విద్యుదాఘాతంతో జేఎల్‌ఎం మృతి

3 Jun, 2023 00:22 IST|Sakshi
మృతుడు కుమార్‌ రాజ

గుంతకల్లు రూరల్‌: విద్యుత్‌ మరమ్మత్తు చేస్తూ ఇండక్షన్‌ షాక్‌కు గురై గ్రేడ్‌ టు జేఎల్‌ఎం కుమార్‌ రాజ (45) మృతిచెందిన ఘటన శుక్రవారం గుంతకల్లు పట్టణంలోని అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. సహచర ఉద్యోగుల వివరాల మేరకు.. పట్టణంలోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన మునయ్య, రత్నమ్మ దంపతుల కుమారుడు కుమార్‌ రాజ విద్యుత్‌శాఖలో గ్రేడ్‌టు జేఎల్‌ఎంగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని అశోక్‌ నగర్‌ కాలనీకి తోటి ఉద్యోగులతో కలిసి మరమ్మతు చేపట్టేందుకు వెళ్లాడు. విద్యుత్‌ పోల్‌ పైకి ఎక్కి మరమ్మతు చేస్తున్నారు. అయితే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇండక్షన్‌ షాక్‌కు గురవడంతో కుమార్‌ రాజ పై నుంచి కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ బాధ్యతల దృష్ట్యా కుమార్‌ రాజ ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదని తోటి ఉద్యోగులు తెలిపారు. కసాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నేకొత్తపల్లిలో మరొకరు...

చెన్నేకొత్తపల్లి: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని గంగినేపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన వివరాల మేరకు.. గంగినేపల్లికి చెందిన అమరనాథ్‌ (37) నూతనంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇంటికి నీరు పెట్టేందుకుగాను వాడుతున్న మోటర్‌కు కనెక్షన్‌ ఇచ్చే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు