పొద్దుతిరుగుడు మేలు

20 Nov, 2014 01:53 IST|Sakshi

అనువైన నేలలు, విత్తన రకాలు
 డీఆర్ ఎస్‌హెచ్-1, ఏపీఎస్‌హెచ్-66తో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల సంకరాలను ఎంచుకోవచ్చు.ఎకరాకు రెండు కిలోల విత్తనం సరిపోతుంది. నీరు నిల్వ ఉండని తటస్థ భూ ములు, ఎర్ర, ఇసుక, రేగడి, నల్ల ఒండ్రుమట్టి నేలలు పొద్దుతిరుగుడు సాగుకు అనుకూలంగా ఉంటాయి.

 విత్తనశుద్ధి
 మొలకశాతం పెంపొందించేందుకుగాను విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. విత్తుకునే ముందు ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్+కార్బండిజం అనే మందు 2 గ్రాములను కిలో విత్తనాలకు కలిపి శుద్ధి చేయాలి.

 విత్తేదూరం   
 తేలిక నేలల్లో వరుసల మధ్య 45 సెం.మీ మొక్కల మధ్య 20-25 సెం.మీ ఉంచాలి. బరువు నేలల్లో వరుసల మధ్య 60 సెం.మీ, మొక్కల మధ్య 30 సెం.మీ ఉండేలా చూసుకోవాలి. కుదురుకు 2-3 విత్తనాలు వేయాలి. విత్తనం మొలకెత్తిన 15 రోజుల తర్వాత కుదురుకు ఒక ఆరోగ్యవంతమైన మొక్కను ఉంచి మిగిలిన మొక్కలను తొలగించాలి.

 ఎరువులు
 ఎకరాకు 3-4 టన్నుల చివికిన పశువుల ఎరువు వేయాలి. నత్రజని ఎరువును విత్తనాలు వేసేటప్పుడు 26 కిలోలు, మొగ్గ తొడిగే దశలో 13 కిలోలు, 50 రోజుల తర్వాత పువ్వు వికసించే దశలో 13 కిలోలు వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 20 కిలోలు, మొత్తం భాస్వరం 150 కిలోలు వేసుకోవాలి. పూత దశలో 2.0 గ్రాముల బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే విత్తనాలు అధికంగా ఏర్పడతాయి.

 నీటి యాజమాన్యం
 తేలిక నేలల్లో పది రోజులకు ఒకసారి, బరువు నేలల్లో 15 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వాలి. మొగ్గ దశ, పూత దశ, గింజ కట్టే దశ, గింజ నిండే దశలో నీటి తడులు ఇవ్వాలి.

 చీడపీడల నివారణ ఇలా..
 జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు 30-40 రోజుల పంటగా ఉంది. ఈ దశలో పంటలను ఆశించే చీడపీడలు, వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం.  

 ఆకుమచ్చ తెగులు
 ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల మీద గోధుమ రంగు లేదా నల్లటి వలయకారపు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత దశల్లో మచ్చలన్నీ కలిసిపోయి, ఆకులు ఎండి పెరుగుదల ఆగిపోతుంది. ఈ తెగులు లక్షణాలు కనిపించి న వెంటనే కార్బండిజం+మాంకోజబ్ మందు 2.0 గ్రాములు లేదా ప్రొఫికొనజోల్ 1.9 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

   పువ్వు కుళ్లు లేదా తల కుళ్లు
 ఈ తెగులు పూత దశలో ఎక్కువగా వర్షాలు పడినప్పుడు ఆశిస్తుంది. ప్రథమ దశలో మొక్క చివరి భాగం, పువ్వు కింద ఉన్న ఆకులు ఎండిపోతాయి. తర్వాత దశల్లో పువ్వు తొడిమ దగ్గర కుళ్లిపోయి ఎండిపోతుంది. నివారణకు ఫెన్‌థియాన్ ఒక మిల్లీలీటరు+నీటిలో కరిగే గంధకం 3.0 గ్రాములను లీటరు నీటికి కలిపి పూత దశలో 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

 రసం పీల్చే పురుగులు
 పచ్చదీపపు పురుగులు, తెల్లదోమలు, తామర పురుగులు, ఆకుల్లో రసం పీల్చి నష్టం కలుగజేస్తాయి. దీనివల్ల ఆకులన్నీ పసుపు పచ్చగా మారిపోయి, ఆ తర్వాత ఎర్రబడి ఎండిపోతాయి. వీటి నివారణకు థయోమిథాక్సమ్ 0.5 గ్రాములు లేదా ట్రైకోఫాస్ 2.0 మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

 శనగపచ్చ పురుగు
 పొద్దు తిరుగుడు పండించే ప్రాంతాల్లో ఈ పురుగు కనిపిస్తుంది. ఈ పురుగు లార్వాలు.. పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఒక గ్రాము థయోడికార్బ్+నోవాల్యురాన్ ఒక మిల్లీలీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని వార్తలు