కీటక నాశని విష వలయంలో సాలీళ్ల బందీ!

27 Oct, 2015 09:09 IST|Sakshi
కీటక నాశని విష వలయంలో సాలీళ్ల బందీ!

పంటలపై రసాయన కీటకనాశనుల పిచికారీతో మిత్ర కీటకాలకు జరిగే హాని గురించి తరచుగా వింటున్నదే. కానీ ప్రత్యేకించి సాలీళ్లపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే అంశంపై ఇటీవలే ఉత్తర  అమెరికాలో జరిపిన ఓ పరిశోధన పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. విస్తృతంగా కీటకనాశనుల వాడకం వల్ల సాలీళ్లపై దుష్ర్పభావం చూపుతోందని, ఇది ఇలానే కొనసాగితే వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని పరిశోధనలో వెల్లడైంది.. కెనడాలోని ఎంసీగిల్ యూనివర్శిటీకి చెందిన బృందం ఈ పరిశోధన నిర్వహించింది.  
 
  సాలీళ్ళ సహజ స్వభావంలో పలు మార్పులు రావటాన్ని పరిశోధకులు గుర్తించారు. పంటలకు హానిచేసే కీటకాలను వేటాడటంలో వాటి సామర్థ్యం తగ్గింది. కీటకాల పీడను తగ్గించటంలోను.. కొత్త ప్రాంతాలకు విస్తరించటంలోను సాలీళ్లు నిరాసక్తత కనబరుస్తున్నట్టు కూడా వారు కనుగొన్నారు. ముఖ్యంగా అక్కడి ఉద్యానతోటలు, పంటలపై పిచికారీ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్న పాస్మేట్ అనే కీటక నాశని ప్రభావం వల్ల శత్రు కీటకాలను నిర్మూలించటంలో వాటి సామర్థ్యం తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. చీడపీడలను గుర్తించి తక్షణ స్పందించలేకపోవటం, ఎరలను పసిగట్టి ఆహారాన్ని సంపాదించుకునే క్రమంలో అవి వేగంగా స్పందించలేకపోతున్నాయి. అయితే ఈ ప్రభావం ఆడ, మగ సాలీళ్లపై చూపే ప్రభావంలో వ్యత్యాసాలున్నాయి.. కీటకనాశనుల ప్రభావానికి గురైనా వాటి ఆహారాన్ని సముపార్జించే సామర్థ్యాన్ని మగ సాలీళ్లు కోల్పోనప్పటికీ  బాహ్యవాతావరణానికి అనుగుణంగా అన్వేషించగలిగే లక్షణాన్ని కోల్పోయాయి.
 
 ఆడ సాలీళ్లు మాత్రం ఆహారాన్వేషణలో వాటి పూర్వ సామర్థ్యాన్ని కొనసాగించగలిగాయి. ‘పంటకాలం ప్రారంభం నుంచి శత్రుకీటకాలను తిని రైతులకు మేలు చేసే సాలీళ్లు కీటకనాశనుల పిచికారీతో కుదేలవుతున్నాయి. త్వరలోనే ఈ పరిస్థితి మారకుంటే అత్యంత విలువైన వాటిని మనం కోల్పోవచ్చు’ అని ఎంసీగిల్ యూనివర్శిటీకి చెందిన రఫెల్‌రాయ్ పూర్వ పీహెచ్‌డీ విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు