కోడిపెంట కింద గోవా మద్యం | Sakshi
Sakshi News home page

కోడిపెంట కింద గోవా మద్యం

Published Tue, Dec 12 2023 1:24 AM

నిందితులను అరెస్ట్‌ చూపుతున్న సెబ్‌ పోలీసులు   - Sakshi

అనంతపురం క్రైం: కోడి పెంట కింద మద్యం బాటిళ్లు దాచి అక్రమంగా గోవా నుంచి అనంతకు తరలిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో మొత్తం ఆరుగురిని సెబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలను డీపీఓలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబ్‌ ఏఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం ఈదులముష్టూరు నివాసి మాలపాటి రవితేజ, ధర్మవరం కేతిరెడ్డి కాలనీకి చెందిన షాహిద్‌ ఖాన్‌, అనంతపురం నగరం కేతిరెడ్డి కాలనీకి చెందిన లోచర్ల హరికృష్ణ, పుట్లూరు మండలం చింతరపల్లి గ్రామానికి చెందిన పుట్లూరు రామాంజినేయరెడ్డి, శింగనమల మండలం కొరివిపల్లి నివాసి దూదేకుల కుళ్లాయిస్వామి (ప్రస్తుతం తాడిపత్రి టైలర్స్‌ కాలనీలో నివాసం), తాడిపత్రిలోని రెడ్డివారిపల్లి వీధికి చెందిన చన్నా జయచంద్ర ప్రతాప్‌ బృందంగా ఏర్పడి రెండు నెలల క్రితం ఒక సెకండ్‌ హ్యాండిల్‌ ఐచర్‌ వాహనాన్ని కొనుగోలు చేశారు. అనంతరం గోవాకు వెళ్లి అక్కడ ఫుల్‌బాటిళ్ల మద్యం కొనుగోలు చేసి ఐచర్‌ వాహనంలో కోడి పెంట కింద దాచి జిల్లాకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈ క్రమంలో మద్యం అక్రమ రవాణాపై నిఘా ఉంచిన సెబ్‌ ఏఎస్పీ రామకృష్ణ, అర్బన్‌ డీఎస్పీ ప్రసాదరెడ్డి పర్యవేక్షణలో వన్‌టౌన్‌ సీఐ రెడ్డప్ప, ఎస్‌ఐ సుధాకరయాదవ్‌, సిబ్బంది బృందాలుగా విడిపోయి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అనంతపురంలోని చెరువు కట్ట వద్ద పటిష్ట తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన షిప్ట్‌ కారును ఆపి తనిఖీ చేస్తుండగా అందులో ప్రయాణిస్తున్న వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీశారు. దీంతో మద్యం అక్రమ రవాణా వెలుగు చూసింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఐచర్‌ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా కోడిపెంట కింద దాచిన 262 పుల్‌ బాటిళ్ల మద్యం బయటపడింది. ఐచర్‌తో పాటు కారును సీజ్‌ చేసి, రూ.35,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేశారు.

ఆరుగురి అరెస్ట్‌

ఐచర్‌ వాహనంతో పాటు కారు, రూ. 35 వేల నగదు స్వాధీనం

Advertisement
Advertisement