ఒంటి చేయి మనిషి

20 Oct, 2019 10:49 IST|Sakshi

కథా ప్రపంచం 

ఆంగ్ల మూలం : సర్‌ ఆర్థర్‌ కానన్‌ డాయల్‌

జీవన సంగ్రామంలో పోరాడుతూ, పరమ దరిద్రం అనుభవిస్తున్న నేను అమాంతంగా ధనికుడినైపోయాను. ప్రఖ్యాత శస్త్రవైద్యుడు సర్‌ డొమినిక్‌ హోల్డెన్‌ తన ఆస్తికి నన్ను వారసుడిగా చేయడంతో ఒక సాధారణ వైద్యునిగా ప్రాక్టీస్‌ చేసుకుంటున్న నేను పెద్ద ఎస్టేటుకే యజమానినైపోయాను. 

అదెలా జరిగిందంటే....
డాక్టర్‌ డొమినిక్‌ హోల్డెన్‌ మొట్టమొదట ఆర్మీలో పనిచేశాడు. తరువాత బాంబేలో పనిచేస్తూ యావత్భారద్దేశం తిరిగాడు. ఓరియెంటల్‌ హాస్పిటల్‌ స్థాపించాడు. అందువలన ఆయన పేరు అందరికీ తెలిసింది. వయసు మీద పడడంతో ఆయన స్వదేశమైన ఇంగ్లాండులోని తన స్వంత వూరైన విల్‌షైర్‌కు తప్పనిసరిగా రావాల్సివచ్చింది. విల్‌షైర్‌లో ఆయన అత్యంత విలువైన ఫార్మ్‌హౌస్‌ కొన్నాడు. తనకిష్టమైన, బాగా పట్టువున్న పాథాలజీని అధ్యయనం చేస్తూ తన శేష జీవితం గడిపాడు. ధనికుడూ, పైగా సంతానం లేనివాడైన డాక్టర్‌ డొమినిక్‌ తన సొంతవూరిలో స్థిరపడడం మా బంధువర్గం లోని వారందరికీ సంతోషదాయకమైన విషయం. డాక్టర్‌ డొమినిక్‌ నాకు అంకుల్‌ అవుతాడు. అంకుల్‌ ఆహ్వానమందుకొని విల్‌షైర్‌ ప్రాంతాన్ని చేరుకొన్నాను.

అతను  నివాసముంటున్న భవనం పేరు రోడెన్‌హర్స్‌ట్‌. నేను అక్కడికి చేరుకునే సమయానికి కట్టెల పొయ్యి మంటముందు కూర్చొని చలికాచుకొంటున్నాడు. నన్ను చూడగానే తటాలున లేచి ఇంట్లోకి ఆహ్వానించాడు. అంకుల్‌ ఆజానుబాహుడు. అతను ధరించిన కోటు శల్యస్థమై ఉంది.  ఆయన కళ్ళల్లో ఒకలాంటి మరణ భయం గూడుకట్టుకొని వుంది. ‘ఏ క్షణమైనా చనిపోతానేమో?’ అన్న భావన అతని కళ్ళల్లో కదలాడుతూ ఉందనే విషయం నేను పసికట్టాను.

డాక్టర్‌ దంపతుల నడుమ డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చున్నాను.  డాక్టర్‌ గారి భార్య సన్నగా, పీలగా వుంది. భర్తంటే ఆమెకు ఎనలేని ప్రేమ. అంకుల్‌ కూడా అంతే. భార్య మీద అనురాగవర్షమే కురిపిస్తున్నాడు. అయితే, ఎందుకో వారి కళ్ళల్లో  భయంకరమైన భయాందోళనలు ప్రతిఫలించడం నాలోని మానసిక శాస్త్రవేత్త దృష్టిని దాటిపోలేదు. నేనూ, అంకుల్‌ తేనీరు సేవిస్తున్న సమయంలో మా మధ్య సంభాషణ మానవాతీత శక్తుల గురించిన చర్చకు దారితీసింది.  ‘అతీంద్రియ శక్తుల పరిశోధన సొసైటీ’లో నేను సభ్యునిగా ఉన్నప్పుడు, ముగ్గురితో ఒక బృందాన్ని ఏర్పరచాను. వారు ఒక దయ్యాల కొంపలో రాత్రంతా గడిపారు. వాళ్ళు చేసిన సాహస కృత్యాలను వర్ణిస్తుంటే, డాక్టరు దంపతులు ఆసక్తిగా, శ్రద్ధగా విన్నారు. తరువాత  వారు ఒకరికొకరు చూసుకున్నారు. వారి పరస్పర భావాల మార్పిడిలోని ఆంతర్యం మాత్రం అర్థం కాలేదు. లేడీ హోల్డన్‌ వెంటనే లేచి బయటికెళ్ళిపోయింది. 

నేను,  అంకుల్‌ నిశ్శబ్దంగా ఉండిపోయాము కొద్దిసేపు. చుట్ట అంటించుకోవడానికని డాక్టర్‌  చెయ్యెత్తినప్పుడు, ఎముకలు పైన కనిపిస్తున్న అతని చేతినరాలు ఫిడేలు తీగల్లా కంపించాయి. ‘నాకు కావాల్సిన సరైన వ్యక్తివి నువ్వే డాక్టర్‌ హర్డకర్‌!’ అని సాభిప్రాయంగా నా వైపు చూశాడు.
‘మీరు చాలా నెమ్మదస్తుల్లాగా ఉన్నారు. అతీంద్రియజ్ఞానం పట్ల మీకు మంచి అవగాహన ఉంది. దయ్యాలంటే మీకు భయం లేదనుకుంటాను.’
‘లేదనే అనుకుంటున్నాను సార్‌!’ 
‘అందులో మీకు ఆసక్తి ఉందా?’
‘చాలా బాగా.’
‘మీరు ప్రేతాత్మల గురించి పరిశోధన చేయగలరా?’
‘తప్పకుండా, సార్‌!’             
 డాక్టర్‌ డొమినిక్‌ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
‘ఇంతకుముందు నేనూ మీలాగే మాట్లాడాను. నా మనోధైర్యం గురించి భారతదేశ ప్రజలందరికీ తెలుసు. సిపాయిల తిరుగుబాటు కూడా నా ఆత్మస్థైర్యాన్ని సడలించలేకపోయింది. అసమాన గుండెనిబ్బరం కలిగిన నేను ఇప్పుడు భయంతో వొణికిపోతున్నాను. ఈ విషయంలో నీకు అతివిశ్వాసం తగదు. నేనింతకుముందే ఈ విషయంలో చాలాసార్లు పరీక్షించి విఫలమైనాను. నీవు తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదు. బాగా ఆలోచించుకో.’     

అతడు స్థిమితపడేవరకూ నేనేమీ మాట్లాడలేదు. అతనిచ్చిన ఉపోద్ఘాతం నాలో ఆసక్తి రేపింది. పట్టుదల పెంచింది. తిరిగి డొమినిక్‌ సంభాషణ కొనసాగించాడు. ‘కొన్ని సంవత్సరాలుగా నా జీవితం, నా భార్య జీవితం నరకప్రాయంగా తయారయ్యాయి. మా ఇద్దరికీ కంటిమీద కునుకు లేదంటే నమ్ము. మేమందుకు అలవాటుపడ్డామనుకో.  పైగా ఆ సమస్య రోజులు గడిచేకొద్దీ నా నరాలను నులిమేస్తూ ఉంది. నిరంతర నరాల ఘర్షణ మూలంగా అవి శిథిలమౌతూ ఉన్నాయి. మమ్మల్ని నిరంతరం మానసిక క్షోభకు గురిచేస్తున్న సంఘటనను నీవు ఎదుర్కోనే సాహసానికి పూనుకుంటావంటే నాకంతకంటే  కావాల్సిందేముంది?’  

‘మీకోసం చేయాలనుకుంటున్నాను. అసలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ సంఘటన గురించి చెప్పండి?’
‘నీవు ఎటువంటి జటిల సమస్యనెదుర్కోబోతున్నావో ముందుగానే తెలుసుకుంటే, నిన్ను నీవు రక్షించుకోవచ్చు.’
‘మరిప్పుడు నన్నేం చేయమంటారు?’ అని అడిగినపుడు, తన వెంటరమ్మని సైగచేస్తూ, ఒక గదిలోనికి పిలుచుకెళ్ళాడు. అదొక లేబొరేటరీ. 
‘చూడు డాక్టర్‌ హర్డకర్‌! ఈ గాజు జాడీలలో పెట్టినవన్నీ, నేను సేకరించిన వాటిలోకెల్లా అరుదైనవి. నేను బాంబేలో ఉన్నప్పుడు  సంభవించిన దుర్ఘటనలో నా ఇల్లు కాలిపోయింది. ఆ ఘటనలో నేను సేకరించిన చాలావస్తువులు  కాలిపోయాయి. ఇవి మిగిలాయి’ అన్నాడు.
 నేను వాటివైపు చూశాను. నిజంగా వ్యాధి నిర్ధారణ విజ్ఞానశాస్త్రం దృష్ట్యా అవి ఎంతో అపురూపమైనవి. విలువైనవి. ఉబ్బిన అవయవాలు, రసగ్రంధులు( దేహానికుపయోగపడే రసాలను ఉత్పత్తి చేసే గ్రంధులు) విరిగిన ఎముకలు, అసహ్యం పుట్టించే పరాన్నజీవులు–జాడీలలో బందీలై ఉన్న దృశ్యాన్ని చూస్తుంటే, వింత ప్రదర్శనశాల కళ్ళెదురుగా నిలిచినట్లుంది.    
‘ఇదిగో చూడు! ఇక్కడొక చిన్న గది ఉంది. ఈ రాత్రికి నువ్వు ఈ గదిలోనే గడపాల్సి ఉంటుంది. అంగీకారమేనా?’ అని అడిగాడు.
‘నాకు అంగీకారమే.’ అన్నాన్నేను.
‘ఈ పక్కనే నా గది ఉంది. నీకు నా తోడు అవసరమనిపిస్తే, అలా పిలిస్తే ఇలా నీ ఎదుట ఉంటాను.’ 
‘ఆ అవసరం నాకు ఉండదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను.’
‘నాకు సామాన్యంగా నిద్రపట్టదు. పిలవడానికి సంకోచించకు’  చెప్పాడు డాక్టర్‌ డొమినిక్‌.

మానవుని మెదడు ఒక్కసారి ఒక్క బలమైన భావోద్వేగాన్ని స్వీకరించగలదు. కుతూహలం, సైన్సు పట్ల ఉత్సాహం ఉంటే, భయానికి తావే ఉండదు. ఈ విషయం నాకు అంకుల్‌ ముందుగానే చెప్పాడు. అయితే ఆయన నరాలు బాగా దెబ్బతినడంవల్ల మానసిక దుర్బలతకు లోనైఉండొచ్చు. కానీ నా మెదడు భేషుగ్గా పనిచేస్తూ ఉంది. నరాలు బలంగా ఉన్నాయి. పైగా గుండె ధైర్యం పుష్కలంగా ఉంది నాకు. నేను ఆ గదిలోకెళ్ళి నా వెనక తలుపు బిగించుకొన్నాను. పైదుస్తులు విప్పి దివాన్‌ మీద మేను వాల్చాను. ఆ గదంతా  రసాయనాల తాలూకు ఘాటువాసనలతో నిండి ఉంది. ముఖ్యంగా మెథిలేటెడ్‌ స్పిరిట్‌ వాసన అధిక మోతాదులో వ్యాపించి ఉంది.      
   

భయంకర నిశ్శబ్దమావరించి ఉంది ఆ పురాతన గృహంలో. అసలే బాగా అలసిపోయి ఉన్నానేమో నేను గాఢనిద్రలోకి జారుకున్నాను. ఉన్నట్టుండి ఏదో శబ్దమైతే ఉలిక్కిపడిలేచి నా మోచేతులమీద మంచంపై కూర్చున్నాను. ఎదురు గోడమీదున్న వెన్నెలపట్టీ కిందకు జరిగి, మంచం అంచులను దాటి, ఏటవాలుగా పడుతోంది. అప్పటికే చాలా సమయం గడిచిపోయినట్టు అర్థమైంది.
   

కొద్దిసేపటి తరువాత గది గోడవారగా ఏదో ఆకారం మెల్లగా నక్కినక్కి నడుస్తున్నట్లనిపించింది. మెత్తని చెప్పుల చప్పుడు నా చెవులను తాకింది. ఒక మానవ ఆకారం తలుపు వైపు నుండి వస్తూ ఉంది. ఆ ఆకారం వెన్నెల వెలుగులోకి రాగానే చూశాను. అది ఒక మగవాడిది. అతడు పొట్టిగా వున్నాడు. అతడు ధరించిన వదులైన షర్ట్‌–నలుపు గోధుమరంగుల కలగలుపుగా ఉండి భుజం నుండి మోకాళ్ళదాకా కిందకు వేళ్ళాడుతూ ఉంది. వెన్నెలవెలుగు అతని ముఖం మీద స్పష్టంగా పడుతూ ఉంది. ఆ ముఖం చాకొలేట్‌ కలర్‌ గోధుమరంగులో ఉంది. అతని జుట్టు, ఆడవారికొప్పులా తలవెనక ముడివేసిఉంది. అతను మెల్లగా పిల్లిలా నడిచాడు.

అతని చూపులు ర్యాక్‌ల మీదున్న గాజుజాడీల మీదున్నాయి. ఒక్కొక్క జాడీని పరిశీలించసాగాడు. ఆ జాడీల లోపల మానవ అవయవాలు భద్రపరచబడున్నాయి. అలా ర్యాక్‌ చివరకు, అంటే నా మంచానికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. నన్ను చూసి చేతులు విసురుగా కదిలించి వెంటనే మాయమయ్యాడు. అప్పుడతని ముఖంలో పరచుకొన్న దట్టమైన నిరాశారేఖల్ని స్పష్టంగా చూశాను. అప్పుడతని ఆకృతిలో ఒక ప్రత్యేక అంశాన్ని గమనించాను. అతనికి ఒక్క చెయ్యి మాత్రమే ఉంది. భుజాలనుంచి చొక్కా చేతులు కిందకు వేల్లాడుతున్నాయి. ఎడమచేతి వంక చూశాను. అది సజావుగానే ఉంది.

కానీ, కుడిభుజం  నుంచి వదులుగా వేల్లాడుతున్న చొక్కా చేయి కిందిభాగం వృత్తాకారంలో గోచరమైంది. మిగతా అవయవాలన్నీ సహజంగా ఉన్నాయి. అతడు దేనికోసమో వెతకడానికొచ్చాడు. నేను ఏదో కీడు శంకించాను. స్ప్రింగులా మంచం మీదనుండి లేచి క్యాండిల్‌ వెలిగించాను. ఆ గదినంతా క్షుణ్ణంగా పరిశీలించాను. అతని రూపాకృతి సహజత్వానికి అతీతమని తోచింది. ఆ రాత్రంతా మేలుకొనే ఉన్నాను. నాకు ఇబ్బందికరమైనదేదీ జరగలేదు. 
 

నాకంటే ముందుగా నిద్రలేచిన అంకుల్, లాన్‌లో అటూ ఇటూ పచార్లు చేస్తూ కనబడ్డాడు. తలుపు తెరుచుకొని నేను బయటకు రాగానే, నన్ను చూసి అంకుల్‌ నా వైపు ఆత్రంగా పరుగెత్తుకొచ్చాడు. 
‘నువ్వతన్ని చూశావా?’ అతని ముఖంలో కుతూహలం ప్రస్ఫుటమౌతూ ఉంది.   
 ‘ఎవర్ని?... ఆ ఒంటిచెయ్యి ఇండియన్‌ నా?’...
‘ఔను.’
‘చూశాను.’ అని జరిగింది చెప్పాను. అంకుల్‌ నన్ను స్టడీ రూం లోకి పిలుచుకెళ్ళాడు.                    
‘గత నాలుగుసంవత్సరాల నుంచి వీడి కారణంగా బాంబేలో గానీ, ఓడలో గానీ, ఇంగ్లాండులో గానీ, నేను నిద్రపోయిన రాత్రిలేదు. ప్రతిరాత్రి నా మంచం పక్కకు రావడం, నన్ను తట్టి నిద్రలేపడం నా గదిలోనుండి, మెల్లిగా నడచుకుంటూ వెళ్ళి గాజు జాడీల వంక చూసుకుంటూ వెళ్ళడం మాయమవడం– ఇదే వాడి దినచర్య. ఇలా వేయికంటే ఎక్కువసార్లు వాడు వచ్చుంటాడు.’         
‘అతనికేం కావాలట?’
‘అతని చేయి అతనికి కావాలట.’
‘అతని చెయ్యా?’ ఆశ్చర్యపోయాన్నేను.
‘ఔను.  పదేండ్ల క్రితం ఒక పెద్దమనిషి నన్ను పిలిపించాడు. అతని స్నేహితునికి, చేతిమీద దుర్మాంసం పెరగడంవల్ల తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాడట. పిలుపు నందుకొని వెళ్ళాను. బాధితుడు కొండజాతివాడు. అతని మిత్రుడొకడు దుబాసీగా వ్యవహరించాడు. అతని వల్ల బాధితుని సమస్యనర్థం చేసుకోగలిగాను. అతని చేతి మణికట్టు కీలు మీద కురుపు లేచింది. దాన్ని మందులతో నయం చేయడానికి సాధ్యం కాదని, అతని ప్రాణాలు నిలబడాలంటే ఆపరేషన్‌  చేసి చేతిని పూర్తిగా  తొలగించాలని తేల్చిచెప్పాను.

ఆపరేషన్‌ చేయించుకోమని ఒప్పించడానికి నా తలప్రాణం తోక్కొచ్చినట్లైంది. ఆపరేషన్‌ ముగిసిన తరువాత, ‘మీకు ఫీజెంతివ్వాలి?’ అని అడిగాడు. రోగిని చూస్తే బిచ్చగాడిలా ఉన్నాడు. అతనేం ఫీజివ్వగలడులే అనుకొని, ‘ఫీజుగా నీ చేతిని నాకిచ్చేశేయ్‌.’ అని నవ్వుతూ చెప్పాను. నేనంతకు ముందు అటువంటి మానవ అవయవాలు ఎన్నిటినో సేకరించి, నా లాబొరేటరీలో భద్రపరచాను. వాటితో పాటు ఆ చేతిని కూడా లాబొరేటరీలో  ఉంచాలని నా ఉద్దేశం.

కానీ అతడందుకు ఒకపట్టాన ఒప్పుకోలేదు. వాళ్ళ మతసాంప్రదాయాల ప్రకారం  బతికున్నప్పుడు తమ శరీర భాగాల్ని కోల్పోయిన పక్షంలో చనిపోయిన తరువాత తప్పని సరిగా తిరిగి కలపాల్సి ఉంటుందని వివరించాడు. అలాచేస్తే, చచ్చిన వారి ఆత్మ శాంతిస్తుందట! అటువంటి మూఢనమ్మకం కొత్తదేమీ కాదు. ఈజిప్షియన్ల మమ్మీస్‌ గురించి తెలుసు కదా. దాన్ని పోలి వుంటుంది ఇది కూడా. అప్పటికే దేహం నుండి వేరుచేయబడ్డ అతని చేతిని అతడే విధంగా భద్రపరచగలడో చెప్పమన్నాను.

అందుకతను ఉప్పులో ఊరవేసి తనతో పాటు తీసుకెళ్తానన్నాడు. నేనందుకు–అంతకంటే మంచిపద్ధతుల ద్వారా, అతని చేతిని పాడైపోకుండా భద్రపరచగలనని అతనికి నచ్చచెప్పాను. హామీ ఇచ్చాను. చివరికతను  ఒప్పుకున్నాడు. అతను మళ్ళీ నాతో ఇలా చెప్పాడు.
‘ఒక విషయం జ్ఞాపకముంచుకోండి డాక్టర్‌! నేను చనిపోయాక నా చేయి నాకు కావాలి.’ అని చెప్పాడు. నేనా మాటలకు నవ్వాను. అంతటితో ఆ విషయం ముగిసింది. 
 ‘నేన్నీకు గతరాత్రే చెప్పాను బాంబేలో ఉన్నప్పుడు నా ఇల్లు అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. నేను సేకరించిన మానవ అవయవాలు దాదాపు అగ్నిలో పడి కాలి బూడిదయ్యాయి. కాలిపోయిన వాటిలో ఆ కొండప్రాంతం వాడి చేయి కూడా ఉంది. ఆ విషయాన్నంతగా పట్టించుకోలేదప్పుడు. ఇది జరిగి ఆరేళ్ళయింది.’
‘నాలుగేళ్ళ క్రితం అంటే అగ్నిప్రమాదం జరిగిన రెండేండ్ల తరువాత ఒక రాత్రి ఎవరో నా చేయి తట్టి పిలిచినట్లైతే నాకు మెలకువ వచ్చింది. నా పెంపుడు కుక్క నన్ను నిద్ర లేపటానికి ప్రయత్నిస్తుందిలే   అనుకున్నాను. కాని పెంపుడు కుక్క కాదు. నా పాత ఇండియన్‌ పేషెంటు నా ఎదుట నిలుచున్నాడు. అతని సాంప్రదాయ దుస్తులైన పొడవాటి ముదురు రంగు గౌను ధరించి ఉన్నాడు. అతని మొండి చెయ్యి చూపిస్తూ నా వైపు నిందాపూర్వకంగా చూశాడు. తరువాత నా దగ్గర మిగిలివున్న గాజు జాడీల దగ్గరకెళ్ళి ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా పరీక్షించసాగాడు. ఆ వెంటనే అతని ముఖంలో ఆగ్రహజ్వాలలు రేగాయి. తక్షణం అతను అక్కడ్నుంచి అదృశ్యమైపోయాడు. ఇటీవలనే అతను మరణించివుంటాడని తన చేయి సురక్షితంగా భద్రపరచి ఉందో లేదోనని నిర్ధారించుకోవడానికొచ్చాడని నా కర్థమైంది.’       
‘గత నాలుగేళ్ళుగా ప్రతిరాత్రి అదే సమయంలో అదే దృశ్యం పునరావృతమవుతూనే ఉంది. తలచుకోవడానికి అది సాధారణ దృశ్యంగా తోచినా నా మనోస్థైర్యం కొంచెం కొంచెంగా తరిగిపోయింది. ప్రతిరోజూ ఠంచనుగా అతను రాత్రిపూట వచ్చి  కనబడటం వల్ల విపరీతమైన భయంతో కంటికి కునుకనేదే లేకుండా మానసికంగా కృంగి కునారిల్లుతున్నాను. క్రమం తప్పకుండా అతని రాకకోసం ఎదురు చూసే దౌర్భాగ్యస్థితి నాకు దాపురించడాన్ని తలచుకొంటూ భయంతో గడపడం నా దిన చర్యగా మారిపోయింది. అందుకుతోడు నన్నూ, నా భార్యనూ వృద్ధాప్యమనే విషనాగు నిర్దయగా కాటేస్తూ ఉంది. ఇద్దరమూ అంతులేని వేదననుభవిస్తూ ఉన్నాము. అదిగో! మా ఆవిడ చేసే ప్లేట్ల ధ్వనులు.  బ్రేక్‌ ఫాస్ట్‌కు టైమయింది. నిన్న రాత్రి నువ్వెలా గడిపావో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. నీవు చేసిన సాహస కృత్యానికి మేమిద్దరూ ఎంతైనా రుణపడి ఉంటాము. మా హృదయభారం కొంతవరకూ దించుకోగలిగాం నీ వల్ల.’
 

బ్రేక్‌ ఫాస్ట్‌ అయ్యాక తరువాతి ట్రైన్‌లో నన్ను లండన్‌కెళ్ళిపొమ్మని డాక్టర్‌ డొమినిక్‌ చెబుతున్న మాటలకు నాకాశ్చర్య మేసింది. నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ డాక్టర్‌ డొమినిక్‌ అమిత బాధాతప్త హృదయుడై, అసహనంతో కూడిన ఒణికే స్వరంతో బిగ్గరగా చెప్పాడు. ‘డాక్టర్‌ హర్డకర్‌! దయచేసి ఇక్కడినుండి వెళ్ళిపో! నా దురదృష్టం కొద్దీ ప్రాప్తించిన నా కష్టాన్ని నీకు అంటగట్టాలని చూస్తున్నాననే అపరాధభావన నా గుండెను కాల్చేస్తూ ఉంది. అతిథిగా వచ్చిన నీ పట్ల అమానుషంగా ప్రవర్తించాను. నా  బాధేదో నేనే అనుభవిస్తాను. వెంటనే వెళ్ళిపో నాయనా ఇక్కడ్నుంచి.’ 

‘ఈ విషయం గురించే నేను లండన్‌ తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. నిన్నటి అనుభవం నా మనసుకు ఇబ్బంది కలిగించిందని మీరు అపార్థం చేసుకుంటున్నారు. మీరు అనుమతిస్తే నేనీరోజే లండన్‌ వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చి ఇంకొక రాత్రి లాబొరేటరీలో గడపాలనుకుంటున్నాను. ఆ వొంటిచేయి మనిషిని మరొక్కసారి చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాను.’
 నేనేం చేయబోతున్నానో డాక్టర్‌ అంకుల్‌కు చెప్పలేదు. ఎందుకంటే అంకుల్‌ మనసులో లేనిపోని ఆశలు రేగించడం నాకిష్టం లేదు. 

 లండన్‌ చేరి నా కన్సల్టింగ్‌ గదిలో కూర్చొని కొత్తగా విడుదలైన క్షుద్రవిద్యల  గురించి రాయబడిన పుస్తకంలోని ఒక పేరాను గుర్తుచేసుకున్నాను.     
‘భూమిని అంటిపెట్టుకొన్న ఆత్మలకు, భౌతికశరీరం నుంచి ప్రాణం ఎగిరిపోతున్న సమయంలో అంటే మరణించే ముందు ఆ వ్యక్తికి  ఏదో ఒక బలమైన ఆలోచన గానీ,  తీవ్రమైన కోరికగానీ మనసులో ఉంటే గనుక అట్టి జీవాత్మ ఇహలోకం నుంచి నిష్క్రమించకుండా భౌతికరూపంలో పరిభ్రమిస్తూనే ఉంటుందట! సదరు వ్యక్తుల  ప్రస్తుత జన్మకూ, రాబోయే జన్మకూ మధ్యస్థంగా ఉంటూ మనసులోని కోరిక తీరిన వెంటనే ఈ జన్మనుంచి మరో జన్మకు మారే శక్తి కలిగి ఉంటారట! తాబేలు నేలమీది నుంచి నీటిలోకి ప్రవేశించినట్టు. ఆత్మ–మనిషి జీవితానికి ఎందుకంత బలంగా అంటిపెట్టుకుని ఉండటానికి కారణాలేమంటే... హింసాత్మకమైన భావోద్వేగం, ఆ ప్రాణి పార్థివదేహంలో నుంచి ఒక భాగం కోల్పోయి ఉండడం. అత్యాశ, ప్రతీకారవాంఛ, ఉద్వేగం, ప్రేమ, జాలి ఇవన్నీ ప్రభావితమౌతాయి. తీరని కోరికలతో చనిపోయిన జీవికి ఆ కోరిక తీరితే చాలు. ఆత్మబంధం భౌతికంగా పెనవేసుకున్న బంధాన్ని తెంచుకుంటుంది.’ 
   

అలాంటివి ఎన్నో కేసులు రికార్డుల్లో ఉన్నాయి. ఆ జీవి మనసులో బలంగా నాటుకుపోయిన కోరిక తీరిన వెంటనే ఆత్మ–ఇహలోకం నుంచి నిష్క్రమిస్తుంది. కొన్ని  కేసుల్లో సహేతుకమైన రాజీ కుదిరితే చాలు. ఆత్మలు తృప్తిపడతాయి.’ ఇలా వివరించబడిందా పుస్తకంలో. 
‘సహేతుకమైన రాజీ’ అనే పదం మీద నా అలోచనలు నిలిచిపోయాయి. నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో అని నిర్ధారణ చేసుకునేందుకు అసలు పుస్తకాన్ని తీసి చదివాను.  ‘సహేతుక రాజీ... సహేతుక  రాజీ’ 
ఆ పదమే నా మనసులో మార్మోగుతూ ఉంది.  
నేను వేగంగా ‘షాడ్‌ వెల్‌ సీమెన్స్‌’  ఆస్పత్రికి పరుగెత్తాను. అక్కడ నా పాత స్నేహితుడు జాక్‌ హెవెట్‌ హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్నాడు. నేను పూర్తి విషయం చెప్పకుండా నాకేం కావాలో  అడిగాను. అతను అమితమైన ఆశ్చర్యానికి లోనయ్యాడు. ‘గోధుమరంగు మనిషి చేయి కావాల్నా? ఎందుకు?’ అనడిగాడు. 
‘దాన్ని గురించి ఎక్కువ ఆలోచించకు. ఎప్పుడో ఒకసారి చెబుతాను. నీ ఆస్పత్రి వార్డుల నిండా ఇండియన్లే ఉన్నారు కదా?’
‘అవును. కానీ గోధమరంగు చేయంటే?’ కొంచెం ఆలోచించి బెల్‌ కొట్టాడు. వెంటనే ఒకతనొచ్చాడు. 
  ‘నిన్న తూర్పు ఇండియా ఓడకళాసీకి చేతులు ఆపరేషన్‌ చేసి తొలగించాం కదా. అవెక్కడున్నాయి?’ అని అడిగాడు. 
 ‘పోస్ట్‌మార్టం గదిలో సార్‌.’
‘వాటిలో ఒక దాన్ని ఆంటిసెప్టిక్స్‌లో కట్టి, డాక్టర్‌ హర్డకర్‌గారికివ్వు’     

డాక్టర్‌ అంకుల్‌కేమీ చెప్పకుండా లాబొరేటరీలోకెళ్ళి నా మంచానికి దూరంగానున్న వరుసలోని చివరి సీసాలో కళాసీ చేతినుంచాను. ఆ రాత్రి లాంతరు నీడ పక్కన పడుకున్నాను. టైం సరిగ్గా, ఒంటిచేయి మనిషొచ్చాడు. మెల్లగా నడచుకుంటూ,యథాప్రకారంగా ఒక్కొక్క సీసాను చూస్తూ వెళుతున్నాడు. ఈ సారతన్ని స్పష్టంగా చూశాను. 
చచ్చిన కళాసీ చేయిని ఉంచిన సీసా దగ్గర నిలిచిపోయాడు. దాని లోపలున్న గోధుమరంగు చేయివంక తేరిపారి చూశాడు. అప్పుడతని ఒళ్ళు ఉద్విగ్నత వల్ల ఒణుకుతూ వుంది. సీసాను కిందకు దించి పరిశీలించాడు. వెంటనే అతనిలో కోపం కట్టలుతెంచుకొంది. అతని ముఖంలో నిరాశ ఆవరించింది. చేతిలోని సీసాను నేలకేసి కొట్టాడు. ఆ సీసా నేలను ఢీకొట్టినప్పుడు వెలువడిన శబ్దం ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది. ఒంటిచేయి మనిషి కోసం చూస్తే అతనెప్పుడో అదృశ్యమయ్యాడు. కొద్దిసేపటి తరువాత డాక్టర్‌ డొమినిక్‌ తలుపు తెరుచుకొని లోపలకొచ్చాడు.
‘నీకేమీ కాలేదు కదా?’ అని అడిగాడు. 
‘లేదు. కానీ నిరాశ మిగిలింది.’ అన్నాను.
డాక్టర్‌ డొమినిక్‌ నేలమీద పగిలిన సీసా పక్కనే గోధుమరంగు చేయిని చూసి ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. నేను చేసిన ప్రయోగం విఫలమైందని తెలిపాను. అది విని డాక్టర్‌ నొచ్చుకున్నాడు. ఇంటికొచ్చిన అతిథిని ప్రమాదాల్లోకి  నెట్టడం అనుచితం, అనైతికమని బాధపడ్డాడు.  
‘నా బాధలు నేను పడతాను. నువ్వు వెనక్కెళ్ళిపో’ అని ప్రాధేయపడ్డాడు. మళ్ళీ ఆ గదిని ఉపయోగించడానికి వీల్లేదని  కట్టడి చేశాడు. నా అభ్యర్థనను మన్నించి, మిగిలిన ఆ రాత్రి మాత్రం అక్కడే ఉండడానికి ఒప్పుకున్నాడు. 
నేనక్కడే పడుకొని నా ప్రయోగం ఎందుకు విఫలమైందా అని బాధపడుతూ గడిపాను. ఉదయమే లేచి చూస్తే ’కళాసీ’   చేయి ఇంకా అక్కడే పడి ఉంది. అలా చూస్తుండగా నా బుర్రలోకి ఒక ఆలోచన బులెట్లా  దూసుకొచ్చింది.  ఇంకొకసారి ఆ చేయికేసి చేశాను. కరెక్ట్‌. అది కళాసీవాడి  ‘ఎడమ చేయి’. 
 

నేను వెంటనే టౌనుకెళ్ళి‘సీమెన్స్‌’  ఆస్పత్రి చేరుకున్నాను. నాకు బాగా గుర్తు. ఆ ‘ఓడకళాసీ’కి రెండు చేతులూ కత్తిరించేశారని. నేను ఏ అవయవం కోసం ఆరాటపడుతూ వచ్చానో దానికి ఈ పాటికే అంత్యక్రియలు జరిగిపోయుంటాయేమో? అనే అనుమానం నన్ను పీడిస్తూ ఉంది. అక్కడికెళ్ళి చూస్తే, అదింకా పోస్ట్‌మార్టం గదిలోనే ఉంది. దాంతో నా ఉత్కంఠకు తెరపడింది. చేయిని తీసుకొని వెంటనే తిరుగుముఖం పట్టాను. డాక్టర్‌ డొమినిక్‌ అతిథిసత్కార ఉల్లంఘనకు పాల్పడ్డానని అపరాధ భావనతో కృంగిపోతున్నాడు. అతనికి చెప్పితే  నన్ను ప్రయోగశాలలోనికి అడుగు పెట్టడానికేమాత్రం అంగీకరించడు. అందుకని అంకుల్‌కు తెలియకుండా ప్రయోగశాల లోనికి ప్రవేశించి ఇంతకుముందు ఎడమ చేయినేవిధంగా పెద్ద గాజు జాడీలో ఉంచానో, కుడి చేయిని కూడా అదే విధంగా ఉంచాను. ఇంతకుముందు గడిపిన గది కాకుండా కొంతదూరంలో నిన్నటిరాత్రి జరిగిన దృశ్యం కనబడేలాగా ఇంకొక గదిలోకెళ్ళి వేచిచూడసాగాను.
∙∙ 
ఆ అర్ధరాత్రి, డాక్టర్‌ డొమినిక్‌ నా గదిలోకి దూసుకొచ్చాడు ఒక చేతిలో దీపం పట్టుకొని. ఆయన ముఖంలో ఆనందం  తాండవిస్తూ ఉంది. 
‘మనం విజయం సాధించాము.’ అని గట్టిగా కేకలు పెడుతూ నా చెయ్యి పట్టుకొని ఊపేశాడు.
‘అల్లుడా! నువ్వు చేసిన మేలు ఎన్నటికీ మరువలేను. నీ రుణం తీర్చుకోలేనిది.’ ఉద్వేగంతో చెప్పాడు. 
‘ఎలా చెప్పగలరు మనం విజయం సాధించామని? మీరేమైనా  చూశారా?’ అడిగాను.
‘అవునయ్యా! చూశాను. ఇక నుంచి నాకా చిత్త క్షోభ ఉండదని గట్టిగా చెప్పగలను. ఆ ఒంటిచేయి మనిషి ప్రతిరాత్రి ఒక నిర్ణీత సమయంలో నా దగ్గరకొచ్చేవాడు. ఈ రాత్రి కూడా అలాగే వచ్చాడు. గతరాత్రి అతడు పొందిన నిరాశవల్ల నా మీద కోపం ఎక్కువై ఉంటుందనుకొన్నాను. మామూలుగా అతడు నా వద్దకొచ్చి నా వైపు కోపంగా చూసి అలవాటు ప్రకారం ప్రయోగశాలను చూడ్డానికెళ్ళాడు. కానీ కొన్ని నిముషాలలోనే నా గదికి తిరిగి వచ్చి అతడు ఈ హింస ప్రారంభించినప్పటి నుండి మొదటి సారిగా నా వైపు చూసి నవ్వాడు. అప్పుడు అతడి తెల్లని దంతాల కాంతి ఆ మసకవెలుతురులో తళుక్కున మెరవడం చూశాను. నా ఎదుట వినయంగా నిలబడి వారి మతసాంప్రదాయానుసారం మూడుసార్లు తలవంచి సలాం చేసి వీడ్కోలు తీసుకున్నాడు. మూడోసారి అతడు వంగి తన రెండుచేతులను జోడించి శిరస్సు వంచి నమస్కరించాడు. అప్పుడు చూశాను అతడు గాలిలోకి ఎత్తిన రెండు చేతులను. తరువాత అతను మాయమయ్యాడు శాశ్వతంగా. అతనిక రాడని నిశ్చయంగా చెప్పగలను’.
∙∙ 
అదీ డాక్టర్‌ డొమినిక్‌ హోల్డాన్‌తో నేను పొందిన అనుభవం. ఆతరువాత ఒంటిచేయి మనిషి మరెప్పటికీ అంకుల్‌ ఇంటిని సందర్శించలేదు. అంతటితో డాక్టర్‌  డొమినిక్‌ దంపతుల కడగండ్లు కడతేరాయి. ఇక మిగిలిన జీవితమంతా వారిద్దరూ సంతోషంగా గడిపారు. కొన్నివారాల తేడాతో ఇద్దరూ ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి సోకి చివరి శ్వాస విడిచారు. డాక్టర్‌ డొమినిక్‌  తను జీవించినన్నాళ్ళు ప్రతి విషయంలోనూ నా సలహా కోసం వచ్చేవాడు. అతని ఎస్టేట్‌ అభివృద్ధిపరిచే విషయంలో నేనెంతో సహకరించాను. తరువాత కోపంతో ఊగిపోతున్న తన ఐదుమంది కజిన్స్‌ను కాదని మొత్తం ఎస్టేటుకు  నన్ను అధిపతిని చేశాడు. ఆ విధంగా ఒక్క రోజులో నేను కష్టపడి ప్రాక్టీస్‌ చేసుకునే మామూలు డాక్టర్‌ స్థాయినుండి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న విల్ట్‌ షైర్‌ కుటుంబ అధిపతిస్థాయికి ఎదిగాను. ఈ సందర్భంగా ఒంటిచేయి మనిషికి కృతజ్ఞతలనర్పించుకోవడం నా కనీస ధర్మం.

మరిన్ని వార్తలు