సృజన మహాదృఢం, అతి మృదులం

25 Dec, 2016 23:34 IST|Sakshi
సృజన మహాదృఢం, అతి మృదులం

పురస్కారం

ఒక స్వచ్ఛమైన మనిషి కోసం, యుద్ధాలూ ఆయుధాలూ అవసరపడని ప్రపంచం కోసం, పువ్వుల్లాంటి మృదుత్వాల కోసం, కన్నీళ్ళకు చలించిపోయే సున్నితత్వాల కోసం, మాటల్లో ఉండాల్సిన అందమైన నిశ్శబ్దం కోసం శివశంకర్‌ చేసే అన్వేషణకు దాఖలా ఈ ‘రజనీగంధ’.



ఈ సంవత్సర కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్‌ కవి అనీ, కథకుడనీ, విమర్శకుడనీ అనడం సత్యమే అయినా, ఆయన ప్రధానంగా సృజన మార్గంలో ‘అన్వేషి’ అనడం ఇంకా ఎంతో సముచితమనుకుంటాను. గతకాలపు ఏ వెలుతురుకూ ఆయన ఛాయగా కాక తానే ఒక వినూత్నమైన దీపమైనవాడు. దీపావళి రోజున జన్మించిన శివశంకర్‌ ఒకానొక కవితలో దీపాన్ని ‘అపురూప కాంతి సుగంధ పవనం’గా అభివర్ణించాడు. ఆ పోలిక అతనికీ వర్తిస్తుందనడానికి అతనెంచుకున్న దారీ, చేసిన ప్రయాణమూ దాఖలా.

‘స్తబ్ధత–చలనం’ కవితాసంపుటి ద్వారా తలుపుల్ని తెరుచుకుని సాహిత్య క్షేత్రంలోకి అడుగిడినపుడు (1984) శివశంకర్‌ తెలుగు కవిత్వానికి కొత్త వాగ్దానం చేసినట్లు ఆ సంపుటిలోని కవిత్వం చెప్పింది. సమాజంలో పేరుకు పోయిన స్తబ్ధతను ఎత్తి చూపడంలో పదునునూ, విసురునూ, అక్కడక్కడ ఆగ్రహాన్నీ అక్షరాల్లో దట్టించిన కవి, ఆ కాల సందర్భంలో జీవితంలో పరుచుకున్న డొల్లతనాన్ని సూటిగా ధాటిగా బట్టబయలు చేశాడు. ఆగ్రహంతో పాటు వివేచన తోడై లోతుగా ప్రపంచాన్ని దర్శించే దశకు క్రమంగా చేరుకుంటూ ఆయన రాసిన కవితలు– ‘ఓ సారాంశం కోసం’ చేసిన అర్థవంతమైన ప్రయత్నాలుగా అగుపడతాయి. కవిత్వాన్ని తన రెండో ప్రపంచంగా భావించే శివశంకర్‌ క్రమంగా సృజనలో విస్తృతిని సాధించాడు.

కవిత్వాన్ని వెంటేసుకుని వెళ్తూనే కథాయానమూ చేశాడు. ‘మట్టిగుండె’ (1992) సంపుటిలోని ఆయన కథలు జీవితానికి దగ్గరైనవీ, శిల్పపరంగా విలక్షణమైనవీ. విమర్శకుడిగా ఆయనకు విశిష్టమైన భూమికను పరచడానికి ఆయన పరిశోధనా గ్రంథం ‘సాహిత్యం మౌలిక భావనలు’ పనికొచ్చింది. క్రితం రెండు దశాబ్దాల్లో శివశంకర్‌ తానెంచుకున్న మూడు దారుల్లో యంత్రికంగా కాక, కొత్త వెలుతురు మొక్కల్ని నాటుతూ ప్రయాణించాడు. ఆ ప్రయాణ క్రమంలో ‘ఆకుపచ్చని లోకంలో’ (1998), ‘ఒక ఖడ్గం ఒక పుష్పం’ (2004), ‘రజనీగంధ’ (2013) కవితాసంపుటుల్నీ, ‘సగం తెరిచిన తలుపు’ (2008) కథా సంపుటినీ, ‘నిశాంత’ (2008) పేరుతో విమర్శనూ, ‘తల్లీ నిన్నుదలంచి’ అంటూ ప్రాచీన కవిత్వ విశ్లేషణ (2012)నూ వెల్వరించాడు.

పల్లెటూరి నేపథ్యం, సాహిత్యం పట్ల అపారమైన ప్రేమా, ప్రాచీనాధునిక సాహిత్యాన్ని క్షణ్ణంగా అధ్యయనం చేసే సాధనా, జీవితం పట్ల లోతైన అనురక్తీ, ఎప్పుడూ ఇష్టపడే మానవీయ చింతనా– వీటన్నిటి కలయిక పాపినేని శివశంకర్‌. తాను ప్రధానంగా ఇష్టపడేది కవిత్వాన్నే అయినా, కథనూ, విమర్శనూ అనుబంధ విషయాలుగా ఆయన భావించలేదు. దేన్ని తీసుకున్నా దానికి తన సంపూర్ణ శక్తినీ, ప్రయోగకాంతినీ ఇవ్వడానికి యత్నించాడు. ఆ యత్నంలో అక్షరానికీ, అర్థానికీ సమప్రాధాన్యత నిచ్చాడు. సంపాదకుడిగా అతను కథల్నీ, కవితల్నీ పరిశీలించేటప్పుడు అంతే ధ్యాసనూ, లోతైన దృష్టినీ పెట్టాడు. అతన్నెవరైనా కలిసి కాసేపు ముచ్చటిస్తే నిదానస్తుడనీ, ఆచితూచి వ్యవహరించే వ్యక్తి అనీ భావించే వీలుంది. ఆ తత్వం అతని రచనలకూ వర్తిస్తుందనుకుంటాను. అందుకే అతని అక్షరాల్లో వివేచనకు చోటుంది కానీ అరాచకానికి లేదు. గాఢతకు చోటుంది కానీ గందరగోళానికి లేదు.

అతని కథల్లో అక్కడక్కడ కవితాశైలి, కవితల్లో అక్కడక్కడ కథనరీతీ కనబడుతుంది. ఆ లక్షణం ఆయా రచనలకు అదనపు కాంతే అయింది కానీ బలహీనత కాలేదు. ఆయన రాసిన ‘సముద్రం’ లాంటి కథ చదివినా, ‘తోటమాలికి వీడ్కోలు’ లాంటి కవిత చదివినా ఈ విషయం అవగతమవుతుంది. బహుప్రక్రియల్లో సాధన చేసే సృజనశీలి ప్రయాణం సులభతరమైంది కాదు. జాగ్రత్తలవసరమైన ప్రయాణం. ఆ జాగురూకత  శివశంకర్‌కుంది.

విస్తారమైన జీవితాన్ని కొద్దిపాటి శబ్దజ్ఞానంతో చెప్పడంలో చాలా పరిమితులుంటాయి. వస్తువునే తప్ప శిల్పాన్ని పెద్దగా పట్టించుకోని రచయితల్లో ఈ పరిమితి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. శబ్దమ్మీద ధ్యాసపెట్టే అలవాటున్న శివశంకర్‌ దానికి దార్ఢ్యత నివ్వగలిగాడు తన రచనల్లో. అలాగే శబ్ద పునరావృతిని అధిగమించడానికి కొత్త కొత్త శబ్దరూపాల్ని సృజించడం ఆయన కృషిలోని ప్రధానాంశాల్లో ఒకటి.
శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందించిన కవితాసంపుటి ‘రజనీగంధ’ వస్తుపరంగా, రూపపరంగా వైవిధ్యభరితమైంది. పుస్తకం పేరే అతని అభిరుచిని వ్యక్తపరిచే మెటఫర్‌. ఈ సంపుటిలో శివశంకర్‌ ఇష్టాలూ, అయిష్టాలూ, ప్రయోగధోరణులూ, తాత్విక చింతనలూ పరుచుకుని వున్నాయి.

ఒక స్వచ్ఛమైన మనిషి కోసం, యుద్ధాలూ ఆయుధాలూ అవసరపడని ప్రపంచం కోసం, పువ్వుల్లాంటి మృదుత్వాల కోసం, కన్నీళ్ళకు చలించిపోయే సున్నితత్వాల కోసం, మలినపడని సాహచర్యాల కోసం, విశాలపరిచే సౌందర్య దృశ్యాల కోసం, అర్థాల్ని తేటగా కళాత్మకంగా చెప్పే మాటల కోసం, మాటల్లో ఉండాల్సిన అందమైన నిశ్శబ్దం కోసం శివశంకర్‌ చేసే అన్వేషణకు దాఖలా ఈ ‘రజనీగంధ’. ప్రధానంగా ఆయన అన్వేషి. అన్వేషిలో అనేక ప్రశ్నలు లేస్తాయి. అందుకే రజనీగంధలో దాదాపు అన్ని కవితల్లో అనేక ప్రశ్నలుంటాయి. ‘ఎందుకు’ అనే కవిత దీనికి బలమైన ఉదాహరణ. ‘ఎందుకు ఊరికే కన్నీళ్లొస్తాయి’ అనే ప్రశ్నతో మొదలయ్యే ఈ కవితలో పది ప్రశ్నలు తప్ప మరేవీలేవు. ‘ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఏముంటుంది’ అనే ప్రశ్నతోనే మొదలవుతుంది ‘ఆలోచనాలోచన’ అనే మరో కవిత. ఒకచోట ‘సందిగ్ధత కన్న సంక్షోభమేముంది’ అని క్లిష్టమైన ప్రశ్నను వాడితే, మరోచోట ‘జానెడు పొట్టకు జగమంత ఆకలెందుకు’ అని సూటిగా ప్రశ్నించాడు. ప్రశ్నించిన చాలా సందర్భాల్లో తాను వెతుక్కున్న సమాధానాల్నీ నిర్మొహమాటంగా చెప్పాడు.

తన స్వీయానుభవాల్నుంచి, అనుభూతుల్నుంచి రాసిన కవితలు ‘రజనీగంధ’లో సింహభాగాన్ని ఆక్రమించాయి. అమెరికాయాత్రలో తాను దర్శించిన నయాగరాను ‘కళ్ళెం తెగిన ధవళాశ్వం’ అన్నాడు. ‘హే మార్కెట్‌ స్క్వేర్‌’, ‘వివేక వాక్యం’, ‘విండీసిటీ టు లేక్‌సిటీ’ లాంటి యాత్రా కవితల్లో ఆయన ప్రత్యేకమైన చూపు కనపడుతుంది. తన మనుమల మీద ప్రేమతో ఆయన రాసిన రెండు కవితలు, బిస్మిల్లాఖాన్‌ వ్యక్తిత్వకాంతిని చూపే ‘సన్నాయితో అతను’, ముఖేష్‌ స్వరమాధురిని చెప్పే ‘కభీ కభీ మేరే దిల్‌ మే’, కాశ్మీర దర్శనంలో ఆయన సృజించిన ‘కుంకుమపూల రాణి’, కేరళయాత్ర తదుపరి ‘కైరళి’– ఈ సంపుటిలో కనపడతాయి. ఈ సంపుటిలోని 50 కవితల్లో ‘చెప్పులు మీద’, ‘పెంపకం’, ‘పిలుపు’, ‘ఆలోచనాలోచన’, ‘చదువుతూ చదువుతూ’ అనే ఐదు కవితలు అత్యంత విశిష్టమైనవి. వాటిలో శివశంకర్‌ తనవైన కొన్ని ప్రతిపాదనల్ని లోతైన దృష్టితో చేశాడు. శివశంకర్‌ జ్ఞానకాంతికీ,  అనుభవ పరిణతికీ, మానవీయ చింతనకూ ఒక ప్రాతినిధ్య కవితను చూపాల్సి వస్తే ‘పెంపకం’ కవితను చూపొచ్చు.

‘మనిషన్నాక రోజుకోసారి గొంతెత్తి అరవాల/ కలవాల వాటేసుకోవాల/ కలత పడాల కన్నీరై పోవాల’ అని పలికిన శివశంకర్‌ తాత్వికతకు ‘ఆర్ద్రత’ మూల సూత్రం. అందుకే ‘ఆర్ద్ర అద్భుత మేఘం జీవితం/ కురిసినా వెలసినా/ దాని అందం దానిదే’ అన్నాడాయన. ‘చదవటానికే కదా పుట్టాను’ అని తానే ఓ కవితలో చెప్పుకున్నాడు. భావాన్నీ, అక్షరాన్నీ ఎలా సమ్మళితం చేయాలో తెలిసిన ఒక అరుదైన కళాకారుడాయన. ఇష్టంగా ‘ద్రవరూపిణి’, ‘ధీర స్నేహమాధురి’, ‘శస్త్రధారిణి’, ‘తనూ మోహన మనోమోహన రాగాలాపన’, ‘విజయ వజ్రం’, ‘మహశ్శిఖరాలు’, ‘నీరవ నిస్సహాయ ప్రవాహాలు’ లాంటి పదబంధాన్ని సృజించగలడు. అవసరమైనచోట దయామయంగా, లలితలలితంగా రాయగలిగిన శివశంకర్‌ అగ్రహించిన చోట ‘ధిక్కరించకపోతే దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే అది కవిత్వమెట్లా అవుతుంది’ అని విసురుతోనూ రాయగలడు. అన్వయ సారళ్యత ఆయన ప్రతి కవితలో కనపడుతుంది. ‘రజనీగంధ’ను సత్కరించడమంటే విలువల్ని ప్రేమించే ఒక సహజ మానవుణ్ణి కళాత్మకంగా సత్కరించడం.


 
(వ్యాసకర్త : దర్భశయనం శ్రీనివాసాచార్య 9440419039 )

మరిన్ని వార్తలు