివ్వడం కోసం రెండు దానిమ్మ మొక్కల మధ్య మునగ మొక్క నాటాలి. మహారాష్ట్రలో షోలాపూర్ మండలం పండరిపురంలో శరత్ షిండే (090285 98955) భగువ రకం దానిమ్మను జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1.75 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తొలి 22 నెలల్లోనే రూ. 9,60,000 ఆదాయం పొందారు. వెళ్లి చూడండి.
ప్రశ్న: నాకు 4 ఎకరాల బత్తాయి తోట ఉంది. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఆరేళ్లుగా సాగు చేస్తున్నా.  ప్రకృతి వ్యవసాయంలోకి మారొచ్చా?
 - సి. భగవంతరావు, తుర్కపల్లి, నల్గొండ జిల్లా
 పాలేకర్: మీ తోటలో తప్పకుండా వెంటనే ప్రకృతి వ్యవసాయం ప్రారంభించవచ్చు. బత్తాయి మొక్కల మధ్య మునగ మొక్కలు నాటాలి. సాలు వదిలి సాలులో 3 అడుగుల వెడల్పు, అడుగు లోతులో కందకం తవ్వాలి. అలసంద, ఉలవ వంటి అపరాల పంటలను అంతరపంటలుగా వేయాలి.

ప్రశ్న: పాలీహౌస్‌లలో పంటలకు బ్యాక్టీరియా, ఫంగస్ తెగుళ్లతో సతమతమవుతున్న రైతులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలోకి మారటం సాధ్యమేనా?
 పాలేకర్: పాలీహౌస్‌లలో నిస్సందేహంగా ప్రకృతి సేద్యం చేయొచ్చు. ముఖ్యంగా రెండు ప్రధాన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి వాడకాన్ని పది శాతానికి తగ్గించడం, మొక్కల వేరు వ్యవస్థ వద్ద సూక్ష్మ వాతావరణం ఏర్పడేలా జాగ్రత్తపడటం అత్యవసరం. పాలీహౌస్‌లలో కూడా మల్చింగ్ చాలా అవసరం. మల్చింగ్‌గా వేసే గడ్డీ గాదంలో 75% ఏకదళ పంటల (వరి, జొన్న్డ, కొర్ర..) గడ్డి + 25% ద్విదళ పంటల (కంది, మినుము, పెసర, ఉలవ..) గడ్డి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే భూసారాన్ని పెంచే జీవనద్రవ్యం (హ్యూమస్) ఏర్పడుతుంది. ఏదో ఒక రకం గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే ప్రయోజనం ఉండదు. ప్రశాంత్ నికం (086001 15057), అవినాష్ మొకాటె(086050 02369) , రాంధోరాథ్ (పుణే, మహారాష్ట్ర), డా. శంకర్ పాటిల్ (నాందేడ్) తదితర రైతులు పాలీహౌస్‌లు, షేడ్‌నెట్లలో ప్రకృతి సేద్యంతో నిక్షేపంగా పూలు, కూరగాయలు పండిస్తున్నారు.

ప్రశ్న: టమాటా తోటను సాగు చేస్తున్నాను. చేను చుట్టూ గట్టు మీద కంది మొక్కలు వేశాను. వరిగడ్డి ఆచ్ఛాదనగా వేశాను. జీవామృతం వాడుతున్నాను. అయినా టమాటాకు వైరస్ వచ్చింది. పరిష్కారం ఏమిటి?
 - పన్నాల వాసురెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా
 పాలేకర్: టమాటా పంట దిగుబడి బాగా రావాలంటే.. ముఖ్యంగా రెండు విషయాలు గ్రహించాలి. మల్చింగ్ సక్రమంగా చేయడంతోపాటు పాక్షికంగా నీడనిచ్చే కంది లేదా మునగ లేదా మొక్కజొన్న పంటను టమాటాలో అంతరపంటగా సాగు చేయాలి. వరి గడ్డి ఒక్కటే ఆచ్ఛాదనగా వేయడం అంటే.. అర్థం ఏమిటంటే.. ఇడ్లీ ఒక్కటే పెడుతున్నారు, సాంబార్ ఇవ్వటం లేదు. పాలానికి ఆచ్ఛాదనగా వరి గడ్డి లేదా చెరకు ఆకులు మాత్రమే వేస్తే చాలదు. ఇటువంటి ఏక దళ పంటల గడ్డిని మాత్రమే ఆచ్ఛాదనగా వేసినప్పుడు ప్రతి 80 కిలోల సేంద్రియ కర్బనానికి ఒక కిలో చొప్పున నత్రజని భూమికి అందుతుంది.

కర్బనం, నత్రజని 10 : 1 పాళ్లలో అందుబాటులో ఉంటేనే భూమిలో జీవనద్రవ్యం ఏర్పడి పంటలు బలంగా పెరుగుతాయి. ఇందుకోసం.. వరి గడ్డితోపాటు నత్రజనిని అందించే పప్పుధాన్య పంటల కట్టెను కూడా కనీసం 25 % మేరకు వేయాలి. హ్యూమస్ పుష్కలంగా ఉంటే పంట బలంగా ఉంటుంది. అది తక్కువగా ఉంటే పంట బలహీనమై వ్యాధుల బారిన పడుతుంది. ఇక రెండో విషయం ఏమిటంటే.. టమాటా ఆకులు తీవ్రమైన ఎండను తట్టుకోలేవు. కాసేపు నీడ, కాసేపు ఎండ (డాన్సింగ్ షాడో) పడుతూ ఉంటే టమాటా పంట దిగుబడి బాగా వస్తుంది. ఎందుకంటే.. ఆరుబయట ఎండ తీవ్రత 8,000 నుంచి 12,000ల ఫుట్ క్యాండిళ్ల (ఫుట్ కాండిల్ అంటే.. చదరపు అడుగు విస్తీర్ణంలో వత్తుగా కొవ్వొత్తులను వెలిగిస్తే వచ్చే వేడి) మేరకు ఉంటుంది.

కానీ, టమాటా పంటకు 5 వేల నుంచి 7 వేల వరకు సరిపోతుంది. అందుకే.. ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగయ్యే టమాటా తోటలో కంది, మునగ, మొక్కజొన్న వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయడం తప్పనిసరి. తద్వారా టమాటా మొక్కలకు తగిన నీడను అందించి, అధిక దిగుబడి పొందవచ్చు. మీరు అంతర పంటలుగా మునగ, మొక్కజొన్న వేయండి. ఈ లోగా 100 లీ. నీటికి 10 లీ. జీవామృతం కలిపి పంట మీద పిచికారీ చేస్తుండండి. టమాటాలు సగం సైజుకు పెరిగినప్పుడు సప్తధాన్యాంకుర్ కషాయం పిచికారీ చేయండి. మంచి దిగుబడి వస్తుంది.

ప్రశ్న: ఆకులపై నల్లమంగు తెగులు వస్తోంది. ఏం చేయాలి?
 పాలేకర్: 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల జీవామృతం + 5 లీటర్ల పుల్ల మజ్జిగ కలిపి పిచికారీ చేస్తే శిలీంద్రాలు / వైరస్‌ల సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
ప్రశ్న : మామిడి చెట్లపై పిండినల్లిని నియంత్రించడం ఎలా?
 పాలేకర్: మిత్రపురుగుల ద్వారా సహజ పద్ధతుల్లో పిండినల్లిని నియంత్రించడమే సులభమార్గం. పిండినల్లిని తినే మిత్రపురుగులు 36 రకాలున్నాయి. వీటిలో రెండు రకాలు మరింత ప్రభావశీలంగా పనిచేస్తాయి. ఈ మిత్రపురుగులు మీ తోటలో పుష్కలంగా ఉండాలంటే అలసంద, బంతి, మొక్కజొన్న, మునగ, తులసి వంటి పంటలను అంతరపంటలుగా సాగు చేయాలి. జీవ నియంత్రణ పద్ధతులతో ప్రకృతిసిద్ధంగా పరిష్కారం ఉంది. రసాయనిక పురుగు మందులు చల్లవద్దు.
ప్రశ్న : ఆకుకూరల్లో ఆచ్ఛాదన (మల్చింగ్) సాధ్యం కావడం లేదు. వరిపొట్టును ఆచ్ఛాదనగా వాడొచ్చా?
 పాలేకర్: మల్చింగ్ మూడు రకాలు. పంట పొలంలో మొక్కల మధ్య ఖాళీని గడ్డీగాదంతో ఆచ్ఛాదన (స్ట్రా మల్చింగ్) చేయవచ్చు. అసలు ఖాళీయే లేకుండా వత్తుగా పంటలను సాగు చేయవచ్చు (లైవ్ మల్చింగ్). ఈ రెండూ సాధ్యం కాని చోట పంట మొక్కల మధ్య ఎండపడే నేలను (ఒకటి, రెండు అంగుళాల లోతున) తవ్వడం (సాయిల్ మల్చింగ్). ఆకుకూరలు సాగు చేసే మడుల్లో సాధారణంగా సజీవ ఆచ్ఛాదన ఏర్పడుతుంది. కాబట్టి ఈ మడుల్లో మళ్లీ వరి పొట్టుతో మల్చింగ్ చేయనవసరం లేదు.  అయితే, మిరప, టమాట, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాలీఫ్లవర్ తదితర కూరగాయల తోటల్లో వరి పొట్టును మల్చింగ్‌గా వాడొచ్చు.

ఒక సాలులో మల్చింగ్ వేస్తే, మరో సాలులో నీటిని అందించేందుకు కాలువ తవ్వాలి. ఈ తోటల్లో వరి పొట్టును మల్చింగ్‌గా వేసే సాళ్లలో పప్పుధాన్యాల పంటలను అంతర పంటలుగా సాగు చేయాలి.  మల్చింగ్ వల్ల పగలు ఎండ నుంచి నేలను రక్షించడంతోపాటు రాత్రి పూట మంచు నీటిని ఒడిసిపట్టి నేలకు అదనపు తేమను అందిస్తుంది. ఇందువల్లనే జీరోబడ్జెట్ ప్రకృతి సేద్యంలో కరువు కాలంలోనూ 10% నీటితోనే చక్కగా కూరగాయ పంటలు పండించవచ్చు.

ప్రశ్న: మునగ తోటలో ఆకులు తినే గొంగళి పురుగులు దశపర్ణి కషాయం, అగ్నిఅస్త్రం చల్లినా కంట్రోల్ కావడం లేదు...?
 పాలేకర్: ఈ సమస్య దేశీ మునగ వంగడాల సాగు చేసే పొలాల్లో ఉండదు. పీకేఎం1, పీకేఎం2, హైబ్రిడ్ మునగ వంగడాలతోనే ఈ సమస్య వస్తున్నది. మునగలో పసుపు, అల్లం, మిరప వంటి అంతరపంటలు వేయాలి. 100 లీ. నీటిలో 5 లీ. దశపర్ణి కషాయం కలిపి పిచికారీ చేయండి. కొమ్మలు కత్తిరించండి. మొక్కలోని శక్తిని రొట్ట పెరుగుదలకు కాకుండా కాయలకు అందించడానికి ఇది అవసరం.

ప్రశ్న: బొప్పాయి తోటకు వైరస్ బెడద ఎక్కువగా ఉంది...?
 - పడాల గౌతమ్, ముల్కనూరు, ఆదిలాబాద్ జిల్లా
పాలేకర్:
బొప్పాయి మొక్కలకు నీటిని తగుమాత్రంగా ఇవ్వాలి. ప్రకృతి వ్యవసాయంలో ఒకానొక మూల సూత్రమైన ‘వాఫస’ ఏర్పడేలా చూడాలి. అంటే వేళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పంట మొక్కల వేళ్లకు కావాల్సింది నీరు కాదు, నీటి ఆవిరి మాత్రమేనని గుర్తించాలి. పంటల వేరు వ్యవస్థ దగ్గర రెండు మట్టి కణాల మధ్య నీరు ఉండకూడదు.. 50% నీటి ఆవిరి, 50% గాలి అణువులు కలిసి ఉండాలి. ఈ స్థితినే ‘వాఫస’ అంటున్నాము. ఇది జరగాలంటే.. మిట్ట మధ్యాహ్నం మొక్క / చెట్టు చుట్టూ నీడ పడే చోటుకు ఆరు అంగుళాల దూరంలో చిన్న కాలువ తవ్వి నీరందించాలి.

ప్రశ్న :వేరుశనగలో పొగాకు లద్దె పురుగు తీవ్రతను అరికట్టేదెలా?
 - ఊర్మిళమ్మ, రైతు
 పాలేకర్: వేరుశనగ పంటకు తీవ్రమైన ఎండ అక్కర్లేదు. 4 వేల నుంచి 7 వేల ఫుట్ క్యాండిళ్ల ఎండ చాలు. ఖరీఫ్‌లో కంది, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు.. రబీలో ఆవాలను అంతర పంటగా వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల ఘన జీవామృతం వెదజల్లాలి. పూత దశలో మరో 100 కిలోల ఘనజీవామృతం వెదజల్లాలి. ప్రతి 15 రోజులకోసారి జీవామృతం పిచికారీ చేయాలి. అయినా, చీడపీడలొస్తే.. నీమాస్త్రం, అగ్రిఅస్త్రం, దశపర్ణి కషాయం పిచికారీ చేయాలి.

ప్రశ్న: సెలైన్ నేలలను తిరిగి సాగుకు అనుగుణంగా మార్చుకోవడం సాధ్యమేనా?
 పాలేకర్: ఈ ప్రశ్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్‌లర్లను అడగాలి. రసాయనిక ఎరువులు వాడమని చెప్తున్నది వాళ్లే. పొలాల్లో వేసిన యూరియాలో 30% అమ్మోనియా మాత్రమే పంటలకు ఉపయోగపడుతోంది. మిగిలిపోయిన 70 % అమ్మోనియా భూమిలో జీవనద్రవ్యాన్ని రూపొందించే సూక్ష్మజీవరాశిని నాశనం చేస్తున్నది. లవణాల సాంద్రతతో భూమి చౌడు బారిపోతున్నది. అటువంటి సమస్యాత్మక భూముల్లో మడుల మధ్య కందకాలు తవ్వి.. 3 అంగుళాల మందాన గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేయించి జీవామృతం పిచికారీ చేస్తుంటే.. నేలలో పోగుపడిన లవణాలు క్రమంగా తగ్గుతాయి.
 - సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్

మరిన్ని వార్తలు