'తాతను మరచి ముందుకు సాగిన మ‌నుమ‌డి' పాద‌యాత్ర‌!

14 Dec, 2023 10:59 IST|Sakshi

పేలవంగా లోకేష్‌ పాదయాత్ర!

తొలిరోజు స్పందన అంతంతమాత్రమే..

అనితకు వ్యతిరేకంగా నిరసన గళం!

అనకాపల్లి: జెండాల హడావుడే గానీ జనం సందడి లేని నారా లోకేష్‌ పాదయాత్ర జిల్లాలో పేలవంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ తొలిరోజు చప్పగా సాగింది. జేజేలు పలకాల్సిన పార్టీ శ్రేణులు నిరసన గళానికే ప్రాధాన్యమిచ్చాయి. తుని పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో లోకేష్‌ పాయకరావుపేటలోకి అడుగుపెట్టారు.

గౌతం సెంటరు వద్ద మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తన అనుయాయులతో స్వాగతం పలికారు. జనం ఆసక్తి చూపకపోయినా.. అదే సమయానికి సినిమాహాళ్ల నుంచి బయటకు వచ్చినవారు, భవన నిర్మాణ పనులకు వెళ్లిన కార్మికులు, విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే ఉద్యోగులు కనిపించడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్‌రోడ్డులో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపేసినా తెలుగు తమ్ముళ్ల జాడ అంతంతమాత్రంగానే ఉంది.

పాయకరావుపేటలో అనిత వ్యతిరేక, అనుకూల వర్గాలు ఎవరికి వారు వేర్వేరుగా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు రావడం గమనార్హం. పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పెద్దగా పాల్గొనలేదు. ఆ పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి లోకేష్‌ను కలిశారు. ఈ పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ బుద్దనాగజగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

తాతను మరచిన మనుమడు
లోకేష్‌ పాదయాత్ర గౌతం సెంటరు, మంగవరంరోడ్డు మీదుగా పాయకరావుపేట వై జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముందు నుంచే లోకేష్‌ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తాత విగ్రహం ముందు నుంచి వెళ్లి కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్తుపోయారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నారని, ఆయన పెట్టిన పార్టీ లాక్కుని పదవులు అనుభవిస్తూ కనీసం ఆయన విగ్రహానికి దండ వేయకపోవడమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనితకు అసమ్మతి సెగలు!
యువగళం పాదయాత్రలో నియోజకవర్గంలో పార్టీ కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. నారా లోకేష్‌ సాక్షిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు నిరసన సెగ తగిలింది. అనిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, మాజీ పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు జీవీఆర్‌ నగర్‌ వద్ద ఉన్న వంగవీటి మోహన్‌రంగా విగ్రహం వద్ద అనిత ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

లోకేష్‌ పాదయాత్ర అక్కడకు చేరుకోగానే అనిత వద్దు, టీడీపీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు గమనించిన అనిత వెంటనే అక్కడకు వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేయగా ‘మమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయించారు. మేం చేసిన తప్పేంటి’ అని నిలదీశారు. లోకేష్‌ వారిని సముదాయించి యాత్ర కొనసాగించారు. బైపాస్‌ జంక్షన్‌, ప్రకాష్‌ కళాశాల, పీఎల్‌పురం, సీతారాంపురం మీదుగా నామవరం చేరుకొని, అక్కడ ప్రైవేటు లేఅవుట్‌లో రాత్రి బస చేశారు.
ఇవి చ‌ద‌వండి: 15న మంత్రివర్గ సమావేశం

>
మరిన్ని వార్తలు