రతన్‌ టాటా (టాటా చైర్మన్‌) రాయని డైరీ

30 Oct, 2016 00:04 IST|Sakshi
రతన్‌ టాటా (టాటా చైర్మన్‌) రాయని డైరీ

మాధవ్‌ శింగరాజు
టాటాలు ఏం చేసినా టైమ్‌లీగా ఉంటుంది. సైరస్‌ మిస్త్రీ దగ్గరే.. ఫస్ట్‌ టైమ్‌ టాటా టైమ్‌ తప్పింది! మిస్త్రీని తప్పించడానికి తొందరపడింది. రెండురోజులు ఆగి ఉండాల్సింది. నరక చతుర్థి రోజు తొలగించి ఉంటే టైమ్‌లీగా ఉండేది. టాటాలోని ఆరు లక్షల మంది ఉద్యోగులకు దీపావళి బోనస్‌ ఇచ్చినట్టూ ఉండేది. ఏటా ఇచ్చేదానికి అడిషనల్‌గా.

మిస్త్రీలను టాటాలను చేద్దామనుకుంటే, టాటాలను మిస్త్రీలను చెయ్యాలని చూశాడు మిస్త్రీ! ద్రోహి. ఫ్రీడమ్‌ ఇస్తే, ఫ్రీహ్యాండ్‌ తీసుకున్నాడు. నయం. టాటా సన్స్‌.. మిస్త్రీ సన్స్‌ కాలేదు!  మిస్త్రీ మోటార్స్, మిస్త్రీ స్టీల్, మిస్త్రీ డొకోమో, మిస్త్రీ సాల్ట్, మిస్త్రీ స్కై, మిస్త్రీ టెక్నాలజీస్‌.. గాడ్‌! ఊహించుకుంటేనే వేరే గ్రహంలో ఉన్నట్లుంది. దేశ ప్రజలకు రోజూ టీవీల్లో, పేపర్లలో, బయట హోర్డింగ్స్‌లో ఆ గ్రహాంతర భాష అర్థం కాక, జికా వంటి వైరస్‌ ఏదో గొంతు పట్టుకుని ఉండేది. పెద్ద విపత్తు తప్పింది.

టాటాలు ఎవర్నీ నమ్మరు. నమ్మి ఎవర్నీ చైర్మన్‌లను చెయ్యరు. టాటాలకు నమ్మకమైన వాళ్లు అవసరం లేదు. నమ్మకంగా ఉండేవాళ్లు కావాలి. ఈ లాజిక్‌ మిస్త్రీకి అర్థం కాలేదు! చెప్పకపోయినా చేసుకుపోయేవాళ్లు టాటాలకు అక్కర్లేదు. చెప్పిన పని చేసుకుపోయేవాళ్లు కావాలి. ఈ లాజిక్కూ మిస్త్రీకి అర్థం కాలేదు. శిక్ష అనుభవించాడు.

మిస్త్రీని నేను చైర్మన్‌ని చేసినంత తేలిగ్గా, జే నన్ను చైర్మన్‌ని చేయలేదు! జే నన్ను యాభై నాలుగేళ్లకు చైర్మన్‌ని చేస్తే, మిస్త్రీని నేను నలభై నాలుగేళ్లకే చైర్మన్‌ని చేశాను.

ఆ రోజు నాకు బాగా గుర్తుంది. అది నేను టాటా గ్రూప్‌కి చైర్మన్‌ అయిన రోజు కాదు. టాటా గ్రూప్‌కి ఏదో ఒక రోజు చైర్మన్‌ని కాబోతున్నానని తెలిసిన రోజు. ఆ మధ్యాహ్నం జే ని కలవడానికి ఆసుపత్రికి వెళ్లాను. గుండెపోటు నుంచి కోలుకుంటున్నారు జే. దగ్గరగా వెళ్లి కూర్చున్నాను. ‘‘ఏంటి కొత్త విషయాలు?’’ అని అడిగారు. ‘‘కొత్తగా ఏమీ జరగలేదు’’ అని చెప్పాను. ఆయన చిరునవ్వు నవ్వారు. ‘‘నా దగ్గర ఓ కొత్త సంగతి ఉంది చెప్పేదా?’’ అని అడిగారు. ఆయన కళ్లలోకి చూశాను. ‘‘చైర్మన్‌ పదవి నుంచి నేను రిటైరవుదామని నిర్ణయించుకున్నాను’’ అన్నారు జే! అదేం నన్ను ఆశ్చర్యపరచలేదు. కొద్దిగా పాజ్‌ ఇచ్చి, ‘‘టాటా సన్స్‌ చైర్మన్‌గా నా స్థానంలో నిన్ను కూర్చోబెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను’’ అన్నారు జే! అదీ నన్ను ఆశ్చర్యపరచలేదు. టాటాలు ఏం చేసినా టైమ్‌లీగా చేస్తారు. టైమ్‌ చూసి చేస్తారు. కానీ.. నేనే, రాంగ్‌ టైమ్‌లో మిస్త్రీని చైర్మన్‌ని చేసినట్లున్నాను!

కాలింగ్‌ బెల్‌ మోగింది. కణేల్‌ కణేల్‌మని మోగింది. మిస్త్రీ అలాగే నొక్కుతాడు. ‘కమ్‌ ఇన్‌’ అన్నాను చికాగ్గా. ఎదురుగా... ఆఫీస్‌ బాయ్‌! సైరస్‌ మిస్త్రీ  మూలమూలలా పట్టేసినట్టున్నాడు. పండగయ్యాక టాటా సిస్టమ్స్‌ అన్నిట్లో యాంటీ–సైరస్‌ను ఇన్‌స్టాల్‌ చేయించాలి.

>
మరిన్ని వార్తలు