డిజిటల్‌ పద్ధతుల్లో.. అధికారులు పర్యవేక్షించేలా..

31 Jul, 2020 19:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: 104 కాల్‌ సెంటర్‌ను మరింత సమర్థవంతగా తీర్చిదిద్దుతున్నారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలు అందించేలా ఆ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరీక్షలు చేయించడం దగ్గర నుంచి ఆస్పత్రిలో బెడ్ల కేటాయింపు వరకు అన్ని సేవలను పొందడానికి ఆ వ్యవస్థ వీలు కల్పిస్తుంది. కాల్‌ చేసిన వ్యక్తికి సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ డిజిటల్‌ పద్ధతుల్లో దాన్ని అధికారులు పర్యవేక్షించేలా ప్రోగ్రాం రూపొందించారు. సమస్య పరిష్కారమైన తర్వాతే ప్రోగ్రాం నుంచి ఆ సమస్య తొలగించబడుతుంది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఈ చర్యలు తీసుకుంది. కోవిడ్‌ నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో 104 కాల్‌ సెంటర్‌ బలోపేతానికి తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.  ('అజ్ఞాతవాసి ఇకనైనా కళ్లు తెరువు')

సేవలు ఇలా..
104కు  కాల్‌ చేయగానే కోవిడ్‌ పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి? టెస్ట్‌ సెంటర్‌ ఎక్కడుంది? దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎక్కడుంది? సంబంధిత ప్రాంతంలో ఏఎన్‌ఎం ఎవరు? సంబంధిత డాక్టర్‌ సమాచారం ఏంటి? తదితర సమాచారాన్ని పొందవచ్చు. 
కోవిడ్‌ ఉందని అనుమానం ఉంటే.. వెంటనే 104కు కాల్‌ చేయగానే డాక్టరు అందుబాటులోకి వస్తారు. కాల్‌ చేసిన వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య వివరాలు తెలుసుకుని టెస్టు చేయించుకోవాల్సిన అవసరం ఉందో? లేదో? నిర్ణయం తీసుకుంటారు. 
డాక్టర్‌ సిఫార్సు మేరకు టెస్టు చేయించుకున్న తర్వాత.. పాజిటివ్‌గా తేలితే, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోకుంటే.. ఆ వ్యక్తి నేరుగా మళ్లీ 104కు కాల్‌ చేయొచ్చు. అప్పుడు సంబంధిత సిబ్బంది నేరుగా ఫాలో అప్‌ చేసి తగిన చర్యలు తీసుకుంటారు. 
ఆ చర్యల్లో భాగంగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తికి డాక్టర్‌ ఫోన్‌ చేస్తారు. వైరస్‌ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తారు. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని హోం ఐసోలేషన్‌ లేదా, కోవిడ్‌  కేర్‌ సెంటర్‌ లేదా ఆస్పత్రిలో అడ్మిట్‌ చేయిస్తారు. 

104కు కాల్‌ చేసి పై రిక్వెస్టుల్లో ఏది చేసినా సరే.. అది ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రోగ్రాంలో నమోదు అవుతుంది. కాలర్‌ చెప్పిన సమస్య పూర్తిగా పరిష్కారం అయిన తర్వాతనే ఆ రిక్వెస్ట్‌ పరిష్కరించినట్టుగా చూపిస్తుంది. లేకపోతే ఆ సమస్య పెండింగులో ఉన్నట్టుగానే భావిస్తారు. వీటితోపాటు ఆస్పత్రుల్లో బెడ్లు, వాటి భర్తీ, ఉన్న ఖాళీలపైన కూడా ఎప్పటికప్పుడు వివరాలను అప్‌డేట్‌ చేస్తూ.. 104తో పాటు, కోవిడ్‌ ఆస్పత్రుల వివరాలను అందుబాటులో ఉంచుతున్నారు. దీని వల్ల ఆలస్యాన్ని నివారించడంతో పాటు మెరుగైన సేవలు లభించనన్నాయి. ఇంకా వాటి నిర్వహణ సులభం కానుంది.

మరిన్ని వార్తలు