పథకాలు గ్యారంటీగా అమలు | Sakshi
Sakshi News home page

పథకాలు గ్యారంటీగా అమలు

Published Sat, Jun 3 2023 12:22 AM

మాట్లాడుతున్న సిద్దరామయ్య, చిత్రంలో డీకే.శివకుమార్‌ తదితరులు  - Sakshi

బనశంకరి: ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 5 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం విధానసౌధలో మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి పథకాల అమలుకు సంబంధించి ప్రకటన చేశారు. ప్రతి కుటుంబ యజమానికి నెలకు రూ.2 వేలు, కేఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌, అన్నభాగ్య కింద ప్రతి ఒక్కరికీ ఉచితంగా 10 కిలోల బియ్యం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిస్తామని ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం తెలిపారు. ప్రతి ఇంటికీ ఈ ఐదు హామీలను అమలు చేస్తామని చెప్పారు. హామీల అమలుపై ప్రతిపక్షాల నేతలు విమర్శలు చేశారని, మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారన్నారు. మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదుగ్యారంటీలు అమల్లోకి తీసుకురావాలని తీర్మానించామన్నారు. కుతమతాలకు అతీతంగా ఈ పథకాలను ప్రజలుకు అందిస్తామని తెలిపారు.

శక్తియోజన : ఏసీ, స్లీపర్‌ బస్సులు మినహా మిగిలిన కేఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి శక్తియోజన పథకాన్ని జూన్‌ 11నుంచి అమలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికై నా ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ఈ పథకం వర్తించదు.

గృహజ్యోతి : 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించే గృహజ్యోతి జులైనుంచి అమలు చేస్తారు.

గృహలక్ష్మి: ఇంటి యజమానికి ప్రతినెల రూ.2 వేలు అందించే గృహలక్ష్మి పథకాన్ని ఆగస్టు 15నుంచి అమలు చేస్తారు.

అన్నభాగ్య: ప్రతి కార్డుదారుడికీ పదికిలోలు బియ్యం ఉచితంగా అందించే అన్నభాగ్య పథకాన్ని జూలై 1నుంచి అమలు చేస్తామన్నారు.

యువనిధి: డిగ్రీ పట్టభద్రులకు రూ.3వేలు, డిప్లొమా అభ్యర్థులకు రూ.15వేలు అందించే యువనిధి పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఈ పథకానికి తేదీ ప్రకటించలేదు.

మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం

ఐదు హామీలను నెరవేరుస్తాం

సీఎం సిద్దరామయ్య

Advertisement

తప్పక చదవండి

Advertisement