గొంతుకోసుకున్న విద్యార్థి

25 Feb, 2023 08:56 IST|Sakshi
విద్యార్థి నాగార్జున

పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోనన్న ఆందోళనే కారణం

ఆత్మకూరు: పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోనన్న భయంతో గొంతుకోసుకొని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాలమేరకు... రొద్దం మండలంలోని ఆర్‌.లోచెర్ల గ్రామానికి చెందిన నాగార్జున అనే పదో తరగతి విద్యార్థి ఈనెల 21న రొద్దంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు రొద్దంలోని పోలీసుస్టేషన్‌లో విద్యార్థి అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే 23న ఆత్మకూరులోని మారెమ్మ ఆలయం వద్ద ఓ బాలుడు ఒంటరిగా ఉండటం చూసిన స్థానికులు ఆ బాలుడికి అన్నం పెట్టారు.

ఆ బాలుడు వివరాలు సరిగా చెప్పకపొవడంతో రాత్రికి ఆలయం వద్దనే పడుకుంటా అని చెప్పడంతో స్థానికులు ఆ బాలుడిని బీసీ హాస్టల్‌లో రాత్రికి పడుకొని ఉదయమే ఊరికి వెళ్లు అని హాస్టల్‌లో వదిలి వెళ్లారు. అయితే ఆ బాలుడు గురువారం అర్ధరాత్రి బాత్రూంలోకి వెళ్లి బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు , హాస్టల్‌ సిబ్బంది ఆ బాలుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ రంగయాధవ్‌ ఆ బాలుడి ఆచూకీ తెలుసుకొని తల్లి నాగలక్ష్మికి శుక్రవారం అప్పగించారు. త్వరలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని, ఫెయిల్‌ అవుతానేమోనన్న భయంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నాగార్జున తెలిపాడు. ఆ బాలుడికి నచ్చచెప్పి తల్లి నాగలక్ష్మితో ఇంటికి పంపించారు.

మరిన్ని వార్తలు