ధాన్యం సేకరణకు 50 లక్షల ఓవెన్‌ బ్యాగ్‌లు

19 Oct, 2020 04:45 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌ నుండి ఆగిన గోనె సంచుల సరఫరా

ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ఇబ్బంది లేకుండా సంచుల కోసం టెండర్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గోనె సంచుల కొరత ఏర్పడింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి సరఫరా కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరు నెలలుగా సరఫరా ఆగిపోవడంతో ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బందులు తలెత్తకుండా 50 లక్షల సంచులను (ఓవెన్‌ బ్యాగులు) కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇందుకు టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో 62 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించగా.. అందుకు అవసరమైన సంచులను సిద్ధం చేస్తున్నారు.

రేషన్‌ డీలర్ల నుంచి సేకరిస్తున్నా..
సంచుల కొరత నుంచి గట్టెక్కేందుకు బియ్యం పంపిణీ కోసం వినియోగించిన గోనె సంచులను రేషన్‌ డీలర్ల నుంచి పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. రైస్‌ మిల్లర్ల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన సేకరిస్తున్నారు. అయినప్పటికీ ఆ సంచులు ఏమాత్రం సరిపోయే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో తాత్కాలిక ఉపశమనం పొందేందుకు 50 లక్షల సంచులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.  
 

మరిన్ని వార్తలు