‘గాడ్సే’లకూ ఉంది వాక్‌ స్వేచ్ఛ

3 Mar, 2017 01:51 IST|Sakshi
‘గాడ్సే’లకూ ఉంది వాక్‌ స్వేచ్ఛ

విశ్లేషణ
రాజకీయ కారణాలతో గాంధీని చంపక తప్పలేదని గాడ్సేలు చెప్పుకున్నారు. ఆ అభిప్రాయాన్ని అంగీకరించాల్సిన పని లేదు. కానీ అంగీకారయోగ్యం కానంత మాత్రాన ఆ అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు లేదనడం సాధ్యం కాదు.

వాక్‌ స్వాతంత్య్రం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు. హత్యానేర నిందితులకు కూడా ఈ హక్కు ఉంటుంది. దోషులని రుజువై, శిక్ష అనుభవించిన వారైనా తాము చేసిన హత్య గురించి వివరిస్తూ పుస్తకాలు రాసు కోవచ్చు. జాతిపిత మహాత్మా గాంధీ హంతకులకు సైతం ఈ స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ కూడా నిందితుడికి సమాచార స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇస్తుంది. నిందితుడికి అన్నీ తెలియాలి. ఆ తరువాత అతను ఏదైనా చెప్పకునే అవకాశం ఇవ్వాలి. సెక్షన్‌ 313 కింద ఆ అవకాశం ఉంది. కోర్టులో జడ్జి అడిగిన ఏదైనా ప్రశ్నకు జవాబు ఇవ్వకపోతే శిక్ష పడదు. ఇష్టం వచ్చి నంత సేపు దోషి తన సంజాయిషీని చెప్పుకోవచ్చు. తాను గాంధీని ఎందుకు చంపవలసి వచ్చిందో వివ రిస్తూ నాథూరాం గాడ్సే కొన్ని గంటలపాటు వాంగ్మూ లం ఇచ్చాడు. నేరం రుజువై ఉరిశిక్షకు గురై అతడు చని పోయాడు.

అతని తమ్ముడు గోపాల్‌ గాడ్సే నేరం కూడా రుజు వైంది. కొన్నేళ్ల జైలు శిక్ష తదుపరి విడుదలైనాక అతను తన అన్న నాథూరాం గాడ్సే వాంగ్మూలాన్ని, ఇతర విమ ర్శలను కలిపి ‘గాంధీ హత్య–నేను’ పేరుతో మరాఠీలో ఒక పుస్తకం ప్రచురించాడు. సెక్షన్‌ 99 ఏ (సీఆర్‌పీసీ) కింద భద్రతకు భంగం కలిగించే రచనలను నిరోధించే అధికారం ఉందని, ఈ పుస్తకం హిందువులు, ముస్లింల మధ్య ద్వేషాన్ని రగులుస్తుందని అంటూ 1967లో ప్రభుత్వం ఈ పుస్తక ప్రతులన్నిటినీ స్వాధీనం చేసు కోవాలని ఆదేశించింది. సెక్షన్‌ 99 ఏ రాజ్యాంగ వ్యతి రేకమని, ఆ సెక్షన్‌ కింద జారీచేసిన ఈ ఉత్తర్వు వాక్‌ స్వాతంత్య్రానికి భంగకరమనీ కనుక దాన్ని రదు ్దచేయా లని బొంబాయి హైకోర్టులో గోపాల్‌ వినాయక్‌ గాడ్సే భారత ప్రభుత్వంపై ఒక రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు (ఎఐఆర్‌ 1971 బాంబే 56లో ఈ తీర్పు ప్రచురించారు).

వాక్‌ స్వాతంత్య్రానికి హామీ ఇచ్చే రాజ్యాంగ అధి కరణం 19(1)(ఏ) పైన పరిమితులను  19(2) వివరిం చింది. అందులో నిర్దేశించిన ఆధారాలపై పార్లమెంటు చట్టం ద్వారా వాక్‌ స్వాతంత్య్రంపైన పరిమితులు విధిం చవచ్చునని పేర్కొన్నది. సామాజిక శ్రేయస్సు కోసం సీఆర్‌పీసీ సవరణ చట్టం ద్వారా ఈ పరిమితిని విధిం చడం రాజ్యాంగబద్ధమే అని బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. సెక్షన్‌ 99 ఏ రాజ్యాంగబద్ధమే అయినా, గోపాల్‌ గాడ్సే పుస్తకాన్ని నిషేధించడం చెల్లదని ఆదేశిం చింది. ఐపీసీ సెక్షన్‌ 153 ఏ కింద ఇరు మతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రాణాలకు ముప్పు తెచ్చే రచనలు చేయడానికి వీల్లేదని అడ్వకేట్‌ జనరల్‌ వాదిం చారు. గాంధీ హంతకులను గొప్పగా చూపుతూ, గాంధీతో సమానమైన కీర్తిని గాడ్సేకు ఆపాదిస్తూ, హత్యను సమర్థించుకునే ఈ పుస్తకం సమాజానికి ప్రమా దకరమనీ, కొత్తతరాల మనసుల్లో గాంధీ హత్యను సమర్థించే తప్పుడు అభిప్రాయాల్ని కల్గించడం కోసం ఇది ప్రయత్నిస్తున్నదనీ, దాన్ని నిరోధించడం సమాజ శ్రేయస్సు రీత్యా అవసరం అని ఆయన నివేదించారు.  

గాడ్సే పుస్తకాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదింపచేసి, న్యాయమూర్తులు దాన్ని కూలంకషంగా పరిశీలించారు. దాని మూల కథనాన్ని, విమర్శను, సమకాలీన చారిత్రిక అంశాలను, హిందూ తత్వంపై వ్యాఖ్యలను లోతుగా అధ్యయనం చేసారు. ఇదొక తీవ్రమైన విమర్శే అయినా, ఆ పుస్తకం ప్రస్తుతం హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందని తమకు అనిపించడం లేదని న్యాయమూర్తులు తమ తీర్పులో పేర్కొన్నారు. కలహాలు సృష్టించడమే రచయిత ఉద్దేశం అనిపించడం లేదన్నారు. గాంధీని ఒక మత పిచ్చివాడెవడో హత్య చేశాడనే అభిప్రాయం పోగొట్టి, ఇది గాంధీ సాగించిన వ్యవహారాలను, విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే హత్యనీ, రాజకీయ కారణాల రీత్యా గాంధీని చంపడం తప్ప మరో రకంగా ఆయన నిర్ణయాలను ఆపే మార్గం లేదని భావించి హత్య చేయవలసి వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం ఈ పుస్తకం చేసిందనీ హైకోర్టు వివరించింది.

ముస్లింలను విపరీతంగా బుజ్జగిస్తూ గాంధీ తీసుకున్న నిర్ణయాల వల్ల హిందూ వర్గాలకు తీవ్రమైన హాని జరుగుతుందని రచయిత నమ్మారు. పాకిస్తానీ తెగల వారు కశ్మీర్‌పై దాడులు చేయడం వల్ల, ఆ దేశానికి రూ. 55 కోట్లు  చెల్లించాలన్న ఒప్పందాన్ని పాటించాల్సిన అవసరం లేదని మొత్తం మంత్రివర్గం ఆమోదించినా... గాంధీ నిరాహార దీక్ష చేసి, పాకిస్తాన్‌కు రూ. 55 కోట్లు ఇప్పించారనీ, ఈ విధంగానే వ్యవహరిస్తూపోతే దేశానికి నష్టం కనుక ఒక దేశ భక్తునిగా గాడ్సే అర్జునుడి వలె గాంధీని చంపక తప్పలేదనీ వారు సమర్థించుకునే ప్రయత్నం చేశారని హైకోర్టు అంది. ఆ అభిప్రాయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదనీ, అలాగే అంగీకార యోగ్యం కానంత మాత్రాన అభిప్రాయం చెప్పుకునే హక్కు లేదనడం సాధ్యం కాదనీ, కనుక పుస్తకంపై నిషేధం చెల్లదనీ అంటూ బొంబాయి హైకోర్టు ఆ పుస్త కాలను స్వాధీనం చేసుకోవాలనే ఉత్తర్వును కొట్టి వేసింది. నాథూరాం గాడ్సే వాంగ్మూలంతోపాటు, ఇంకా ఎన్నో విమర్శలున్న పుస్తకంపైనే అభ్యంతరాలు చెల్లవన్న తరువాత... కోర్టులో గాడ్సే చేసిన ప్రకటనను వెల్లడి చేయడంపై అభ్యంతరాలకు తావే లేదు.


మాడభూషి శ్రీధర్‌, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

>
మరిన్ని వార్తలు