1008 లీటర్ల పంచామృతాలతో అభిషేకం

17 Dec, 2017 18:42 IST|Sakshi

సేలం: నామక్కల్‌ ఆంజనేయ స్వామి ఆలయంలో జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భారీ వడల మాలతో విశేషంగా అలంకరించారు. నామక్కల్‌ కోటలోని అతి పురాతనమైన ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తులో నిలుచున్న భంగిమలో ఏక శిలా విగ్రహంగా ఉన్న ఆంజనేయ స్వామికి ఏటా మార్గళి నెల తొలి నక్షత్రం రోజున జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. వేకువజామున 3 గంటలకు ప్రత్యేక అభిషేకాలు, 5 గంటలకు 1,00,008 వడల మాలను అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు. 11 గంటలకు పసుపు, కుంకుమ, నూనె, షీకాయ్, 1008 లీటర్ల పాలు, పెరుగు, వెన్న, తేనె వంటి వస్తువులు(పంచామృతాలు)తో విశేష అభిషేకం చేశారు. తర్వాత ప్రత్యేక అలంకరణ, మహా దీపారాధన నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు ముత్తంగి అలంకరణ చేశారు. లక్ష మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 

శ్రీవారి రీతిలో అలంకరణ
ఏడు కొండలవాడికి బ్రహ్మోత్సవాల సమయంలో నామక్కల్‌కు చెందిన శ్రీ తిరుమల తిరుపతి శ్రీమాన్‌ నారాయణ నిత్య పుష్ప కైంకర్య సభ ఆధ్వర్యంలో టన్నుల కొలది పుష్పాలను కైంకర్యంగా సమర్పిస్తారు. అదేమాదిరి నామక్కల్‌ ఆంజనేయుడికి తొలిసారిగా మూడు టన్నుల పుష్పాలు, పండ్లు వంటి వాటిని ఈ సభ కైంకర్యంగా అందించింది. వీటితో శ్రీవారికి మాదిరి ఆంజనేయ స్వామికీ అలంకరించారు. 
 

మరిన్ని వార్తలు