2 కిలోమీటర్లమేర మృతదేహాలతో గోడ.. మిస్టీరియస్‌..

9 Nov, 2021 16:50 IST|Sakshi
ప్యారీస్‌ కాటకోంబ్స్‌

World's Scariest Place Catacombs of Paris: ఫ్రాన్స్‌ రాజధాని ప్యారీస్‌ టూరిస్ట్‌ స్పాట్‌గా మనందరికీ సుపరిచితమే. ప్యారీస్‌లో కనులకు ఇంపైన ప్రదేశాలేకాదు.. వణుకు పుట్టించే మిస్టీరియస్‌ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అలాంటివి ఏమీ ఉండవని పెదవి విరుస్తున్నారా? ఐతే ఇది చదవండి.

‘ప్యారీస్‌ కాటకోంబ్స్‌’ గురించే మీకు చెప్పబోతుంది. అక్కడ దాదాపు 60 లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఉంది. దీనికి సంబంధించిన చరిత్ర 18వ శతాబ్ధం చివరి భాగం నుంచి ప్రారంభమైందని చెప్పవచ్చు. చనిపోయినవారిని పాతిపెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించారు. 1785లో మరే ఇతర శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేయలేనంత మరణాలు సంభవించాయి. వర్షం కురవడంతో శ్మశానవాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకువచ్చాయట. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడవేశారు. అనతికాలంలోనే దాదాపు 60 లక్షల మృతదేహాలు ఇక్కడ నిక్షిప్తమయ్యాయి. 

చదవండి: గుడ్‌న్యూస్‌.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!

ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి మ్యూజియంగా మార్చారు. ఈ గోడను భూమిలోపల 20 మీటర్ల లోతులో నుంచి కట్టారు. అందుకే ఈ స్థలాన్ని ‘సమాధుల నేలమాళిగ (బేస్‌మెంట్‌ ఆఫ్‌ టోంబ్స్‌)’ అని పిలుస్తారు. నేడు ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీనిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు కూడా.

చనిపోయినవారి ఎముకలు, పుర్రెలతో నిర్మించిన 2.2 కి.మీ పొడవున్న ఈ మొత్తం గోడ దాదాపు 800 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఐతే ఈ మొత్తం గోడను నేటివరకూ పర్యాటకుల సందర్శనకు ఇప్పటివరకూ ఉంచలేదు. ఈ సొరంగంలోని కొన్ని భాగాలు మాత్రమే చూసేందుకు అనుమతి ఉంది. ఏదిఏమైనప్పటికీ సమాధులను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఏకంగా అస్థిపంజరాలతో కట్టిన ఈ గోడను చూడటానికి అన్ని వేల మంది ఎలా వెళ్తున్నారో!!

చదవండి: టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!

మరిన్ని వార్తలు