కాంతులీనే ‘కార్తీకం’

14 Nov, 2023 01:24 IST|Sakshi
అనంతపురంలోని విరూపాక్షేశ్వరుడు

అనంతపురం కల్చరల్‌: శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధ శైవక్షేత్రాలు కార్తీక పూజోత్సవాలకు సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ మాసంలో వచ్చే నాలుగు సోమవారాలు, కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి, కేదారేశ్వరీ నోములతో ప్రతి ఇంటా కాంతులీనుతుంటాయి. నిత్య శివారాధన, మారేడు దళాలు, తమ్మిపూల పూజలు, దీపకాంతులతో ఉభయ జిల్లాల వ్యాప్తంగా ఉన్న శైవాలయాలు ప్రత్యేక శోభను సంతరించుకుంటాయి. కార్తీక మాసం ఈ నెల 14తో ప్రారంభమై వచ్చే నెల 12వ తేదీ వరకూ ఉంటుంది. రెండో సోమవారం నాడే కార్తీక పౌర్ణమి రానుండడం విశేషం. క్షీరాబ్ధి ద్వాదశి, జ్వాలాతోరణం, నాగపంచమి పర్వదినాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ మాసం ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే కాక సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుందని అనంతపురంలోని పాతూరులో ఉన్న అత్యంత పురాతన విరూపాక్షేశ్వరాలయం అర్చకులు నిఖిల్‌ నారాయణ శ్రౌతులు తెలిపారు. ఈ మాసంలో తక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారన్నారు. కనీసం కార్తీక సోమవారాలతో పాటూ పౌర్ణమి నాడు చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పుణ్యఫలం దక్కుతుందని కార్తీక పురాణంలో స్పష్టంగా పేర్కొనట్లుగా వివరించారు.

మరిన్ని వార్తలు