అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్‌

Published Tue, Dec 12 2023 1:24 AM

పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలు  - Sakshi

అనంతపురం క్రైం: జల్సాల కోసం ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను సీసీఎస్‌, వన్‌టౌన్‌, ఉరవకొండ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. పట్టుబడిన వారిలో వైఎస్సార్‌ జిల్లా మైలవరం మండలం బూబుసానిపల్లికి చెందిన గువ్వల పుల్లారెడ్డి, బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లి నివాసి గుంప వెంకటరమణారెడ్డి ఉన్నారు. వీరిద్దరూ స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు డబ్బు కోసం ద్విచక్ర వాహనాలను అపహరించుకెళ్లి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వీరిపై గతంలో వైఎస్సార్‌ జిల్లా యర్రగుంట్ల, అనంతపురం నాల్గో పట్టణ, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీసుస్టేషన్ల పరిధిలో కేసులున్నాయి. చాలా కాలంగా ఇద్దరూ ఉరవకొండ, తాడిపత్రి, బళ్లారి, కర్నూలు తదితర ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన వాహనాలను అపహరించారు. ఆయా కేసుల దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐలు జీటీనాయుడు, రెడ్డప్ప, సీసీఎస్‌ ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది తిరుమలేష్‌, ప్రవీణ్‌, శ్రీనివాసులును ఎస్పీ అన్బురాజన్‌ అభినందించారు.

విద్యుదాఘాతంతో

వివాహిత మృతి

కళ్యాణదుర్గం రూరల్‌: విద్యుత్‌ షాక్‌కు గురై ఓ వివాహిత మృతి చెందింది. వివరాలు... కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లికి చెందిన దోణ తిమ్మప్ప భార్య శిల్ప (29) నిర్మాణంలో ఉన్న ఇంటికి సోమవారం ఉదయం క్యూరింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. పని ముగియగానే మోటార్‌ ఆఫ్‌ చేసే క్రమంలో ప్లగ్‌ తీస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌కు గురై కుప్పకూలింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, శిల్పకు ఆరేళ్ల వయసున్న కుమారుడు, మూడేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

శిల్ప (ఫైల్‌)
1/1

శిల్ప (ఫైల్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement