పారదర్శకంగా ‘సంక్షేమం’

17 Nov, 2023 00:28 IST|Sakshi
మాట్లాడుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు

అనంతపురం/టవర్‌క్లాక్‌: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా సాగుతోందని సీ.రాఘవా చారి ఏపీ మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకున్న ఆయనకు డీపీఆర్‌ఓ గురుస్వామిశెట్టి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత తదితర వర్గాలు పొందిన ప్రయోజనాలపై ఆయా వర్గాల ప్రజలకు, మీడియాకు సమగ్ర సమాచారం ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో సీఎం జగన్‌ చరిత్ర సృష్టించారన్నారు. విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇచ్చి అండగా నిలిచారన్నారు. వృద్ధులు అవస్థలు పడకుండా ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్‌ అందజేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఆర్‌బీకేలతో రైతులకు చేయూతనిస్తున్నారని చెప్పారు. గ్రామాలకే స్పెషలిస్టు వైద్యులను పంపి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నారన్నారు. వైద్య, విద్య రంగాలకు పెద్ద పీట వేసి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌గా నిలవడం హర్షణీయమన్నారు.

విషం కక్కడం మానాలి

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేసే అంశంపై ప్రతిపక్షంతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు విషం కక్కాయని, మరికొందరు కోర్టుకు వెళ్లారన్నారు. కోర్టుకు వెళ్లిన వారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికాధిపతుల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదివినట్లు తమ పరిశీనలలో తేలిందని వెల్లడించారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నపుడు శ్రీ సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తీవ్రంగా విమర్శించాయని, 2018లో అవే పత్రికలు ‘బతుకులు మార్చిన భాగ్య సిటీ’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించాయని గుర్తు చేశారు. ఆరోగ్యం బాలేదని కోర్టుకు చెప్పిన చంద్రబాబు.. అదే నిజమైతే మూడు నెలల పాటు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా విశ్రాంతిలో ఉండాలని సూచించారు. తాత్కాలిక బెయిల్‌ వచ్చినపుడు 14 గంటల పాటు హైదరాబాద్‌కు ర్యాలీగా వెళ్లారని, అలాంటి వ్యక్తికి మూడు నెలల విశ్రాంతి కావాలని పేర్కొనడం విడ్డూరమన్నారు. కాగా, ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు ‘కొమ్మినేని’ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అర్హులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు