బాల కార్మికుల గుర్తింపునకు ప్రత్యేక డ్రైవ్‌

17 Nov, 2023 00:28 IST|Sakshi
అధికారులతో సమీక్షిస్తున్న జేసీ కేతన్‌గార్గ్‌

అనంతపురం అర్బన్‌: బాల కార్మికులను గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా 20 రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశించారు. జేసీ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను బాల కార్మిక రహితంగా మారుద్దామని పిలుపునిచ్చారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 20 నుంచి డిసెంబరు 10 వరకు బాల కార్మిక తనిఖీల డ్రైవ్‌ నిర్వహించాలని చెప్పారు. దుకాణాలు, హోటళ్లు, మెకానిక్‌ షాపులు, డాబాలు, ఇటుకబట్టీలు, భవన నిర్మాణ పనులు, గనులు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. 14 ఏళ్లు అంతకు లోపు వయసున్న బాలలతో పనిచేయించడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ వయసు బాలలతో పనిచేయిస్తున్న యాజమాన్యాలు, యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని చెప్పారు. ప్రమాదకర వృత్తుల్లో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాలలతో పనిచేయించడం నేరమన్నారు. చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తనిఖీలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ మేడా రామలక్ష్మి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ లక్ష్మినరసయ్య, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్‌రావు, ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేశవులు, డీఈఓ నాగరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ వరప్రసాద్‌, కార్మిక శాఖ ఏసీ రఘురాములు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

భూసేకరణ పూర్తవ్వాలి

ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియలో జాప్యానికి తావివ్వకుండా త్వరితగతిన పూర్తిచేయాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 544డీ జాతీయ రహదారి, బీటీపీ, రైల్వే ప్రాజెక్టులు, బంజారా, ఎరుకల భవనాలు, గురుకుల పాఠశాలలు, విభిన్న ప్రతిభావంతుల గృహం, కార్పొరేషన్లకు కమ్యూనిటీ భవనాలు, పర్యాటక రంగం తదితర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌డీఓలు గ్రంధి వెంకటేశ్‌, రాణి సుస్మిత, శ్రీనివాసులు రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

మరిన్ని వార్తలు