బాబు తరహాలోనే కేసీఆర్ పాలన

20 Nov, 2014 01:39 IST|Sakshi
  • ప్రజాపాలన పట్టదా?
  •  వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి ఆగ్రహం
  •  రైతు కుటుంబాలకు రూ. 5లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
  • నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరహాలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను కేటాయించలేదని, చంద్రబాబు మొండివైఖరి కారణంగానే రాష్ట్రానికి కరెంట్ కష్టాలు దాపురించాయని సాకుగా చూపి ప్రజాసమస్యలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
    దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 350 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, 180 మంది గిరిజనులు, గిరిజనేతరులు విషజ్వరాలతో చనిపోయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని చెప్పారు. నేను ఇప్పుడేమీ చెప్పను.. అద్భుతమంతా ముందుంది..! అని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం.. ఆయన చూపించాలనుకుంటున్న సినిమా చూసేనాటికి రాష్ట్రంలో ఇంకెంతమంది చనిపోతారో అని పొంగులేటి వ్యంగ్యాస్త్రం సంధించారు.

    ప్రతిపక్షపార్టీ హోదాలో తాము విమర్శలు చేయడం లేదని.. ఆరుమాసాల నుంచి ప్రజలు పడుతున్న బాధలను గమనించిన తర్వాతే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సి వస్తోందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల కోసం మంచిచేస్తే ముందుండి సెల్యూట్ చేసేది తమ పార్టీయేనని, అలా కాకుండా ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ముందుండి పోరాడుతుందని తెలిపారు.
     
    వలసలను ప్రోత్సహించడమే ఎజెండా

    టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినాటి నుంచి ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడమే ఎజెండా పెట్టుకుని పనిచేస్తోందని పొంగులేటి విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులను తమ పార్టీలోకి రప్పించుకునే ప్రయత్నాల మీదనే ఎక్కువ దృష్టి సారించదని తెలిపారు. అర్హతల పేరుతో పింఛన్లలో  కోత విధిస్తున్నారని, ఫ్లోరైడ్ బాధితులకు పింఛను మంజూరు విషయమై వారి వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదించాలని ఆయన డిమాండ్ చేశారు.
    రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్సగ్రేషియా చెల్లించాలని, పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లిన రైతాంగానికి ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని, వరి పంటకు అయితే రూ.20 వేలు చెల్లించాలని, రెండో పంట వేసుకోవద్దని చెబుతున్న రైతాంగానికి ఎకరాకు రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేసీఆర్ పాలన చూసి సిగ్గుపడాల్సి వస్తోందన్నారు.

    అసెంబ్లీ సాక్షిగా ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో వైఎస్సార్‌సీపీ ముందుందని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ రహెమాన్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాష్‌రావు, పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు శివకుమార్, ఎర్నేని బాబు, ఇరుగు సునీల్‌కుమార్, గూడూరు జైపాల్‌రెడ్డిలతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు