వాహనాల పరిశ్రమలో హీరో

30 Oct, 2016 17:11 IST|Sakshi
వాహనాల పరిశ్రమలో హీరో

 విడిభాగాలతో ప్రస్థానం మొదలు...
 ‘హీరో’ గ్రూప్ వ్యవస్థాపకుడు బ్రిజ్‌మోహన్‌లాల్ ముంజాల్ అవిభక్త పంజాబ్‌లోని తోబాటేక్‌సింగ్ జిల్లా కమాలియా గ్రామంలో 1923 జూలై 1న జన్మించారు. దేశ విభజన జరిగినప్పుడు ఆ ప్రాంతం పాకిస్థాన్‌కు దక్కింది. దాంతో ముంజాల్ కుటుంబం భారత్‌కు వలస వచ్చేశారు. పంజాబ్‌లోని లూధియానాలో స్థిరపడ్డారు. సైకిళ్ల తయారీలో లూధియానా అప్పటికే దేశంలోనే ప్రధాన కేంద్రంగా ఉండేది. అక్కడ రామ్‌ఘరియా అనే కులానికి చెందిన వారు లోహపు పనులు చేసేవారు. వారు స్వయంగా కొలిమిలో తయారు చేసిన సైకిల్ విడి భాగాలను విక్రయించమని ముంజాల్‌ను అడిగేవారు. వారు తయారు చేసిన సైకిల్ విడిభాగాల నాణ్యత యంత్రాలతో తయారు చేసిన విడిభాగాలకు తీసిపోని విధంగా ఉండటంతో ముంజాల్ వాటికి మార్కెట్ సృష్టించారు. అనతి కాలంలోనే సైకిల్ విడిభాగాల విక్రయదారుల్లో అగ్రగామిగా ఎదిగారు.
 
 ప్రభుత్వ రుణమే పెట్టుబడి...
 పంజాబ్ ప్రభుత్వం 1956లో లూధియానాలో సైకిళ్ల తయారీ పరిశ్రమ స్థాపనకు టెండర్లు పిలిచింది. ముంజాల్ లెసైన్స్ దక్కించుకుని, రూ. 6 లక్షల ప్రభుత్వ రుణంతో హీరో సైకిల్స్ లిమిటెడ్ సంస్థను స్థాపించారు. అప్పటికే మార్కెట్‌లో ర్యాలీ, అట్లాస్ వంటి సైకిళ్ల కంపెనీలు మార్కెట్‌లో పాతుకుపోయి ఉన్నాయి. అలాంటి పోటీని సైతం తట్టుకుని, అధునాతన పరిజ్ఞానంతో తక్కువ ధరకే నాణ్యమైన సైకిళ్లను అందించడంతో హీరో సైకిళ్లకు జనాదరణ పెరిగింది.
 
 1986 నాటికి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైకిళ్లను తయారు చేసే సంస్థగా హీరో కంపెనీ గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది. ద్విచక్ర వాహనాల తయారీకి ప్రభుత్వం లెసైన్సులు ఇవ్వడంతో ముంజాల్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. 1970వ దశకం చివరినాళ్లలో ‘మెజెస్టిక్ ఆటో’ స్థాపించి, హీరో మెజెస్టిక్ మోపెడ్ల తయారీ ప్రారంభించారు. తర్వాత 1984లో జపాన్‌కు చెందిన హోండా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ‘హీరోహోండా’ మోటార్‌సైకిళ్ల తయారీ ప్రారంభించారు. ముంజాల్ వ్యాపార దక్షత ఫలితంగా ‘హీరోహోండా’ అనతికాలంలోనే దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్ సైకిల్ బ్రాండ్‌గా ఎదిగింది.
 
 ఫోర్‌స్ట్రోక్ ఇంజన్‌తో మొట్టమొదటి 100 సీసీ సామర్థ్యం గల మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఘనత ముంజాల్‌కే దక్కుతుంది. అప్పటి వరకు భారత్ రోడ్లపై నడిచే మోటార్ సైకిళ్లన్నింటికీ టూస్ట్రోక్ ఇంజన్లు ఉండేవి. అవి విపరీతంగా పెట్రోల్ తాగేసేవి. ఆ పరిస్థితుల్లో ముంజాల్ మార్కెట్‌లోకి తెచ్చిన ‘హీరోహోండా సీడీ100’ తిరుగులేని మోటార్ సైకిల్‌గా అమ్మకాల్లో దూసుకుపోయింది.
 
 నిత్యనూతనత్వమే గెలుపు మంత్రం
 ముంజాల్ గెలుపు మంత్రం నిత్యనూతనత్వమే. ప్రతి రెండు మూడేళ్లకు ‘హీరోహోండా’ సరికొత్త మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తూ యువతరాన్ని ఆకట్టుకోవడంలో ముంజాల్ ముందంజలో నిలిచారు. ఆయన వ్యూహచతురత ఫలితంగా 2002 నాటికి ‘హీరోహోండా’ దేశంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థగా ఎదిగింది. హోండాతో ఒప్పందం ప్రకారం ‘హీరోహోండా’ వ్యాపార కార్యకలాపాలు భారత్‌తో పాటు నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు మాత్రమే పరిమితం కావడం ముంజాల్ వ్యాపార విస్తరణ కాంక్షకు ప్రతిబంధకంగా మారింది. దీంతో 2011తో హోండాతో భాగస్వామ్యానికి స్వస్తిపలికి హీరో మోటార్ కార్పొరేషన్ పేరిట కొత్త కంపెనీని స్థాపించి, ‘హీరో’ మోటార్ సైకిళ్లను ప్రపంచ మార్కెట్‌లో పరుగులు తీయించారు. వాహనాల తయారీకే పరిమితం కాకుండా ఐటీ రంగంలోకీ అడుగుపెట్టారు. హీరో గ్రూప్ నికర విలువ ప్రస్తుతం రూ.25 వేల కోట్ల పైమాటే.
 
 సేవాతత్పరతలోనూ ‘హీరో’
  సేవాతత్పరతలోనూ ముంజాల్ ‘హీరో’గానే నిలిచారు. పంజాబ్‌లో పలు గ్రామాలను దత్తత తీసుకుని, వాటి అభివృద్ధి కోసం 1992లో రమణ్‌కాంత్ ముంజాల్ ఫౌండేషన్‌ను నెలకొల్పారు. లూధియానాలో స్టాక్ ఎక్స్చేంజీ, ఫ్లయింగ్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేశారు. భారత ప్రభుత్వం ఆయన కృషికి గుర్తింపుగా 2005లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. దత్తత గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించడంలో ముంజాల్ ఫౌండేషన్ నేటికీ తన కృషిని కొనసాగిస్తోంది. అయితే, మధ్యతరగతి భారతీయులకు అందుబాటు ధరలో ఉత్తమశ్రేణి కార్లను అందుబాటులోకి తేవాలన్న కల నెరవేరకుండానే ముంజాల్ 2015 నవంబర్ 1న కన్నుమూశారు.
 - దండేల కృష్ణ
 

మరిన్ని వార్తలు