Sakshi News home page

రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా టోర్నీ విజేత ‘అనంత’

Published Tue, Nov 14 2023 1:24 AM

అండర్‌–19 బాలికల విజేతగా నిలిచిన జట్టు - Sakshi

ఉరవకొండ: ఏపీ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో జిల్లా జట్లు విజయకేతనం ఎగురవేశాయి. అండర్‌ –17, 19 విభాగాల్లో జరిగిన బాలికల ఫైనల్‌ పోటీల్లో పశ్చిమగోదావరి జట్లపై అనంతపురం జట్లు విజయం సాధించాయి. అండర్‌–14 బాలికల విభాగంలో 3వ స్థానం దక్కింది. ఈ క్రమంలో అండర్‌ –17, 19 విభాగాల్లో ప్రతిభ చాటిన వజ్రకరూరు మండలం తట్రకల్లు కేజీబీవీ విద్యార్థులు మానస, రమ్య, సురేఖ, తేజు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను ఉభయ జిల్లాల ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు సుగుణమ్మ, అంజన్న, కో–ఆర్డినేటర్‌ నాగరాజు, పీడీలు మారుతి, వన్నూరుస్వామి, సెపక్‌తక్రా అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ సప్తగిరి మల్లికార్జున, చైర్మన్‌ షాహీన్‌ అభినందించారు.

15న హ్యాండ్‌బాల్‌ బాలికల జట్టు ఎంపిక

కళ్యాణదుర్గం రూరల్‌: ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలికల జట్టు ఎంపికను ఈ నెల 15న అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శివశంకర్‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2004, జనవరి 1 తర్వాత జన్మించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంట ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తీసుకుని ఎంపికలకు హాజరు కావాలి. పూర్తి వివరాలకు 89781 37522, 97058 85939లో సంప్రదించవచ్చు.

నేటి నుంచి సహకార వారోత్సవాలు

అనంతపురం అగ్రికల్చర్‌: ఏటా నవంబర్‌ 14 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించనున్న అఖిల భారత సహకార వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 70వ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు రాయలసీమ సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్‌ బి.శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలిరోజు మంగళవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ‘భారత దేశాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో సహకార సంఘాల పాత్ర’ అనే అంశం ఆధారంగా చర్చాగోష్టి నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు సహకార రంగం ఆవిర్భావం, విశిష్టత, సహకార సూత్రాలు, సహకార పతాకం, అందిస్తున్న సేవలు, సహకార వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలను చైతన్య పరుచే కార్యక్రమాలు ఉంటాయి.

Advertisement

What’s your opinion

Advertisement